జగన్ ! దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ !

ABN , First Publish Date - 2021-05-15T06:12:08+05:30 IST

సెక్షన్ 124–ఎ ను అతి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాడుతారు. ఎడాపెడా వాడడానికి అది దొమ్మీ కేసు సంబంధించిన సెక్షన్ కాదు. దురదృష్టం ఏమంటే, జగన్ ప్రభుత్వం దానిని తన రాజకీయ ప్రత్యర్థులను...

జగన్ ! దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ !

సెక్షన్ 124–ఎ ను అతి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాడుతారు. ఎడాపెడా వాడడానికి అది దొమ్మీ కేసు సంబంధించిన సెక్షన్ కాదు. దురదృష్టం ఏమంటే, జగన్ ప్రభుత్వం దానిని తన రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి వాడుతోంది. తమపై కేసులు బనాయించినప్పుడు గగ్గోలు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అరిచి మరీ చాటిన జగన్‌ ఇప్పుడు తన నేతృత్వంలోని సర్కార్‌ చేస్తున్నదేమిటో ప్రస్ఫుటంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ మఫ్టీలో వచ్చిన 30-–40 మంది పోలీసులు ఎలాంటి వారంటు లేకుండానే అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు సెక్యూరిటీ గార్డులను తమ వాహనాల్లో ఎక్కించుకున్నట్లే ఎక్కించుకుని, తర్వాత దించేసి ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబసభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్ళినట్టు సమాచారం. ఆయనను సెక్షన్ 124--–ఎ కింద అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ‘రాజద్రోహం’ కేసు కింద అరెస్ట్ చేశారని అర్థం.


జగన్‌ ప్రభుత్వాన్ని కించపరిచారని, ఇబ్బంది పెట్టారని, దానిపై ద్వేషాన్ని వ్యాప్తిచేస్తున్నారనేవి రఘురామ కృష్ణంరాజుపై ఉన్న ఆరోపణలు. సెక్షన్ 124–ఎ ప్రకారం ‘మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, సంకేతాల ద్వారా గాని ప్రభుత్వంపై ద్వేషాన్ని కూడగట్టడం’ నేరం. అయితే ఒక పార్టీ అధికారంలో ఉంటే- ప్రతిపక్షాలు, ప్రభుత్వ విధానాలు నచ్చని వాళ్ళు చేసే పని– ఆ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేయడం. దానిని నిర్మాణాత్మకంగానూ చేయొచ్చు లేదా మొరటుగానూ చేయొచ్చు. తరతరాల నుంచి జరుగుతున్న రాజకీయ ప్రక్రియ ఇది. సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్ రెడ్డి చేసింది కూడా ఇదే. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అభిప్రాయాన్ని కూడగట్టారు.


నిజానికి అదే విధంగా ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రతిపక్షంపై ఒక ద్వేష భావాన్ని వెళ్లగక్కడం జరుగుతుంటుంది. ఉదాహరణకు కొడాలి నాని మాట్లాడే ఏ ఒక్క మాట కూడా సభ్య భాష కిందకు రాదు. ఆయన పని ప్రతిపక్షంపై వ్యతిరేకత కూడగట్టడం కాదు కదా. ఒక ఆవేశభరితమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం మాత్రమే అందులో కనిపిస్తుంది. అయితే అది కొడాలి నాని హక్కు. ఆయన దానిని అలా వినియోగించు కుంటున్నారు. అదే విధంగా రఘురామ కృష్ణంరాజుకి కూడ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. దానిని ఆయన తన పద్ధతుల్లో తాను చేస్తున్నారు. తన విమర్శల్లో ఆయన పరుష భాష వాడారనే ఆరోపణ ఉంది. అదే పరుష భాష కారణంగా అరెస్ట్ చేయడం జరిగితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మేల్యేలలో సగానికి పైగా జైళ్ళలో ఉండాల్సి ఉంటుంది. రఘురామ కృష్ణంరాజు అదే పరుష భాషను కొడాలి నానిలా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కుపెట్టి ఉంటే ఆయనకు మరిన్ని ప్రోత్సహకాలు లభించేవి.


