అతిపెద్ద సినిమా చైన్‌ను రక్షించలేకపోయిన జేమ్స్‌ బాండ్

ABN , First Publish Date - 2020-10-06T05:19:54+05:30 IST

జేమ్స్ బాండ్ పేరును వినని వ్యక్తంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అంతలా జేమ్స్ బాండ్ సిరీస్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ

అతిపెద్ద సినిమా చైన్‌ను రక్షించలేకపోయిన జేమ్స్‌ బాండ్

లండన్: జేమ్స్ బాండ్ పేరును వినని వ్యక్తంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అంతలా జేమ్స్ బాండ్ సిరీస్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఎంతో మంది యుద్దవీరులు, మాఫియా డాన్‌లు, క్రిమినల్స్‌తో పోరాడి జేమ్స్ బాండ్ గెలిచాడు. కానీ ఇప్పుడు కరోనా సమయంలో యూకే, అమెరికాలలో అతిపెద్ద సినిమా చైన్‌గా ఉన్న సినీవరల్డ్‌ను మాత్రం జేమ్స్ బాండ్ రక్షించలేకపోయాడు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ జేమ్స్ బాండ్ తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ ఇప్పుడు మరోమారు వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాతలు గత వారం వెల్లడించారు. 


కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జేమ్స్ బాండ్ చిత్రంతో ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వస్తారని థియేటర్ల యాజమాన్యాలు ఆశపడ్డాయి. మిగతా చిత్రాల మాదిరిగానే జేమ్స్ బాండ్ చిత్రం కూడా వాయిదా పడటంతో సినివరల్డ్‌ సినిమా చైన్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. అమెరికాలోని 536 రీగల్ థియేటర్లను, యూకేలోని 127 సినివరల్డ్, పిక్చర్‌హౌస్ థియేటర్లను గురువారం నుంచి మూసివేయనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. 


ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటామని.. సరైన సమయంలో తిరిగి థియేటర్లను తెరుస్తామని పేర్కొంది. కాగా.. సినివరల్డ్ మూసివేతతో యూకే, అమెరికాలో దాదాపు 26 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇక సినివరల్డ్ ప్రకటనపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. ప్రజలు సినిమాలకు వెళ్లి థియేటర్లను కాపాడాలని వేడుకున్నారు.

Updated Date - 2020-10-06T05:19:54+05:30 IST