Oct 15 2021 @ 13:52PM

Aryan Khan కు అసలు కష్టాలు స్టార్ట్.. పొద్దున్నే ఆరింటికి లేవాల్సిందే.. స్నానం కూడా బయటే.. జైల్లో పరిస్థితి ఇదీ..!

మొదట్లో అందరూ ఏదో చిన్న విషయం అనుకున్నారు. కానీ, పరిస్థితి విషమించినకొద్దీ  తీవ్రత అర్థం అవుతోంది. ఇటు సామాన్య జనం, అటు బాలీవుడ్ జనం అందరూ ఇప్పుడు షారుఖ్ ఖాన్ గురించి, ఆర్యన్ ఖాన్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. బెయిల్ దొరకటం అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో జూనియర్ ఖాన్ జైల్లో ఎంత కాలం ఉంటాడని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. తప్పకుండా, కనీసం... అక్టోబర్ 20వ తేదీ వరకైతే ఉండాల్సిందే. ఆ తరువాత కింగ్ ఖాన్ తనయుడు ఇంటికి రావచ్చు...


డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్‌ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. అయితే, అదే ముంబై మహానగరంలో కొద్ది రోజుల క్రితం దాకా... మహారాజు ఇంట్లో యువరాజులా లైఫ్‌ని ఎంజాయ్ చేసిన చోటే బాద్షా ఇప్పుడు అనేక బాధలు పడక తప్పదంటున్నారు. ఆర్థర్ రోడ్ జైలు సంగతి తెలిసిన వారు చెబుతోన్న వివరాలు వింటే, ఎవరికైనా షాక్ తప్పదు...

(ఓ సినిమాలో ప్రతీకాత్మక చిత్రం)

ఉదయం 6 గంటలకే నిద్ర లేవాలి...

ఉదయం 6 గంటలకి నిద్ర లేవటం నిజానికి పెద్ద కష్టమేం కాదు. కానీ, బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కి రోజు మొదలయ్యేదే మధ్యాహ్నం! బారెడు పొద్దెక్కే దాకా పడుకునే అలవాటు సహజంగానే వారికి ఉంటుంది. ఆర్యన్ ఖాన్ కూడా అదే టైపు అయితే మాత్రం సమస్యే. జైల్లో ఉదయం 6 గంటలకే అధికారులు విజిల్స్ వేస్తూ ఖైదీల్ని నిద్ర లేపుతారు. తరువాత 7 గంటలకి టీ, పోహా లాంటివి ఇస్తారు. 7 నుంచీ 10 గంటల లోపే ఆర్యన్ ఖాన్ బ్రేక్‌ఫాస్ట్, స్నానం రెండూ కానిచ్చేయాల్సి ఉంటుంది... 


ఇరుకైన వార్డులో... 250 మంది మధ్య! 

కింగ్ ఖాన్ షారుఖ్ ఇల్లు ముంబైలో ల్యాండ్ మార్క్. బాద్షా విలాసవంతమైన గ‌ృహాన్ని ‘మన్నత్’ అంటారు. అందులో తన విశాలమైన బెడ్ రూంలో పడుకునే ఆర్యన్ ఇప్పుడు ఆర్థర్ రోడ్ జైల్లో జనరల్ వార్డులో ఉండాలి. అతడితో పాటూ 250 మంది వరకూ ఖైదీలుంటారు. నిజానికి సదరు వార్డులో ఉండాల్సిన వారి సంఖ్య 50 నుంచీ 80 వరకూ మాత్రమే. కానీ, ఖైదీల తాకిడి ఎక్కువగా ఉండటంతో 250 మందిని ఉంచుతారట! వారి మధ్యే ఆర్యన్ కూడా మరికొన్నాళ్లు ఇరుకు జీవితం కొనసాగించక తప్పదు.

గంటన్నర సేపు మాత్రమే టీవీ...

ఉదయం 11.30 గంటలకి భోజనం పెడతారట. అది తిన్న తరువాత ఆర్యన్ కూడా మిగతా వందలాది మంది ఖైదీలతో కలసి టీవీ చూడవచ్చు. ఒక్కో బ్యారెక్‌లో ఒక టీవీ ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచీ 1.30 వరకూ అది నడుస్తుంటుంది. కానీ, ఠీవీగా సోఫాలో కూర్చుని భారీ స్మార్ట్ టీవీ చూసే జూనియర్ ఖాన్ జైలు టీవీని ఎంత మాత్రం ఎంజాయ్ చేయగలడు? అనుమానమే...


