Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నదాతల్లో కలవరం

ఉదయగిరి రూరల్‌, నవంబరు 28: అల్పపీడన ప్రభావంతో వర్షాలు మళ్లీ మొదలు కావడంతో అన్నదాతల్లో కలవరం నెలకొంది. ఇటీవల 20 రోజులపాటు కురిసిన వర్షాలకు సాగులో వరి, మినుము, పసుపు, మిర్చి, పొగాకు పంటలకు తీరని నష్టం చేకూరింది. వర్షాలకు నాలుగైదు రోజులపాటు తెరపివ్వడంతో రైతులు పంటలో చేరిన నీరు బయటకు పంపడంతోపాటు నేలవాలిన పంటలను సరి చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎడతెరపిలేని వర్షాలు కురవడంతో పంటలు ఇక చేతికందే అవకాశం లేదని రైతులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7.40 గంటల వరకు ఉదయగిరిలో 37.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అనంతరం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతినడం, పలు గ్రామాల్లో చెరువులు ప్రమాదపుటంచుకు చేరుకుని కట్టలు తెగే ప్రమాదం ఉండడంతో అన్నదాతల్లో కలవరం నెలకొంది.

నీట మునిగిన జామ, బొప్పాయి తోటలు

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆదివారం దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో జామ, బొప్పాయి తోటలు నీటమునిగాయి. గ్రామానికి చెందిన కుంకు వెంకటనారాయణ ఆరు ఎకరాల్లో బొప్పాయి, జామ పంటలు సాగు చేశాడు. హైవే రహదారి పక్కనే తోట ఉండడంతో వర్షం కారణంగా నీరంతా తోటలోకి చేరి పంట మునిగి తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయాడు. 


Advertisement
Advertisement