Abn logo
Jul 24 2021 @ 21:25PM

జగన్‌ రాజకీయ నాయకుడు కాదు.. ప్రజా నాయకుడు

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో రిమోట్‌తో స్విచ్‌ ఆన్‌ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి


బుచ్చిరెడ్డిపాళెం, జూలై 24: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ నాయకుడు కాదు.. ప్రజా నాయకుడని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం బుచ్చి బస్టాండ్‌ సెంటర్‌లోని జాతీయ రహదారిపై  సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఓవైపు.. అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు రెండు కళ్లుగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అంటే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ బాగా తెలుసని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏ పనైనా పట్టుదలతో సాధిస్తాడని కొనియాడారు. సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవం కోసం వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి, నీటిపారుదల శాఖామంత్రి పీ. అనీల్‌కుమార్‌ యాదవ్‌, ఈఎన్సీ సుబ్బారెడ్డి దామరమడుగు చేరుకోగానే వైసీపీ నేతలు, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, మాజీ పెన్నాడెల్టా చైర్మన్‌ ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, మాజీ ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, హెచ్‌డీసీ సభ్యుడు టి.నందకుమార్‌, స్థానిక నాయకులు అహ్మద్‌బాషా, భాస్కర్‌రెడ్డి, కత్తి మహేష్‌ ఆధ్వర్యంలో సుమారు 4వందల బైక్‌లతో ర్యాలీ నిర్వహించి, మంత్రి పెద్దిరెడ్డికి ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి మొదట కాగులపాడు వద్ద రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. తర్వాత రేబాలలోని పశువైద్యశాలను, బుచ్చిలోని నూతన సచివాలయాన్ని, వవ్వేరు బ్యాంకు ఆవరణలో కొత్తగా నిర్మించిన రెండు  గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం బుచ్చి బస్టాండ్‌లో ముందుగా సెంట్రల్‌ లైటింగ్‌, సిమెంట్‌ రోడ్డును పరిశీలించి శిలాఫలకం ఆవిష్కరించి, రిమోట్‌తో స్విచ్‌ ఆన్‌ చేసి లైట్లు వెలిగించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి కొనియాడారు. భవిష్యత్‌లో మళ్లీ సీఎంగా జగన్‌కే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే మంత్రి రాక 4 గంటలు ఆలస్యం కావడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎండ తీవ్రతకు కొంత నీరసించారు. 


పాత పద్ధతిన నగదు డ్రా చేసుకునేలా వినతి 

మండలంలోని పలువురు సర్పంచులు గ్రామంలో చేపట్టే చిన్నచిన్న పనులకు కూడా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పంచాయతీ నిధులు వాడుకునే విధానం కొంత ఇబ్బందికరంగా ఉందని, పాత పద్ధతితో నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డికి పెనుబల్లి, మునులపూడి, నాగాయగుంట సర్పంచులు వినతిపత్రం సమర్పించారు. ముందుగా ఆయనను సర్పంచులు, స్థానిక వైసీపీ నేత  ఆదినారాయణ గజమాలలు, పూల కిరీటాలతో పెద్దిరెడ్డి, అనిల్‌ కుమార్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా చైర్మన్‌ నిరంజన్‌ బాబురెడ్డి, ఎన్‌డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, రూప్‌కుమార్‌, నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో నరసింహారావు, డీఎస్పీ హరనాథ్‌రెడ్డి, ఇరిగేషన్‌ డీఈ మధుసూదన్‌రావు, ఏఈ వినయ్‌కుమార్‌, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మంత్రి పెద్దిరెడ్డికి అంగన్‌వాడీల వినతి 

బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చిలో సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన  పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అంగన్‌వాడీలు, యానిమేటర్లు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. నూతన విద్యా విధానం అమలు చేసే జీవో 172ను రద్దు చేయాలని కోరారు. అంగన్‌వాడీల నిర్వహణకు ట్యాబ్‌లు, స్మార్ట్‌ ఫోన్లు  ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద రూ.3లక్షలు, పింఛన్‌ ఇవ్వాలని కోరారు. గత రెండేళ్లగా ఆగిన యానిమేటర్ల జీతాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీల కార్యదర్శి అన్నపూర్ణమ్మ, కార్యకర్తలు కేవీ.శేషమ్మ, పద్మలతతోపాటు సీహెచ్‌. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.