అరగంట వాకింగ్ టైం... కానీ... 

మధ్యాహ్న భోజనం తరువాత అరగంట సేపు ఖైదీల్ని వాకింగ్ చేయనిస్తారు జైలు అధికారులు. కానీ, లోపలే అటు ఇటు నడవాల్సి ఉంటుంది. మరి విపరీతంగా ఖైదీల రద్దీతో కిటకిటలాడే ఆర్థర్ రోడ్ జైల్లో వాకింగ్ సాధ్యమేనా? ‘నో ఛాన్స్’ అంటున్నారు విషయం తెలిసిన వారు. వాకింగ్ చేస్తుంటే ఒకర్నొకరు ఢీకొట్టుకునేటంత ట్రాఫిక్ ఉంటుందట!


జనం మధ్యే భోజనం... 

మధ్యాహ్నం 3.30 గంటలకి ఖైదీలకు టీ ఇస్తారు. ఆ తరువాత, 6 గంటలకి బ్యారెక్ గేట్లు మూసేస్తారు. ఉదయం తీసుకున్నట్లే హెడ్ కౌంట్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటారు. రాత్రి 7 గంటల నుంచీ డిన్నర్ టైం మొదలవుతుంది. అయితే, ఆర్యన్ ఖాన్ ఇతర సామాన్య ఖైదీలతో పాటూ ‘క్యూ’లో ప్లేటు పట్టుకుని నిల్చోవాల్సి వస్తుందట! ఒకవేళ మళ్లీ తినాలనుకుంటే, మరోసారి 15 నుంచీ 20 నిమిషాల దాకా ‘క్యూ’లో ఉండాల్సిందే! ఈ విధంగా రాత్రి 9 లోపు భోజనం ముగించాలి... 

(ఓ సినిమాలో ప్రతీకాత్మక చిత్రం)

బాద్షా వారసుడికి బాతింగ్, బాత్రూం కష్టాలు... 

స్నానం, టాయిలెట్స్‌కు సంబంధించి ఆర్యన్ ఖాన్‌కు తీవ్రమైన ఇబ్బందులు తప్పవంటున్నారు చాలా మంది. అతను ఇతర ఖైదీలందరితో కలసి ఓపెన్ ఏరియాలో స్నానం చేయాలి. ఓ సిమెంట్ తొట్టి లాంటి దాంట్లో అధికారులు ఉదయాన్నే నీరు నింపుతారు. అందులోని నీటినే స్నానాలకు, బట్టలు పిండుకోవటానికి ఖైదీలు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే, స్నానం చేయటం ఎంత ఆలస్యమైతే తొట్టిలోని నీరు అంత మురికిగా మారే అవకాశం ఉంటుందన్నమాట! బెయిల్ లభించే దాకా ఆర్యన్‌కి కూడా సామూహిక స్నానం తప్పదు. అలాగే, జైల్లో టాయిలెట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా... పైగా ఓవర్ క్రౌడెడ్ ఆర్థర్ రోడ్ జైల్లో మరీ దారుణమట! వందలాది మంది ఖైదీలకు కొన్నే టాయిలెట్స్ ఉంటాయి. అవి బాగా అపరిశుభ్రంగా ఉండటం సర్వ సాధారణం. ఆర్యన్ ఖాన్ కూడా కొన్నాళ్లు మురికి, దుర్గంధంతో కూడిన టాయిలెట్స్ వాడక తప్పని పరిస్థితి... 


ఆర్యన్ ఖాన్ నిజంగా తప్పు చేశాడో లేదో మనకు ఇప్పుడే తెలియదు. కానీ, ఆ రోజు రాత్రి ఆ క్రుయిజ్‌లో అతను ఉండటం మాత్రం అతి పెద్ద పొరపాటు. దాని పర్యవసానాలే, జైల్లో అతడికి ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా... 

Bollywoodమరిన్ని...