Apr 21 2021 @ 11:45AM

రంభ అభిమానిగా జగ్గూ భాయ్‌, ఎందుకంటే..?

తొంబై దశకంలో తెలుగు ప్రేక్షకులను అభినయంతో పాటు అందచందాలతో అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకీమణుల్లో రంభ ఒకరు. స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నారు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. ఏంటి నిజంగానే..! అనే సందేహం రావచ్చు. రియల్‌ లైఫ్‌లో కాదులెండి.. రీల్‌ లైఫ్‌లో. సినిమాల్లో జగపతిబాబు, రంభ జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ రీల్‌ జోడీ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయనుంది. కానీ జోడీ కాదండోయ్.. అక్కడే ఉంది అసలు కిటుకు, వివరాల్లోకి వెళితే, అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా వైజాగ్‌లో జరిగింది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జగపతిబాబుపై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. ఎందుకంటే.. మహా సముద్రంలో జగపతిబాబు, రంభ అభిమానిగా కనిపిస్తారు. ఈ సాంగ్‌లో శర్వానంద్‌ కూడా కనిపిస్తాడు. ఈ సాంగ్ చిత్రీకరించడానికి ముందు చిత్ర యూనిట్ రంభ పర్మిషన్‌ తీసుకున్నారట. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా సినిమా రూపొందుతోంది.