అర్హులందర కీ ‘జగనన్న చేదోడు’

ABN , First Publish Date - 2020-02-23T06:06:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకంలో అర్హులందరికీ లబ్ధిచేకూర్చాలని జేసీ-2 కే ఎం కమలకుమారి పేర్కొన్నారు. నగరంలోని జడ్పీ కార్యాలయంలో

అర్హులందర కీ ‘జగనన్న చేదోడు’

పక్కాగా లబ్ధిదారుల జాబితా సవరణ

జేసీ-2 కమలకుమారి


నెల్లూరు (వీఆర్సీ) ఫిబ్రవరి 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ పథకంలో అర్హులందరికీ లబ్ధిచేకూర్చాలని జేసీ-2 కే ఎం కమలకుమారి పేర్కొన్నారు. నగరంలోని జడ్పీ కార్యాలయంలో శనివారం మండల పరిషత్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, కార్యదర్శులతో ఒక్క రోజు సమావేశం బీసీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఈడీ కే రాజశ్వేరి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి జడ్పీ సీఈవో సుశీల, మాస్టర్‌ ట్రైనర్స్‌ గోపి, శివయ్య హాజరయ్యారు.  జేసీ-2 మాట్లాడుతూ కుల వృత్తితో జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ వృత్తి చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఏటా రూ.10,000లు ఇస్తోందన్నారు. దీనికి సంబంధించిన జాబితాను గ్రామ వలంటీర్లుతో సర్వే చేయించామన్నారు. కేవలం కుల వృత్తి ఆధారంగా జీవించే వారిని మాత్రమే ఈ పథకంలో చేర్చారన్నారు. అపార్ట్‌మెంట్లలో లేదా ఇతరుల ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉన్నవారు ఖాళీ సమయంలో దోబీ వృత్తి చేసుకునేవారు అనర్హులని తెలిపారు.


నాయీబ్రాహ్మణులు కేవలం క్షౌర వృత్తితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, బార్బరు దుకాణం కలిగిన యజమాని మాత్రమే అర్హుడని, దుకాణంలో పనిచేసే వారు అనర్హులని తేల్చారు. దర్జీ దుకాణం కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారు అర్హులని తెలిపారు. తీరిక సమయంలో కుట్టు పని చేసుకుంటున్న వారు, దర్జీ వృత్తి చేసుకుంటూ ఇతర పనులు చేసుకునే వారికి ఈ పథకం వర్తించదని తెలిపారు. వలంటీర్లు ప్రలోభాలకు లొంగకుండా ఆత్మ ప్రబోధంతో రీసర్వే చేయాలని జడ్పీ సీఈవో సుశీల పేర్కొన్నారు.

Updated Date - 2020-02-23T06:06:56+05:30 IST