జమిలి ఎన్నికలు అవసరం

ABN , First Publish Date - 2022-01-26T07:24:46+05:30 IST

జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. ..

జమిలి ఎన్నికలు అవసరం

 పంచాయతీ నుంచి లోక్‌సభ దాకా..

 ఒకే సారి ఎన్నికలతో అభివృద్ధి సుసాధ్యం

 పౌరులు, పార్టీలకు ప్రధాని మోదీ పిలుపు


న్యూఢిల్లీ, జనవరి 25: జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకున్న మంగళవారం ఆయన బీజేపీ పన్నా ప్రముఖ్‌(పేజీ కార్యకర్త)లను ఉద్దేశించి మాట్లాడారు. జమిలీ స్ఫూర్తితో ‘ఒకే దేశం.. ఒకే ఓటరు జాబితా’ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్నాం. మన దేశంలో ఓటింగ్‌ కూడా 75 శాతాన్ని దాటాలి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి. పంచాయతీ మొదలు సార్వత్రిక ఎన్నికలదాకా.. ప్రతి పోలింగ్‌లో 75ు మార్కును దాటాలి’’ అని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సమస్యలపై చర్చకు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటారు. కానీ, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించరు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ పరిస్థితిలో మార్పు రావాలి’’ అని ఆయన అభిలషించారు. ఈసీఐ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు. వ్యక్తులు, వ్యవస్థకూ నోటీసులు జారీ చేసే అధికారం ఈసీఐకి ఉందన్నారు. ఎన్నికల సమయంలో బ్యూరోక్రసీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలదని, అధికారులను బదిలీ చేయగలదంటూ ప్రశంసించారు.


ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలి: సర్వే

ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ పౌరులు అభిప్రాయపడుతున్నారని ‘పబ్లిక్‌ యాప్‌’ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో 86ు మంది ఓటు హక్కు వినియోగాన్ని తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. 56.3ు మంది ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పారు. 5.22ు మంది తమకు ఎన్నిక తేదీ తెలియక ఓటు వేయలేదని, 7.19ు మంది తమకు అభ్యర్థులు నచ్చక పోలింగ్‌కు దూరంగా ఉన్నామని, 1.27ు మంది బద్ధకం/ఓటింగ్‌పై అనాసక్తితో ఓటు వేయలేదని ఈ సర్వేలో వెల్లడించారు.


ఓటుహక్కును బాధ్యతగా గుర్తెరగాలి: వెంకయ్య

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 75% పోలింగ్‌ జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. కొవిడ్‌తో ఉన్న కారణంగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి తన సందేశాన్ని ఆడియో రూపంలో పంపించారు. ‘‘ప్రతి ఒక్కరూ ఓటుహక్కును హక్కుగా కాక.. బాధ్యతగా గుర్తెరగాలి. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 44.87% ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. 2014లో 66.44శాతంగా ఉండేది. 2019లో అది 67.40శాతానికి చేరుకుంది. 2024లో 75ు పోలింగ్‌ లక్ష్యాన్ని సాధించాలి’’ అని ఆయన అభిలషించారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, ఓటింగ్‌ శాతం పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు.

Updated Date - 2022-01-26T07:24:46+05:30 IST