Abn logo
Jun 13 2021 @ 23:55PM

మాయా..జలం

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు నాల్గోసారి టెండర్‌

అస్మదీయుల కోసం పదేపదే నిర్వహణ

రూ.కోట్ల పనుల కోసం జిల్లా ఇన్‌చార్జి ‘పెద్ద’ ఒత్తిడి

ముందుకు సాగని పనులు

జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనుల్లో సిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అయినవారి కోసం టెండర్ల ఆట నడుస్తోంది. అస్మదీయులకు పనులు అప్పగించేందుకు ముచ్చటగా మూడుసార్లు పిలిచిన టెండర్లను రద్దు చేశారు. నాల్గోసారీ పిలిచారు. ఎలాంటి నిబంధనలు మార్చకుండా పదేపదే ఒకేలా టెండర్‌ పిలవడం వెనుక రాజకీయ పెద్దల మాయా‘జలం’ కనిపిస్తోంది.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ అమల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ పెద్ద చక్రం తిప్పుతున్నారు.  ఫలితంగా నాసిరకం పైపులు, సామగ్రితో జల్‌ జీవన్‌ పనులు జరిగిపోతున్నాయి. అవి కూడా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతోంది. కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుంది. మండలాల్లోని పనులను ఇప్పటికే నామినేషన్‌పై అప్పగించేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పనుల కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. వీటిని చేజిక్కించుకునేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అంతా అవినీతిమయం

జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా మూడు దశల్లో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ మూడు దశల్లోనూ అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు డీఐ పైపులు, హెచ్‌డీపీఈ పైపులు, హౌస్‌ హోల్డ్‌ ట్యాప్‌ కనెక్షన్‌ ఫిట్టింగ్‌లు ఉత్పత్తి చేసే ప్రధాన ఉత్పత్తిదారుల నుంచి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈవోఐ)ను ఆహ్వానిస్తారు. తక్కువ ధరకు సరఫరా చేయడానికి ముందుకొచ్చే వారిని ఎల్‌1గా ప్రకటిస్తారు. కానీ, ఈవోఐల విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడికి లొంగిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచి వాటిని రద్దు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ గత ఏడాది నవంబరు 6న ఈవోఐ నోటీసు ఇచ్చింది. ఇందులో 8 కంపెనీలు పాల్గొన్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా దీన్ని రద్దు చేశారు. డిసెంబరు 10న మళ్లీ ఈవోఐ పిలిచారు. అందులో 9 కంపెనీలు పాల్గొన్నాయి. దీన్ని కూడా పక్కన పెట్టేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో రెండోసారి పిలిచిన ఈవోఐలోనే మార్పులు చేసి మూడోసారి ఈవోఐ పిలిచారు. కానీ, పేరున్న కంపెనీలు అందులో పాల్గొనడంతో వాటిని తప్పించి, తమ వారికి పనులు ఎలా అప్పగించాలో అంతుపట్టక వాటినీ నిలిపివేశారు. తాజాగా మే 31న నాల్గోసారి ఈవోఐకి నోటీసు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న నిబంధనలన్నీ గతంలో మూడుసార్లు పిలిచిన టెండర్లలో ఉన్న నిబంధనలే కావడంతో టెండరులో పాల్గొనేవారు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిసారీ టెండర్‌ పిలవడం, ఈఎండీగా రూ.2.5 లక్షలు కట్టించుకోవడం, ఆ తర్వాత వాటిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  

రూ.వందల కోట్ల పనులకు టెండర్‌

ప్రభుత్వంలో కీలక మంత్రిగా చెలామణి అవుతున్న ‘పెద్ద’ ఒకరు తమ అనుచరుల కోసం జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు పదేపదే అడ్డుపడుతున్నారని అధికారులే వాపోతున్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో సుమారు రూ.5వేల కోట్ల విలువైన ఈ పనుల్లో బిల్లులు పెండింగ్‌ పడటం అంటూ ఉండదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా బిల్లులు చేతికొస్తాయి. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. పేరున్న సంస్థలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ టెండర్లలో పాల్గొంటాయి. పక్కా నిబంధనల ప్రకారం నడుచుకునే ఆ కంపెనీలు అయితే పెద్దగా కమీషన్‌ ముట్టదన్న ఆలోచనతో తమకు అనుకూలమైన కంపెనీలకు పనులను కట్టబెట్టేందుకే పదేపదే టెండర్లను రద్దుచేసి పిలుస్తున్నారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. తద్వారా ప్రతిసారీ రూ.2.50 లక్షలు కట్టలేక చాలా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా తమకు అనుకూలమైన కంపెనీలే పోటీలో మిగిలి.. పనులు చేజిక్కించుకునేలా పెద్ద స్కెచ్‌ వేశారు.