జైత్రయాత్ర

ABN , First Publish Date - 2021-10-16T05:30:00+05:30 IST

‘కర్రలతో సమరం కాదు.. పిండివంటలతో పండుగ చేద్దాం’ అని కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన పిలుపును దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు పట్టించుకోలేదు.

జైత్రయాత్ర
దేవరగట్టు బన్ని కర్రల సమరంలో పాల్గొన్న భక్తులు

  1. కర్రల సమరం
  2.  దేవరగట్టులో కొనసాగిన ఆచారం
  3. ఘనంగా మాళమల్ల్వేరుడి వేడుక


ఆలూరు/ ఆలూరు రూరల్‌/హొళగుంద/కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘కర్రలతో సమరం కాదు.. పిండివంటలతో పండుగ చేద్దాం’ అని కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన పిలుపును దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు పట్టించుకోలేదు. ఇది తమ ఆచారమని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చారు. దేవరగట్టులో మాళమల్లేశ్వర స్వామి భక్తులు కర్రలతో సమరానికి దిగారు. విజయదశమి సందర్భంగా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవంలో సంప్రదాయమే గెలిచినట్లయింది. శుక్రవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ కర్రల సమరంలో 47 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అధికారులు ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.


కిటకిటలాడిన దేవరగట్టు

కొవిడ్‌ కారణంగా గత ఏడాది బన్సి ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా, వేడుక కొనసాగింది. ఈ ఏడాది కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో జిల్లాతోపాటు కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు భారీగా వచ్చారు. దేవరగట్టుకు చేరుకునే మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. ఉత్సవం నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులతో పాటు దేవరగట్టు చుట్ట పక్కల ప్రాంతాలైన నిట్రవట్టి, బిలేహల్‌, విరుపాపురం, ఎల్లార్తి, సులవాయి తదితర 15 గ్రామాల భక్తులు జైత్రయ్రాతలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులు రాత్రి 11 గంటల ప్రాంతంలో డొళ్లినబండ వద్దకు చేరుకున్నారు. పాత కక్షలు, మనస్పర్థలకు చోటు లేకుండా, కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించుకుందామని బాసలు చేశారు. అనంతరం కొండపైన ఆలయంలో మాళ మల్లేశ్వరుడికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కర్రల సమరం మొదలైంది. జైత్రయాత్ర రాక్షసపడి గుండం వరకు సాగింది. అనంతరం ఉత్సవ మూర్తులను శమీవృక్షం వద్దకు తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ విగ్రహాలు ఎదురు బసవన్న గుడికి, అక్కడి నుంచి మల్లప్ప గుడికి చేరుకున్నాయి. బసవన్న గుడి ఆలయ ప్రధాన పూజారి భవిష్యవాణి వినిపించారు. 


పగలిన తలలు

దేవరగట్టులో కర్రల సమరం హోరాహోరీగా సాగింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు జరిగిన బన్ని ఉత్సవం రణరంగాన్ని తలపించింది. ఇనుప రింగులు చుట్టిన కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో 80 మందికి పైగా గాయపడ్డారు. కానీ అధికారులు 45 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని, ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డితో పాటు ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి,  డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఉత్సవాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు గ్రామం నుంచి 150 మంది మాత్రమే ఉత్సవాలకు హాజరు కావాలని సూచించారు. కానీ భక్తులు  పట్టించుకోలేదు. లక్షకు పైగా భక్తులు వేడుకలో పాల్గొన్నారు. బన్ని సమరంలో  ఇనుప రింగులు తొడిగిన కర్రలను వినియోగించారు. కర్రల సమరాన్ని కొందరు వ్యక్తిగత కక్షలకు వాడుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో అరికెర గ్రామానికి చెందిన పరమేష్‌, ఆలూరుకు చెందిన వీరశేఖర్‌, గోపీ తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మిదేవి అనే మహిళపై అగ్ని కాగడాలను విసిరారు. దీంతో నిప్పంటకుని ఆమె గాయపడ్డారు. బాధితురాలని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డీఎస్పీలతో పాటు 1200 మంది పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. మరోవైపు ఉత్సవాల్లో నాటుసారా ఏరులై పారింది. నాటుసారా స్థావరాలపై పోలీస్‌, సెబ్‌ అధికారులు విస్తృతంగా దాడులు చేసినా, ఉత్సవాల్లో బహిరంగంగా నాటుసారా విక్రయించారు. 


భవిష్యవాణి 

బన్ని ఉత్సవాల అనంతరం స్వామి భవిష్యవాణి (కార్నీకం) చెప్పారు. మల్లయ్యస్వామి శనివారం ఉదయం ఒక్కసారిగా గట్టిగా గోపరక్‌ అనగానే భక్తులు నివ్శబ్దం పాటించారు. 2023 వరకు మారెమ్మ దేశ సంచారం చేస్తుందని స్వామి పేర్కొన్నారు. పత్తికి క్వింటం ధర రూ.5,600, జొన్న క్వింటం ధర రూ.2,600 ఉంటుందని తెలిపారు. 5-6, 6-3 అని అన్నారు. 



 



















Updated Date - 2021-10-16T05:30:00+05:30 IST