సెక్షన్ 124–ఎ ను అతి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాడుతారు. ఎడాపెడా వాడడానికి అది దొమ్మీ కేసుకు సంబంధించిన సెక్షన్ కాదు. దురదృష్టం ఏమంటే, జగన్ ప్రభుత్వం, దానిని తన రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి వాడుతోంది. తమపై కేసులు బనాయించినప్పుడు గగ్గోలు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అరిచి మరీ చాటిన జగన్‌ ఇప్పుడు తన నేతృత్వంలోని సర్కార్‌ చేస్తున్నదేమిటో ప్రస్ఫుటంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.


ప్రభుత్వాన్ని సుతిమెత్తగా మాత్రమే విమర్శించాలి లేదా ఈ పరిధి దాటి విమర్శించకూడదు అని ఎవరు ఎక్కడ చెప్పారు? మన రాజ్యాంగం దీనికి ఒక పరిమితిని విధించింది.  అయితే అది నైరూప్యంగా ఉండడంతో ప్రతి ప్రభుత్వం ఏదో కారణంతో తమ స్వార్థ ప్రయోజనాలకు దానిని వాడుకుంటోంది. సాధారణంగా ప్రభుత్వం చేసే ప్రతి పనితో ఒక స్వార్థ ప్రయోజనం ముడిపడి ఉంటుంది. ఆ రహస్య అజెండా ఏమిటో అదే ప్రభుత్వం నోరు తెరిచి చెప్పదుగా? మరి దానిని ప్రజాస్వామ్యంలో ఎత్తి చూపాల్సింది ఎవరు? ప్రభుత్వానికి భారీ బలగం ఉంటుంది. మిగతా వాళ్ళకు అదే స్థాయిలో ఆ బలగం ఉండదు కనుక ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వంలో ఉండే ఒక స్వార్థ కోణాన్ని బట్టబయలు చేయడానికి ఎవరికి తోచిన పద్ధతులను వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో అనుసరిస్తారు. అయితే సెక్షన్ 124–ఎ పేరుతో అరెస్ట్ చేయడం, అది కూడ నాన్ బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయడం సబబే అయితే, సోనియాను వ్యతిరేకించినందుకు జగన్ పై కేసులు పెట్టడం కూడా సముచితమే అవుతుంది!


మన మీద ఒకరు మనం అనుకున్న రీతిలోనే విమర్శ చేయాలని కోరుకోవడం మూర్ఖత్వం. ఇది ప్రజాస్వామ్యం. అందరూ ఒకే రీతిలో బతకకుండా ఉండగలిగే హక్కుకు దోహదం చేయడమే ప్రజాస్వామ్యం చేయాల్సిన పని. ఒక పక్క కేసీఆర్ ప్రభుత్వం తనకు నచ్చలేదని కొన్ని సంస్థలను నిషేధిస్తుంది. ఇంకో పక్క ‘నేనంటే అసమ్మతి ఉన్నందునే నాపై అక్రమ కేసులు ‘అని రోదించే జగన్ కూడా గీత దాటి రఘురామ కృష్ణంరాజుపై అదే ట్రిక్ ఉపయోగించడం చూస్తే మనం ఓటేసిన ప్రభుత్వాలను చూసి సిగ్గుపడే రోజులొచ్చాయని అనిపిస్తోంది. అయినా ఇలా పోలీసులను మఫ్టీలో పెట్టి, వారెంట్ లేకుండా గూండాలుగా వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదు. పైగా అది తమను వ్యతిరేకించిన వాళ్లపై చేసే ధర్మబద్ధమైన పోరాటం కాదు. అసలు ఎంపీని అరెస్ట్‌ చేయాలంటే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని ఊసు ఎక్కడా లేదు.


కుటుంబసభ్యులు, మీడియా కథనం ప్రకారం వారెంట్ కూడా చూపించకుండా జీపులో ఎంపీని కుక్కేసారని తెలుస్తోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా లాక్కెళ్ళారని తెలుస్తోంది. అందునా ఐదు నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఎంపీని ఈడ్చుకుంటూ వెళ్లారని తెలుస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తన కేసులపై చేసే గగ్గోలుకు ఈరోజు కనీస నైతికత లేకుండా పోయింది. తన దాక వస్తే మాత్రం ధర్మం, వేరే వాళ్ళ విషయంలో మాత్రం ధర్మం అధర్మం లేకుండా ఎడాపెడా సెక్షన్‌లు బనాయించి కేసులు పెట్టడం... - ఇది సరి అయిన క్రీడ కాదు జగన్ గారూ! దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సర్!


పి. విక్టర్ విజయ్ కుమార్



Updated Date - 2021-05-15T06:12:08+05:30 IST