Abn logo
Sep 26 2021 @ 03:14AM

వినాయక విగ్రహం చుట్టూ నేతల ఫ్లెక్సీలు, జెండాలు.. ఊరేగింపుల్లోనూ జై జగన్‌ నినాదాలే

వినాయకా.. నీదే పార్టీ!

దేవుడికీ పార్టీ రంగులు పులిమిన నాయకులు

పార్టీల వారీగా విగ్రహాలు, వేడుకలు

విగ్రహం చుట్టూ నేతల ఫ్లెక్సీలు, జెండాలు

ఊరేగింపుల్లోనూ జై జగన్‌ నినాదాలే

వైసీపీ గణపతికే పోలీసుల సెల్యూట్‌

ప్రత్యర్థి వర్గీయుల ఊరేగింపులకు బ్రేక్‌

(గుంటూరు - ఆంధ్రజ్యోతి): జై బోలో గణపతి మహరాజ్‌కీ... జై! ఇది సర్వత్రా వినిపించే నినాదం! కానీ... గుంటూరు జిల్లాలో మాత్రం దీంతోపాటు పార్టీల నినాదాలూ వినిపిస్తాయి. గణేశుడి మెడలోనూ పార్టీల కండువాలు కనిపిస్తాయి. వినాయక చవితి వచ్చిందంటే... యువజన సంఘాలు, కాలనీ సంఘాలు, వీధుల వారీగా బొజ్జ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేయడం, సామూహికంగా వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా జరిగేదే! కానీ... గుంటూరు జిల్లాలో కొన్నేళ్లుగా గణపతికీ రాజకీయ రంగు పులుముతున్నారు. అంతేకాదు... అధికార పార్టీ వారి గణపతి ఊరేగింపులకు అన్ని అనుమతులూ లభిస్తాయి. కానీ... ప్రత్యర్థి వర్గీయుల విఘ్నేశుడికి మాత్రం అన్నీ విఘ్నాలే!


అంతకుముందు ఇలా... 

ఐదారేళ్ల కిందటి వరకు వినాయకుడి వేడుక అందరిదీ! ఆయా పార్టీల నేతలు తమ రాజకీయ ప్రాపకం, అవసరాల కోసం కుదిరిన వాళ్లందరికీ చందాలు ఇచ్చే వాళ్లు. ఇక... తాము నివసిస్తున్న ప్రాంతంలో జరిగే వేడుకల్లో ప్రముఖ పాత్ర పోషించేవారు. కుల  సంఘాల వారీగా కూడా వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవడం సహజమే. కానీ... ఇప్పుడు నేరుగా వైసీపీ వినాయకుడు, టీడీపీ వినాయకుడిగా దేవుడిని విభజించేశారు. టీడీపీ వర్గీయులు ఎప్పట్లాగానే ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అక్కడక్కడా అలంకరణకు పసుపు వస్త్రాలు ఉపయోగించడం మాత్రమే జరుగుతోంది. కానీ... వైసీపీ వినాయకుడికి మాత్రం పూర్తి పార్టీ రంగు పులిమేశారు. గత ఏడాది కొద్దిగా మొదలైన ఈ పెడధోరణి... ఈసారి మరింత శ్రుతి మించింది. విగ్రహానికి అటూఇటూ ముఖ్యమంత్రి జగన్‌, స్థానిక ఎమ్మెల్యే కటౌట్లు... వైసీపీ రంగు జెండాలు, ఆ పార్టీకి చెందిన పాటలతో ఆధ్యాత్మిక వేడుకలో రాజకీయ రచ్చ చేయడం మొదలైంది. ఇక... నిమజ్జన ఊరేగింపుల్లో వినాయకుడి భజనలు, కీర్తనలు కాకుండా ‘జై జగన్‌... జైజై జగన్‌’ నినాదాలే వినిపించాయి.


ఇక్కడా ‘అధికార’ వివక్షే...

దేవుడికి పార్టీల్లేవు. ఆయన అందరివాడు. కానీ... గుంటూరు జిల్లా పోలీసులు మాత్రం అధికార పార్టీ గణపతికి మాత్రమే భక్తులుగా మారారు. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌, కరోనా ఆంక్షల పేరుతో టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులను అడ్డుకున్నారు. అదే... అధికారపక్ష నేతల ఊరేగింపులను మాత్రం ఎంచక్కా అనుమతించారు. ఉదాహరణకు... కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో వైసీపీ వర్గీయుల వినాయకుడి విగ్రహ ఊరేగింపునకు అనుమతి ఇచ్చిన పోలీసులు, విపక్ష పార్టీ నేతలు పెట్టుకున్న విగ్రహ ఊరేగింపును అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వట్టిచెరుకూరు మండలంలో వైసీపీ వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు డీజే మోతలు, బాణసంచా పేలుళ్లతో కోలాహలంగా జరిగాయి. గారపాడులో టీడీపీ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహ ఊరేగింపును డీజేలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై కేసులు కూడా పెట్టారు. ప్రత్తిపాడులో  టీడీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ ఊరేగింపును అడ్డుకున్నారు. అదేరోజున పరిషత్‌ ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ నేతలు భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించినా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. 


ఘర్షణలు, గొడవలు...

పార్టీల వారీగా విగ్రహాలు, ఊరేగింపులతోపాటు.. గొడవలూ, ఉద్రిక్తతలూ మొదలయ్యాయి. ఈసారి వైసీపీ శ్రేణుల వీరంగం మరీ శ్రుతిమించింది. పోలీసులు కూడా చేతులెత్తేసి... విధ్వంసానికి మౌన సాక్షులుగా మిగిలారు. కొన్నిచోట్ల వారూ దెబ్బలు తిని బాధితులుగా మారారు. ఇలాంటి ఘటనలు హోంమంత్రి నియోజకవర్గంలోనే అధికంగా జరగడం మరో విశేషం. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో వైసీపీ వినాయకుడి విగ్రహ ఊరేగింపులో పార్టీ కక్షలు బహిర్గతమయ్యాయి. తెలుగుదేశం మద్దతుదారులు నివసించే వీధుల్లో ఉద్దేశపూర్వకంగా డీజే మోతలు, బాణసంచా పేలుళ్లు జరిపి రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఘర్షణ జరిగింది. కొప్పరులో వైసీపీ  ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా భారీ విధ్వంసమే సృష్టించారు. అదే గ్రామంలో టీడీపీకి చెందిన పెదనందిపాడు మాజీ జడ్పీటీసీ బత్తిన శారద నివసిస్తున్నారు. ఆమె భర్త వేణు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా, అకారణంగా బత్తిన శారద ఇంటిపైకి రాళ్లు విసిరి, వాహనాలకు, సామగ్రికి నిప్పంటించారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు... ‘ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ టీడీపీ నేతలకు ఉచిత సలహా ఇచ్చారు.


ఇక... తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో జరిగిన నిమజ్జన ఊరేగింపులో ఓ మహిళ పట్ల వైసీపీ కార్యకర్త అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో టీడీపీకి చెందిన మహిళలు వైసీపీ ఫ్లెక్సీలపై పసుపు నీళ్లు చల్లారు. దీంతో రగడ మొదలైంది. ఆ తర్వాత కూడా ఊరేగింపు చూసేందుకు బయట నిలబడిన మరో మహిళపై ఒక వైసీపీ కార్యకర్త మద్యం మత్తులో మీద చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు గుమ్మికూడి ఊరేగింపును అడ్డుకున్నారు. ఇది ఉద్రిక్తతకు దారితీసి... రాళ్లదాడికి దారి తీసింది. స్వయంగా ఎస్‌ఐ గాయపడినా... పోలీసులు కఠినంగా వ్యవహరించలేకపోయారు.  ఈ గొడవలు మున్ముందు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదని జనం వాపోతున్నారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగకుండా పార్టీల నేతలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుంటున్నారు.