మాయాజలం మాయం

ABN , First Publish Date - 2021-07-30T05:36:39+05:30 IST

మాయాజలం మాయం

మాయాజలం మాయం
ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు

జల్‌జీవన్‌ మిషన్‌ టెండర్లు రద్దు

అనర్హులకు కేటాయింపుతో ముందుకు సాగని పనులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

విజయవాడ, ఆంధ్రజ్యోతి : వేల కోట్ల రూపాయల విలువైన పనుల్లో అక్రమాలు చోటుచేసు కుంటున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన విషయాలు అక్షర సత్యాలయ్యాయి. కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు అయినవారికే దక్కేలా చేయాలన్న ప్రభుత్వ పెద్దల దృఢచిత్తం ఎట్టకేలకు సడలిపోయింది. జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు సంబంధించి గతంలో జరిపిన టెండర్లు, కేటాయింపులన్నీ రద్దు చేస్తున్నట్లు రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌, జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

అసలు ఉద్దేశం ఇదీ..

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం జల్‌జీవన్‌ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుంది.  కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95,66,332 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 30,74,310 కుటుంబాలకు 2019, ఆగస్టు 15 నాటికే ట్యాప్‌ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 64.92 లక్షల కుటుంబాలకు కుళాయిలు ఏర్పాటు చేయడమే జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యం. ఇందుకు అధికారులు రూ.10,975 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 32 లక్షల కుటుంబాలకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రూ.4,800.59 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి ఆమోదం కూడా ఇచ్చేశారు. రెండో దశలో మిగిలిన కుటుంబాలకు కుళాయిలు ఏర్పాటు చేస్తారు. 

దుర్వినియోగం ఇలా..

జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రధాన పైపులైన్‌ మార్గం వేసేందుకు వినియోగించే డీఐ (డక్టయిల్‌ ఐరన్‌) పైపులు, ప్రధాన వీధుల్లో నీటి సరఫరాకు వాడే హెచ్‌డీపీఈ (హైడెన్సిటీ పాలి ఇథిలీన్‌) పైపులు, ఇంటింటికీ ట్యాప్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు హౌస్‌హోల్డ్‌ ట్యాప్‌ కనెక్షన్‌ ఫిట్టింగ్‌లు సమకూర్చేందుకు ప్రధాన ఉత్పత్తిదారుల నుంచి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈవోఐ)ను ఆహ్వానించి తక్కువ ధరకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన వారిని సరఫరాదారులుగా ఎంపిక చేశారు. అయితే, ఈ ప్రక్రియ మొత్తం అవినీతిమయంగా జరిగిందని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే చెప్పింది. అయినా కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఈ సరఫరా బాధ్యతలను కట్టబెట్టారు. వారెవరికీ తగిన అర్హతలు లేకపోవడంతో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా డీఐ పైపులు, హెచ్‌డీపీఈ పైపులు వంటివి సరఫరా చేయలేకపోయారు. దీంతో పనులు ముందుకు సాగలేని పరిస్థితి. పనులు జాప్యమైతే కేంద్ర నిధులు వృథా అయిపోయే అవకాశం ఉంది. దీంతో అధికారులు చేసేదేమీ లేక గతంలో జరిపిన టెండర్లు, కేటాయింపులను రద్దు చేశారు. జిల్లాలవారీగా బీఎస్‌ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తిదారుల నుంచి ఆయా సామగ్రి కొనుగోలు చేసుకోవచ్చని ఆదేశించారు.  



Updated Date - 2021-07-30T05:36:39+05:30 IST