Advertisement
Advertisement
Abn logo
Advertisement

జై.. అమరావతి

మహాపాదయాత్రకు పోటెత్తుతున్న జనం

అడుగుడునా కర్పూర హారతులు

కోవూరులో లక్ష దీపారాధన

రాజకీయ ప్రముఖుల సంఘీభావం


కోవూరు, నవంబరు 26 : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగుతున్న మహాపాదయాత్ర శుక్రవారం జైత్రయాత్రను తలపించింది. ఉదయం నార్తురాజుపాళెంలో బయలుదేరిన మహాపాదయాత్రకు దారిపొడవునా కొడవలూరు, విడవలూరు, కోవూరు మండలాల ప్రజలు  పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుండలమ్మపాళెం నుంచి కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, గండవరం ప్రాంతం నుంచి కార్యకర్తలతో కలిసి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా కలిశారు. జాతీయ రహదారిపై బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సాయిబాబా గుడి సమీపంలో పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగు యువత జాతీయ ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినే్‌షరెడ్డి నాయకత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు టెంకాయ కొట్టి మంగళహారతులు పట్టారు. అయితే, డప్పు కళాకారులు చేస్తున్న విన్యాసాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలంరెడ్డి, నాయకులు ప్రతిఘటించారు. పాదయాత్ర కోవూరులోకి ప్రవేశించే సమయానికి వందలాది మంది ప్రదర్శనకు సంఘీభావంగా పార్టీలకతీతంగా నడిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు, జిల్లా కమిటీ కార్యదర్శి మూలం రమేష్‌ నాయకత్వంలో ప్రదర్శనకు ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ప్రాంతంలో మహిళా రైతులకు క్షీరాభిషేకం చేశారు. పీఆర్‌ఆర్‌ కాలనీ ప్రాంతంలో మహిళలు హారతులు ఇవ్వగా, తాలుకాఫీసు కూడలిలోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు రైతులపై పూలజల్లు కురిపించారు. మైథిలీ కూడలి ప్రాంతంలో టీడీపీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి నాయకత్వంలో గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతులతో  స్వాగతం పలికారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేసిన వాహనాన్ని మహిళా జేఏసీ కన్వీనర్‌ రాయపాటి శైలజ స్వయంగా నడిపారు.


లక్ష దీపాల వెలుగులు


కోవూరులోని పురాతన శివాలయంలో భవానీ భక్తులు, సుభాష్‌ సేవా సంఘం సభ్యులు మహిళా రైతులను ఆలయంలోకి  ఆహ్వానించారు. వారితో లక్ష దీపాలను వెలిగించారు. ప్రధాన దీపాన్ని పాదయాత్ర నాయకురాలు రాయపాటి శైలజ వెలిగించారు. మహిళా రైతులకు సారె అందజేసి,  రక్షాబంధన కట్టారు. 


రూ.2లక్షల విరాళం


బజారు కూడలిలో టీడీపీ నేత పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి నాయకత్వంలో రోడ్డుపై పూలు పరిచి, పాదయాత్రకు స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి ఆయన రూ రూ.2 లక్షలు, మాజీ ఎమ్మెల్యే రూ.2లక్షలు విరాళం అందజేశారు. టీడీపీ నాయకులు డాక్టర్‌ జడ్‌ శివప్రసాద్‌, పిచ్చుక మధుసూధనరావు నాయకత్వంలో చేనేత కూలీలు ఆహ్వానం పలికారు.  రాట్నం వడుకుతున్న మహిళ జాతీయపతాకాలను ఆవిష్కరించిన ఎడ్లబండిపై కూర్చొని స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


జనసేన సంఘీభావం


బజారు కూడలిలో జనసేన పీఏసీ చైర్మన నాదెండ్ల మనోహర్‌ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో బజారుకూడలి జనసంద్రంగా నిండిపోయింది. రైతుపాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మనోహర్‌ తెలిపారు. ఆ తర్వాత సాలుచింతల ప్రాంతంలో పోతిరెడ్డిపాళెంకు చెందిన రైతులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆహ్వానం పలికారు.


సింహపురీయుల స్వాగతం


నెల్లూరు రూరల్‌ : శుక్రవారం మధ్యాహ్నం పాత పెన్నా వంతెన నుంచి అమరావతి రైతులు నెల్లూరులో అడుగుపెట్టారు. శెట్టిగుంటరోడ్డు కూడలి వద్ద కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ నేతలు అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనురాధల బృందం స్వాగతం పలికింది. వెంకటేశ్వరపురం సర్కిల్‌, నవాబుపేట వద్దనున్న జలకన్య కూడలి, ఆత్మకూరు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు.  విజయమహల్‌ గేట్‌ మీదుగా గాంధీబొమ్మ కూడలి వద్దకు చేరుకోగానే బీజేపీ నేత, ఎమ్మెల్యే వాకాటి నారాయణరెడ్డి, తేళ్ల రాఘవయ్యలు అమరావతి నేతలను సత్కరించి స్వాగతం పలికారు. అక్కడ నుంచి వీఆర్సీ కూడలి, ముత్తుకూరు సెంటరు మీదుగా చిల్డ్రన్స పార్కు రహదారి నుంచి అపోలో ఎదుట జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపం వద్దకు పాదయాత్ర చేరుకుంది. గురువారం మొత్తం 16 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. 


నేటి యాత్ర ఇలా..


శనివారం ఉదయం నగరంలోని అపోలో హాస్పిటల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం. బెజవాడ గోపాల్‌రెడ్డి విగ్రహం, కేవీఆర్‌ పెట్రోలు బంకు కూడలి మీదుగా బారా షహీద్‌ దర్గాకు చేరుకుని పూజలు చేస్తారు. ఇక్కడే  మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తారు. 3 గంటలకు బయలుదేరి పొదలకూరు రోడ్డు సెంటర్‌,  డైకస్‌ రోడ్డు సెంటర్‌, తెలుగుంగ కాలనీ మీదుగా ఎస్‌ఎస్‌బీ కల్యాణ మండపం చేరుకుంటుంది. రాత్రికి ఇక్కడే రైతులు బస చేస్తారు.

యాత్రలో వెంకన్న ఆశీస్సులు పొందుతున్న నాదెండ్ల మనోహర్‌


టీడీపీ నేతలు కోటంరెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు


Advertisement
Advertisement