IPL: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ను వరించిన విజయం

ABN , First Publish Date - 2022-05-08T01:17:04+05:30 IST

పంజాబ్ కింగ్స్‌ (Punjab kings)తో జరిగిన ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 6

IPL: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ను వరించిన విజయం

ముంబై: పంజాబ్ కింగ్స్‌ (Punjab kings)తో జరిగిన ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన పంజాబ్ బౌలర్లు చివర్లో పట్టుబిగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా పంజాబ్ ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్-జోస్ బట్లర్ ద్వయం క్రీజులోకి వస్తూనే బ్యాట్లు ఝళిపించింది. యథేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి జట్టును విజయం దిశగా నడిపించారు. 


చివరి ఓవర్లలో విజయావకాశాలు ఇరు జట్లకు సమానంగా మారి ఉత్కంఠకు దారితీసినప్పటికీ క్రీజులో పడిక్కల్, షిమ్రన్ హెట్మెయిర్ ఉండడంతో రాజస్థాన్ గెలుపు ఖాయమైంది. 31 పరుగులు చేసిన పడిక్కల్ 182 పరుగుల వద్ద అవుటైనా, ఆ తర్వాతి పనిని హెట్మెయిర్ పూర్తి చేశాడు. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి రాజస్థాన్ విజయాన్ని అందుకుంది.


జైస్వాల్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 2  సిక్సర్లతో 68 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ (23) మరోమారు విఫలమయ్యాడు. హెట్మెయిర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్‌కు రెండు వికెట్లు లభించాయి. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు భారీ స్కోరు సాధించింది. బెయిర్‌స్టో 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా జితేశ్ శర్మ 38, రాజపక్స 27, లివింగ్‌స్టోన్ 22 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Read more