కదలని జగనన్న కాలనీలు

ABN , First Publish Date - 2022-01-17T04:37:37+05:30 IST

మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం ఆవాసయోగ్యంగా లేకపోవడంతో అక్కడ ఇంటి నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఊరికి దూరంగా కొండబోడుపై ఆవాసానికి అనువుగా లేనిచోట అదీ వర్షాలు కురిస్తే రాకపోకలు సాగని ప్రాంతంలో స్థలాలు ఇచ్చారు. అక్కడ ఇల్లు కట్టుకోవడం అనవసరమని లబ్ధిదారులు వెనక్కి తగ్గారు.

కదలని జగనన్న కాలనీలు
కొండ ప్రాంతంలో వేసిన ప్లాట్లు, యడవల్లి సమీపంలో పునాది స్థాయిలో నిలిచిన గృహాలు

పెద్దదోర్నాల మండలానికి మంజూరైనవి 610

బేస్‌మెంట్‌ స్థాయిలో 26 గృహాలు

కొండ ప్రాంతంలో స్థలాల ఎంపికపై పేదల ఆగ్రహం

పనులు చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరిక 

ఎన్నికలకు ముందు ఒకమాట.. ఆ తర్వాత  మరోమాటపై లబ్ధిదారులు మండిపాటు


గత ఏడాది ఉగాది నాటికి పేదలందరికీ స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేయించి అందివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకుగాను అర్హులైన పేదలను గుర్తించి, ఇంటి యజమానిగా మహిళల పేరుతో పక్కా రిజిస్ట్రేషన్‌తో గృహాన్ని లబ్ధిదారులకు అప్పచెప్తామని అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఎన్నికలకు ముందు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటిని తామే సొంతంగా నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి.. ఇప్పుడు మీరే కట్టుకోవాలని, లేకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారుల ద్వారా హెచ్చరిస్తుండడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పెద్దదోర్నాల, జనవరి 16 :మండలంలో మొత్తం 610 పక్కా గృహాలు మంజూరు చేశారు. దోర్నాల రెవెన్యూ పరిధిలో రెండు లే అవుట్లు వేశారు. మొదటి లే అవుట్లో 99, రెండవ లేఅవుట్లో 387 గృహాలకు పట్టాలు మంజూరు చేశారు. యడవల్లి సమీపంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం వద్ద 75 మందికి పట్టాలు ఇచ్చి నిర్మాణానికి పనులు ప్రారంభించారు. వై.చెర్లోపల్లి పరిధిలో మోడల్‌ స్కూల్‌ వద్ద 79 మందికి మంజూరు చేశారు. ఆరంభంలో ఉన్న నిర్మాణం పనులు ప్రస్తుతం జరగడం లేదు. కొంత మంది పునాది తీసి వదిలేశారు. మరి కొంత మంది పేదలు అసలు మొదలే పెట్టలేదు. మండలం మొత్తమ్మీద 26 గృహాలు బేస్‌మెంట్ల స్థాయిలో ఉన్నాయి.


అది అనువైన ప్రాంతం కాదు

మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం ఆవాసయోగ్యంగా లేకపోవడంతో అక్కడ ఇంటి నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఊరికి దూరంగా కొండబోడుపై ఆవాసానికి అనువుగా లేనిచోట అదీ వర్షాలు కురిస్తే రాకపోకలు సాగని ప్రాంతంలో స్థలాలు ఇచ్చారు. అక్కడ ఇల్లు కట్టుకోవడం అనవసరమని లబ్ధిదారులు వెనక్కి తగ్గారు. ఆ స్థలాల వద్దకు వెళ్లాలంటే సరైన రహదారి లేదని, తీగలేరు ప్రవహిస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. తమకు ఇక్కడ ఇంటి స్థలాలు వద్దు.. మైదాన ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాగుపై రూ.80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టే బదులు ఆ సొమ్ముకు మరోచోట స్థలాలు కొనివ్వచ్చుకదా అని అధికారులను కోరుతున్నారు. 


స్థల ఎంపికపై హౌసింగ్‌ కలెక్టర్‌ కూడా ఆగ్రహం

గతంలో ఇంటి నిర్మాణాల పరిశీలనకు వచ్చిన హౌసింగ్‌ కలెక్టర్‌ కూడా స్పందించారు. ఏమాత్రం అనువుగా లేని చోట ఇంటి స్థలాలు కేటాయించిందెవరని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వేరేచోట స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోలేదు. ఏ మైందో తెలియదు చివరాఖరుకు లబ్ధిదారుల చేత ఆ స్థలంలోనే పునాదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టించారు. 


పూట గడవడమే కష్టంగా ఉంటే అప్పు చేసి ఇల్లా...

ఈ ఏడాది వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. జీవనోపాధే అంతంతమాత్రంగా ఉంది. పైపెచ్చు ఇంటి నిర్మాణం అంటే ప్రభుత్వం ఇచ్చే సాయం ఒక మూలకు కూడా సరిపోదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి ఇంటి నిర్మాణం చేయడం తమ వల్ల కాదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పునాది కుంటల దశలోనే ఉండిపోయారు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే ఇంటి నిర్మాణానికి అప్పులు ఎలా చేయాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. 


ప్రారంభించిన నిర్మాణాలకు పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం

విడతలవారీగా ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఒక్కో లబ్ధిదారుడికి రూ.1,80,000, పొదుపు సంఘాల మహిళలకు అదనంగా బ్యాంకు నుంచి రుణంగా మరో రూ. 35,000 మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్కడక్కడా ఇంటి నిర్మాణం ప్రారంభించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. దీనిపై పలుమార్లు మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు కూడా చేశారు.  


కలెక్టర్‌ ప్రకటనపై లబ్ధిదారుల్లో ఆందోళన

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఫిబ్రవరి ఆఖరునాటికి 80 శాతం మంది బేస్‌మెంట్లు పూర్తి చేయకపోతే పట్టాలు రద్దయ్యే అవకాశముందని హెచ్చరించారు. దీనిపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంటి కలను నెరవేరుస్తామని చెప్పి ఇలా పేదలను మోసగించడం సర్కారుకు తగదని, ఇచ్చిన మాట ప్రకారం గృహ నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-17T04:37:37+05:30 IST