Abn logo
Sep 27 2021 @ 12:32PM

కాలుష్య కాసారంగా బుర్హన్‌ ఖాన్‌ చెరువు

పరిసర బస్తీల్లోకి మురుగు నీరు

ఇబ్బందిలో ప్రజలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


హైదరాబాద్/పహాడీషరీఫ్‌: నగర శివారు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుర్హన్‌ ఖాన్‌ చెరువులోకి డైన్రేజీ నీరు చేరుతోంది. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నామని పరిసర బస్తీల ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల జల్‌ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌ నగర్‌, హాబీబ్‌ కాలనీ అబ్దుల్లా యహియా నగర్‌, ఆలైన్‌ కాలనీ, వాదీ ఏ ఒమర్‌, వాదీ ఏ సలేహిన్‌, ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌ న్యూ బాబానగర్‌ తదితర బస్తీల వద్ద ఔట్‌ లెట్‌ లేకపోవడంతో మురుగు నీరంతా బుర్హన్‌ ఖాన్‌ చెరువులోకి వెళ్తోంది. 


ఔట్‌ లెట్‌ లేకుండా విక్రయం

ఈ చెరువు గొలుసు కట్టు చెరువు కావడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపునీరు బుర్హన్‌ ఖాన్‌ చెరువులో చేరుతోంది. కానీ భూ కబ్జాదారులు చెరువు భూములను కొనుగోలు చేసి ఎలాంటి ఔట్‌ లెట్‌ లేకుండా విక్రయించడంతో పలు కాలనీలు వెలిశాయి. క్రమంగా కాలనీలు పెరగడంవల్ల డైన్రేజీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 20 సంవత్సరాల తర్వాత కురుస్తున్న భారీ వర్షాలకు బుర్హన్‌ఖాన్‌ చెరువు కూడా నిండిపోయింది. చెరువు తూములు పని చేయకపోవడంతో ఇరిగేషన్‌ అధికారులు గతంలో పాతిన ఎఫ్‌టీఎల్‌ రాళ్ల వరకు నీరు రావడంవల్ల అక్కడి కాలనీలోకి వరద చేరింది. దీంతో అధికారులు వరద నీరు చేరిన ప్రాంతాలను గుర్తించి ఎఫ్‌టీఎల్‌ రాళ్లను తిరిగి ఫిక్స్‌ చేస్తున్నారు.


ఆ కాలనీలను కూడా కూల్చివేస్తారా..?

30 సంవత్సరాల క్రితం కాయ కష్టం చేసుకొని భూములు కొని ఇల్లు కట్టుకున్నామని, ఇంటి పన్ను, కరెంట్‌, నీటి బిల్లులు చెలిస్తున్నామని ఇటీవల ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించా డు. ఇల్లును కూల్చి వేయాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదని పలువురు ఆరోపిస్తున్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పక్కన ఉన్న మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎన్నో కాలనీలు వెలిశాయని.. ఆ కాలనీలను కూడా కూల్చి వేస్తారా అని ఆయా కాలనీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


విషజ్వరాల బారిన పడుతున్నాం

చెరువులోకి మురుగు చేరుతుండడంతో దోమలు, ఈగలు వృద్ధిచెంది విషజ్వరాల బారిన పడుతున్నామని పరిసర బస్తీల ప్రజలు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని మురుగు నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, బస్తీలు కూడా ముంపునకు గురికాకుండా దృష్టి సారించాలని ఆయా బస్తీల ప్రజలు కోరుతున్నారు.


ప్రణాళికలు రూపొందించాం

బుర్హన్‌ఖాన్‌ చెరువులో మురుగు నీరు చేరకుండా ప్రత్యేక డైన్రేజీ లైన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. భారీ వర్షాలకు వరద నీరు వచ్చినప్పుడు బస్తీలు ముంపునకు గురికాకుండా ట్రంక్‌ లైన్‌ పనులు చేపడుతున్నాం. గత సంవత్సరం కూడా బుర్హన్‌ ఖాన్‌ చెరువు నీరు బయటకు వెళ్లేలా ప్రత్యేక పైపులైన్‌ వేశాం. ప్రభుత్వం కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీల్లో మురుగు, వర్షపు నీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక నిధులు కేటాయించింది. త్వరలో మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు కూడా పరిష్కారం కానున్నాయి.

- జీపీ కుమార్‌, కమిషనర్‌, జల్‌పల్లి మున్సిపాలిటీ