కళ, జీవితం

ABN , First Publish Date - 2021-01-08T06:32:32+05:30 IST

అప్పటిలో కళ కేవలం ‘డ్రాయింగ్ రూమ్’కు పరిమితం కాదు, అది వంట ఇంటిలోకి కూడా విస్తరించి ఉండేది. అది కుండ కానివ్వండి, మూకుడు కానివ్వండి, తెడ్డు కానివ్వండి, గరిటె కానివ్వండి, పంచపాత్ర కానివ్వండి- ప్రతిదీ కళాత్మకంగా ఉండేది...

కళ, జీవితం

అప్పటిలో కళ కేవలం ‘డ్రాయింగ్ రూమ్’కు పరిమితం కాదు, అది వంట ఇంటిలోకి కూడా విస్తరించి ఉండేది. అది కుండ కానివ్వండి, మూకుడు కానివ్వండి, తెడ్డు కానివ్వండి, గరిటె కానివ్వండి, పంచపాత్ర కానివ్వండి- ప్రతిదీ కళాత్మకంగా ఉండేది. ఒక కళాఖండంగా ఉండేది. అందువల్ల ఆనాటి ప్రజా జీవితంలో, గృహ జీవితంలో నిత్య జీవితంలో అందం ఉండేది, చందం ఉండేది, నిండుతనం ఉండేది.


ఆయన మొన్న రాలిపోయాడు. ఐతే, గుత్తులు గుత్తులుగా పూలను పూసిన తర్వాత, రాసులు రాసులుగా పండ్లను కాసిన తరువాత. అవి మల్లెల కంటే గుమ గుమలాడే పూలు, అవి మామిళ్ళ కంటే నోరూరించే పండ్లు. ఆయన పేరు జామినీరాయ్. అది దేశ దేశాలకు ప్రాకిన పేరు, తరతరాలకు నిలవ గల పేరు. 


జామినీరాయ్ ‘ఆర్టిస్ట్’ కాదని, ‘ఆర్టిజాన్’ మాత్రమే అని చులకన చేసేవారు కొందరున్నారు. ఇది ఒక పూర్వ సంప్రదాయాన్ని, ఒక ప్రశస్త సంప్రదాయాన్ని చులకన చేయడమే. ఆనంద కుమారస్వామి రాసినట్టు, ఒకనాడు మనదేశంలోనే కాదు, అన్ని దేశాలలో ఒకే వ్యక్తి ‘ఆర్టిస్టు’, ‘ఆర్టిజాన్’ కూడా. అందువల్లనే ప్రజల బతుకుల్లో కళ పెనవేసుకుని ఉండేది. అప్పటిలో కళ కేవలం ‘డ్రాయింగ్ రూమ్’కు పరిమితం కాదు, అది వంట ఇంటిలోకి కూడా విస్తరించి ఉండేది. అది కుండ కానివ్వండి, మూకుడు కానివ్వండి, తెడ్డు కానివ్వండి, గరిటె కానివ్వండి, పంచపాత్ర కానివ్వండి -ప్రతిదీ కళాత్మకంగా ఉండేది. ఒక కళాఖండంగా ఉండేది. అందువల్ల ఆనాటి ప్రజా జీవితంలో, గృహ జీవితంలో నిత్య జీవితంలో అందం ఉండేది, చందం ఉండేది, నిండుతనం ఉండేది. 


కళకు, జీవితానికి తిరిగి ఇట్టి సంబంధం కుదర్చడమే జామినీరాయ్ లక్ష్యం. అందువల్ల ఆయన జానపద కళారీతులను సొంతం చేసుకున్నాడు. ఆ రీతులను యథాతథంగా అనుసరించక, వాటిపై తన వ్యక్తిత్వం ముద్రవేశాడు. మొద్దుగీతలు గీస్తూ వాటిలో సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని పొదగడం జామినీరాయ్‌ ప్రత్యేకత. మట్టి రంగులను వాడుతూ, వాటికి కొత్త మెరుగులను, సొబగులను కూర్చడం ఆయన వైశిష్ట్యం. కొయ్య బొమ్మల వలె, మట్టి బొమ్మల వలె ఆయన మానవ మూర్తులను చిత్రించినా, వాటి స్థూలత్వంలో ఏవో లోతులు కనబడతాయి. వాటి స్థాణుత్వంలో ఏదో స్పందన కనబడుతుంది. జామినీరాయ్ మరణించాడు. ఐనా, ఆయన తన కళ ద్వారా జీవిస్తూనే ఉంటాడు. రేఖలకు, వర్ణాలకు ప్రాణం పోసి ఆయనొక నూతన జగత్తును సృష్టించాడు. ఆ జగత్తు నిలిచి ఉండువరకు ఆయన నిలిచే ఉంటాడు. 


1972 ఏప్రిల్ 28 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘అమరుడు: శ్రీ జామినీరాయ్’ నుంచి


ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలలోని కొన్ని భాగాలను ