జై కిసాన్‌

ABN , First Publish Date - 2021-12-10T06:15:12+05:30 IST

ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమం ముగిసింది. రైతులు శనివారం ఉదయానికల్లా ఉద్యమ కేంద్రాలనుంచి తమ ఇళ్ళకు తరలిపోతారు. డిసెంబరు 11న రైతులు స్వర్ణదేవాలయాన్ని సందర్శిస్తారు...

జై కిసాన్‌

ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమం ముగిసింది. రైతులు శనివారం ఉదయానికల్లా ఉద్యమ కేంద్రాలనుంచి తమ ఇళ్ళకు తరలిపోతారు. డిసెంబరు 11న రైతులు స్వర్ణదేవాలయాన్ని సందర్శిస్తారు, విజయ్ దివస్ జరుపుకుంటారు. గత ఏడాది నవంబరు 25న ఆరంభమైన ఈ ఉద్యమం 378 రోజులు నిరవధికంగా సాగి, అన్ని డిమాండ్లనూ సాధించి చరిత్రాత్మకంగా ముగియబోతున్నది. తాము ఆందోళన విరమించడం లేదనీ, ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామనీ, ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చనిపక్షంలో తిరిగి ఆరంభమవుతుందని రైతులు విస్పష్టంగా చెబుతున్నారు. 


కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన సాగుచట్టాల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధత తదితర లక్ష్యాలతో ఆందోళన ఆరంభించిన రైతులు ఇప్పటికే తమ ప్రధాన డిమాండ్ సాధించారు. మూడు వ్యవసాయచట్టాలను వెనక్కుతీసుకుంటున్నట్టు గత నెల ప్రధాని ప్రకటిస్తూ, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరంభమైన మొదటిరోజే రద్దుబిల్లును ఆమోదిస్తామని కూడా హామీ ఇచ్చారు. చట్టాలు చేస్తున్నప్పుడు ఎలా చర్చకు తావులేని రీతిలో వాటిని తెచ్చారో, ఉపసంహరణ కూడా అదేరీతిలో జరిగింది. మిగతా డిమాండ్లు కూడా నెరవేరేవరకూ సరిహద్దులు వీడకూడదనుకున్నారు రైతులు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వారికి కొన్ని ప్రతిపాదనలు రావడం, సంయుక్త కిసాన్ మోర్చా కొన్ని సందేహాలను లేవనెత్తి, సవరణలు ప్రతిపాదించడం,  ప్రభు త్వం సరేననడం వేగంగా జరిగిపోయాయి. ఎంఎ‍స్‌పి చట్టబద్ధత డిమాండ్ పరిష్కారానికి ఉద్దేశించిన కమిటీలో కిసాన్ మోర్చా ప్రతినిధులకు సముచిత భాగస్వామ్యం ఉండటంతో పాటు, కమిటీలో రైతు ఉద్యమంపట్ల వీసమెత్తు వ్యతిరేకత ఉన్నవారికి కూడా స్థానం ఇవ్వకూడదన్న వాదనకు కూడా ప్రభుత్వం సరేనన్నదట. రాష్ట్రాలలో ఎంఎస్‌పిపై కేంద్రం సేకరిస్తున్న ఆయా పంట ఉత్పత్తుల పరిమాణాన్ని ఏమాత్రం తగ్గించబోమని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకమైన హామీ పొందడం రైతుల పైచేయికి నిదర్శనం. తాము ఇళ్ళకు తిరిగిపోగానే, ప్రభుత్వం ఎంఎస్‌పి ద్వారా కొనుగోలు చేసే ఉత్పత్తులను తగ్గించడమో, మానివేయడమో చేస్తుందన్నది రైతుల అనుమానం. ఇక, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఆయా రాష్ట్రాలు వెంటనే ఎత్తివేస్తున్నట్టు కేంద్రం తన నోటిద్వారా ప్రకటించి, ఢిల్లీ సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో తానూ అదేపని చేస్తున్నట్టు నిర్థారించింది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా, ఉత్తర్  ప్రదేశ్ రాష్ట్రాల్లోనే రైతులపై నలభై ఐదువేలకుపైగా కేసులు నమోదయ్యాయట. అలాగే ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు రాష్ట్రాలతో నష్టపరిహారం ఇప్పించే బాధ్యతా కేంద్రమే  పడింది. దేశరాజధాని ఢిల్లీని కాలుష్యంలో ముంచెత్తే పంట వ్యర్థాల దహనం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దానిని నేరపూరితచర్యగా ప్రకటించిన కాలుష్య నివారణచట్టం నుంచి రైతులకు మినహాయింపు కల్పించడం ద్వారా వారిపై కేసులు నమోదుకాకుండా కేంద్రం చేస్తుంది. అయితే, సుప్రీంకోర్టు భవిష్యత్తులో తీసుకొనే నిర్ణయాలు, వేసే శిక్షల విషయంలో తాను చేయగలిగేదేమీ ఉండదని కేంద్రం రైతులకు తెరవెనుక చర్చల్లో గుర్తుచేసిందని అంటారు. యస్‌కెఎం సహా, భాగస్వాములందరితోనూ చర్చించిన మీదటే వివాదాస్పద విద్యుత్ బిల్లు విషయంలో తాను అడుగువేస్తానని కేంద్రం హామీపడటం రైతు సాధించిన మరో విజయం.


ఉద్యమకాలంలో రైతుపడిన కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని సరిహద్దుల్లో తాత్కాలిక నివాసాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య వారు పోరాటం చేశారు. సాయుధబలగాల దాడులనుంచి రిపబ్లిక్ డే ఘటనల వరకూ ఎన్నో ఎదుర్కొన్నారు. తీవ్రవాదులనీ, దేశద్రోహులనీ అనిపించుకున్నారు. ఏడువందలమంది రైతులు కన్నుమూస్తే, మాకేం తెలియదు, మా దగ్గర లెక్కల్లేవని కేంద్రమంత్రి ఈ మధ్యనే నిండుసభలో ప్రకటించారు. కర్నాల్ వంటి ఘటనలు అనేకం. లఖింపూర్ ఖేరీ మారణకాండను దేశం ఎన్నటికీ మరిచిపోదు. దీనికి కారకుడైన కేంద్రమంత్రిని తక్షణంపదవినుంచి తొలగిం చాల్సిన ప్రభుత్వం, రైతులు గట్టిగా డిమాండ్ చేసినా అంగీకరించలేదు. ‍‍‍తరుముకొస్తున్న పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎదురు దెబ్బకు జడిసి మోదీ ప్రభుత్వం సాగుచట్టాలపై దిగివచ్చింది. ఈ సుదీర్ఘ రైతాంగఉద్యమం పలు సంఘటిత ప్రజాపోరాటాలకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2021-12-10T06:15:12+05:30 IST