హరీష్‌కు జగ్గారెడ్డి సవాల్

ABN , First Publish Date - 2021-11-26T21:18:04+05:30 IST

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

హరీష్‌కు జగ్గారెడ్డి సవాల్

సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున 10నియోజకవర్గాలకు 20 వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్ డ్రా చేపిస్తా అని హరీష్ రావుకు ఛాలెంజ్ విసిరారు. నిర్మాలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు 20 వేల కోట్లు తీసుకువస్తానని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులకు పదవులు వచ్చాయని, కానీ వారికి పవర్ లేదన్నారు. పూర్వ మెదక్ జిల్లా నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా నిధులు శూన్యమన్నారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారని ఆయన ఆరోపించారు.


మెదక్‌లో కాంగ్రెస్‌కు 230 ఓట్లు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా తన భార్య నిర్మలను స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో పెట్టానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టాం కాబట్టే ఎంపీటీసీ, జడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి వారితో హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లనే  హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి రాజ బతుకు బతుకుతారో.. టీఆర్ఎస్‌ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన హితవు పలికారు. 

Updated Date - 2021-11-26T21:18:04+05:30 IST