సాఫీగా సీఎం పర్యటన.. శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన జగన్‌

ABN , First Publish Date - 2020-09-24T13:58:58+05:30 IST

తిరుమల వెంకన్నకు గరుడ సేవ సందర్భంగా పట్టువస్ర్తాలు సమర్పించేందుకు..

సాఫీగా సీఎం పర్యటన.. శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన జగన్‌

తిరుమల(ఆంధ్రజ్యోతి): తిరుమల వెంకన్నకు గరుడ సేవ సందర్భంగా పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటన సాపీగా సాగింది.డిక్లరేషన్‌  ఇచ్చాకే జగన్‌ తిరుమల ఆలయంలోకి అడుగు పెట్టాలంటూ టీడీపీ,బీజేపీ ఆందోళనలకు దిగడంతో సీఎం పర్యటనకు  పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పర్యటన ప్రశాంతంగానే జరిగింది. చివరకు విమానాశ్రయంలో  జర్నలిస్టులను టెర్మినల్‌కు 100 అడుగుల దూరంలోనే నిలబెట్టేశారంటే భద్రతాఏర్పాట్లు ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చు.


సాయంత్రం 4.50 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న సీఎంకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న జగన్‌  సంప్రదాయదుస్తులతోనే 5.30 గంటలకు తిరుమలలో అన్నమయ్య భవన్‌కు చేరుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు ఆలయం ముందున్న బేడిఅంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుని ఆంజనేయస్వామిని దర్శించు కున్నారు. అక్కడ సీఎంకు నుదుట తిరునామం దిద్దారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపచేశారు. ఆ తరువాత నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం చేరుకున్నారు.


గర్భాలయంలో మూల మూర్తికి వస్ర్తాలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. బలిపీఠం, ధ్వజస్తంభం మొక్కుకుని రంగనాయ కుల మండపం చేరుకోగా పండితులు జగన్‌కు వేదాశీర్వచనం చేశారు. తర్వాత తీర్థప్రసాదాలను, వెంకన్న చిత్రపటాన్ని సీఎంకు టీటీడీ చైర్మన్‌ అందజేశారు. అనంతరం సీఎం కల్యాణోత్సవ మండపానికి చేరుకుని గరుడవాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామిని దర్శించుకున్నారు.ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, ఆళ్లనాని, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, గౌతంరెడ్డి,         వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని తదితరులు ఉన్నారు.


కాగా, గురువారం ఉదయం కర్ణాకట ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి సీఎం జగన్‌ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయం ముందు నాదనీరాజనం వేదికపై నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొం టారు. ఆ తర్వాత ఆలయం వెనుకభాగంలోని కర్ణాటక సత్రాల నిర్మాణ భూమిపూజలో పాల్గొని తిరుగు పయనమవుతారు. 




Updated Date - 2020-09-24T13:58:58+05:30 IST