Abn logo
Sep 25 2021 @ 00:54AM

సీమ ప్రాజెక్టులపై జగన నిర్లక్ష్యం

సదస్సులో మాట్లాడుతున్న టీడీపీ కడప పార్లమెంట్‌ నియోజకవర్గ ఇనచార్జి లింగారెడ్డి, చిత్రంలో రాయలసీమ టీడీపీ నేతలు

చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులకు పెద్దపీట

సీమ ప్రాజెక్టులపై కడపలో సదస్సులో టీడీపీ నేతలు

కడప, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎ్‌స జగనమోహనరెడ్డి రాయలసీమ ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి చూపడం లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన సెంటర్‌లో ‘కృష్ణాజలాలపై కేంద్ర పెత్తనం... ఆంధ్రప్రదేశ ప్రభుత్వ వైఖరి.. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సమాలోచన’ పేరిట సదస్సు నిర్వహించారు. టీడీపీ కడప పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల లింగారెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన హైదరాబాద్‌లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోడానికి రాయలసీమ హక్కులను కేసీఆర్‌కు తాకట్టుపెట్టారని ఆరోపించారు. 

మాజీ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సీమ రైతులను అందుకునేందుకు హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల నిర్మాణానికి అంకుర్పాణ చేస్తే జగన నిధులను కొల్లగొట్టే పనులే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌ చైర్మన మాల్యాద్రి మాట్లాడుతూ ఉక్కుఫ్యాక్టరీ లేదని, కాలుష్యం పేరుతో జువారీ పరిశ్రమను మూయించారని యురేనియం ప్రాజెక్టులో కాలుష్యం లేదా అంటూ ప్రశ్నించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్‌ .శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల పెత్తనాన్ని కేంద్రం చేతిలో పెట్టడం దుర్మార్గమని, సీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రిగాని, సీమలోని ఎమ్మెల్యేలు గాని ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ జగన రెండున్నరేళ్ల పాలనలో ప్రాజెక్టుల షట్టర్లకు పూసేందుకు గ్రీసు, బిగించేందుకు బోల్టులకు కూడా నిధుల్లేక గేట్లు కొట్టుకుపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రులు కే.ఈ.ప్రభాకర్‌, ఫరూఖ్‌, ఎమ్మెల్సీ దొరబాబు, ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు హనుంతరాయచౌదరి, బ్రహ్మానందరెడ్డి, నేతలు గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌, శ్రీరామ్‌ చిన్నబాబు, నేతలు సోమిశెట్టి, గౌరు వెంకటరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కస్తూరి విశ్వనాఽథనాయుడు, అమీర్‌బాబు, కర్నాటి శ్వేతరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, ముక్తియార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా 22 తీర్మానాలు చేశారు. 


మహిళ జనరల్‌ సెక్రటరీగా మల్లెల లక్ష్మీప్రసన్న 

టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ కమిటీ జనరల్‌ సెక్రటరీగా మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్నను ఎంపిక చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. 


కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలు జిల్లాకు తరలించాలి

వేంపల్లె, సెప్టెంబరు 24: రాబోవు రోజుల్లో కృష్ణానదిపై నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు పాత్ర ఎక్కువగా ఉంటుందని, కావున ఈ బోర్డు కార్యాలయాన్ని వెంటనే కర్నూలు జిల్లాకు తరలించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే ఖరీదైన ఆస్తులను కాజేసే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాలయాల ఉసురు తీయడం శోచనీయమన్నారు. ఆసరా పథకానికి జగన ప్రభుత్వం టోకరా పెట్టడం దురదృష్టకరమన్నారు. కాగా.. అమలాపురం మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు హర్షకుమార్‌ శుక్రవారం వేంపల్లెలో పీసీసీ వర్కింగ్‌ తులసిరెడ్డిని పరామర్శించారు.