మార్షల్‌ ఆర్ట్స్‌లో మేటి.. పూటగడవని దైన్యస్థితి

ABN , First Publish Date - 2020-07-31T09:21:45+05:30 IST

ముప్పై ఏళ్ల కెరీర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సహా దాదాపు యాభైకి పైగా అంతర్జాతీయ పతకాలు కొల్లగొట్టిన ప్రతిభావంతుడు. ..

మార్షల్‌ ఆర్ట్స్‌లో మేటి..  పూటగడవని దైన్యస్థితి

ఆదుకోవాలంటున్న జమీల్‌ఖాన్‌

ముప్పై ఏళ్ల కెరీర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సహా  దాదాపు యాభైకి పైగా అంతర్జాతీయ పతకాలు కొల్లగొట్టిన ప్రతిభావంతుడు. మార్షల్‌ఆర్ట్స్‌లో అతడి దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది నేడు అకాడమీలు ఏర్పాటు చేసుకొని వృద్ధిలోకి రాగా, తను మాత్రం పూట భోజనానికి కూడా ఇబ్బందిపడుతున్న దైన్యస్థితి. విదేశాల్లో సైతం శభాష్‌ అనిపించుకున్న అంతర్జాతీయ కరాటే మాస్టర్‌ జమీల్‌ ఖాన్‌ మన ప్రభుత్వాలు, క్రీడాశాఖ ఉన్నతాధికారులకు మాత్రం కానరావడం లేదు. ఇప్పటికైనా..తన ప్రతిభా పాటవాలు గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్న జమీల్‌ కష్టాలు అతడి మాటల్లోనే..


మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. నాన్న కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. కరాటే మీద మక్కువతో 14వ ఏట మార్షల్‌ ఆర్ట్స్‌ అభ్యసించడం ప్రారంభించా. గోదావరిఖనికి చెందిన రాజేశం మాస్టర్‌ దగ్గర కరాటేలో ఓనమాలు నేర్చుకున్నా. అనతికాలంలోనే కుంగ్‌ఫూ, కరాటే, తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ 7-డాన్‌ వరకు చేరుకున్నా. మెరుగైన కెరీర్‌కోసం 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చి ఓ క్లబ్‌లో కోచ్‌గా చేరా. నాటినుంచి ఎంతోమంది పిల్లలను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేస్తూనే నేను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. అమెరికాలో జరిగిన తైక్వాండో వరల్డ్‌కప్‌ 65 కిలోల విభాగంలో 2016 నుంచి వరుసగా నాలుగుసార్లు పసిడి పతకాలు సాధించా. శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ కరాటే చాంపియన్‌షి్‌పలోనూ స్వర్ణాలు గెలిచా. విశ్వవేదికలపై 23 స్వర్ణాలతో కలిపి దాదాపు 60 పతకాలను కొల్లగొట్టా. జాతీయ స్థాయిలో వందకు పైగా మెడల్స్‌ లభించాయి. క్రీడాకారుడిగా కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నా కానీ, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయా.


అద్దె కట్టలేదని..వెళ్లగొట్టారు

హైదరాబాద్‌ మెహదీపట్నంలోని ఓ ఉర్దూ పాఠశాలలో పిల్లలకు శిక్షణ ఇస్తూ రోజులు వెళ్లదీస్తున్నా. లాక్‌డౌన్‌తో స్కూల్‌ మూతపడడంతో నాలుగు నెలలుగా ఎలాంటి ఆదాయమూ లేక రోడ్డునపడ్డా. ఎక్కడైనా బియ్యం, కూరగాయలు పంచుతుంటే అవి తెచ్చుకొని జీవనం సాగిస్తున్నా. ఇంటి అద్దె  కట్టలేదని యజమాని ఖాళీ చేయించాడు. మిత్రుల సహాయంతో మెహదీపట్నంలో ఓ చిన్న  గదిలో కుటుంబంతో ఉంటున్నా.

ప్రభుత్వం ఆదుకోవాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దాకా అందర్నీ కలిసి నా పరిస్థితి విన్నవించా. నేను సాధించిన పతకాలకు జీఓల ప్రకారం రావాల్సిన నగదు ప్రోత్సాహకాలను ఇప్పటికైనా అందించాలి. అలాగే ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ లేదా ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలి.

(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - 2020-07-31T09:21:45+05:30 IST