దళిత, గిరిజన దండోరా ఏర్పాట్లపై జగ్గారెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2021-08-04T08:47:09+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 9న జరపతలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాట్లపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మంగళవారం సమీక్షించారు.

దళిత, గిరిజన దండోరా ఏర్పాట్లపై జగ్గారెడ్డి సమీక్ష

సభా నిర్వహణకు ఇంద్రవెల్లిలో లీజుకు 18 ఎకరాల స్థలం 

నేతలు, కార్యకర్తలు లక్ష మంది హాజరవుతారని అంచనా


హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 9న జరపతలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాట్లపై  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మంగళవారం సమీక్షించారు. టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్‌ నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. గత ఏడేళ్లలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ పార్టీ నిర్వహించనంత పెద్దఎత్తున దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. లక్ష మంది హాజరవుతారని భావిస్తున్న ఈ సభ నిర్వహణ కోసం ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంటున్నారు. 


ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి 15 వేల మంది, బోథ్‌ నుంచి 18వేలు, అసిఫాబాద్‌ నుంచి 15వేలు, మంచిర్యాల నుంచి 9వేలు,  ముథోల్‌, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి మూడు వేల చొప్పున, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూరు ప్రాంతాల నుంచి 20వేల మందికి పైగా, నిర్మల్‌ నియోజకవర్గం  నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు, హాజరు అవుతారని అంచనా వేశారు. బాల్కొండ, ఆర్మూరు, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, రామగుండం, బోధన్‌, ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని భావిస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి చెప్పిన మాట వాస్తవమేననే విధంగా సభను నిర్వహించనున్నట్లు ప్రేమసాగర్‌రావు చెప్పారు. సభ ఏర్పాట్ల బాధ్యతలు తాను స్వీకరిస్తున్నట్లు ఈరవతి అనిల్‌ తెలిపారు. జన సమీకరణకు నియోజకవర్గాలవారీగా సమన్వయకర్తలను ఇప్పటికే నియమించారు.  టీపీసీసీ  9న ఇంద్రవెల్లిలో దండోరా కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్‌ 17 వరకూ కొనసాగిస్తుంది. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తుంది. సీఎం కేసీఆర్‌ దళిత బంధు కార్యక్రమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో పోటీగా వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ నెల 7న జగ్గారెడ్డి నేతృత్వంలో ఒక బృందం సభా స్థలాన్ని  పరిశీలించేందుకు ఇంద్రవెల్లి వెళ్లనుంది. ఆ రోజు పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, పీసీసీ నియమించిన సమన్వయకర్తలు స్థలాన్ని పరిశీలిస్తారు. 

Updated Date - 2021-08-04T08:47:09+05:30 IST