Abn logo
Aug 9 2021 @ 10:59AM

జగనన్న విద్యా కానుకలకు స్టిక్కర్లు

భీమునిపట్నం(రూరల్‌): పాఠశాలలు ఈనెల 16 నుంచి పునఃప్రారంభం కానున్నందున జగనన్న విద్యా కానుకల పేరుతో స్కూల్‌ బ్యాగులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా చేపట్టారు. మూడు సైజుల్లో ఇస్తున్న ఈ బ్యాగులు బాలికలకు స్కై బ్లూ, బాలురకు నేవీ బ్లూ రంగుల్లో ఉంటాయి. వీటికి ఉన్న పౌచ్‌లలో  విద్యార్థి పేరు, ఆధార్‌ నంబర్‌, అడ్మిషన్‌ నంబర్‌, చదువుతున్న తరగతి, ఊరి పేరు చార్టు ముక్కపై రాసి కనిపించేలా అందులో ఉంచాలని అధికారులు పేర్కొన్నారు. బెల్టులను ఆరు నుంచి పదో తరగతి వరకు బాలికలకు ఇవ్వడం లేదు. బాలురకు ఇచ్చే బెల్టులకు రెండు వైపులా డిజైన్‌ ఉంటుంది. ఐదో తరగతిలోపు బాలికలకు ఒకవైపు డిజైన్‌ ఉంటుందన్నారు. కాగా నోటు పుస్తకాలను ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఇవ్వడం లేదు. ఆరు, ఏడు తరగతుల వారికి మూడు వైట్‌, ఒక బ్రాడ్‌ రూల్‌, నాలుగు రూళ్లు పుస్తకాలను ఇస్తున్నారు. ఎనిమిదో తరగతి వారికి నాలుగు వైట్‌, ఒక బ్రాడ్‌ రూలు, ఒక గ్రాఫ్‌ రూళ్ల పుస్తకాలను ఇస్తున్నారు. తొమ్మిదో తరగతి వారికి వైట్‌, రూళ్ల పుస్తకాలను ఐదేసి, బ్రాడ్‌, గ్రాఫ్‌ రూళ్ల పుస్తకాలు ఒకొక్కటి ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆరేసి చొప్పున వైట్‌, రూళ్లు, బ్రాడ్‌ గ్రాఫ్‌ రూళ్లు పుస్తకాలు ఒకొక్కటి ఇస్తున్నారు.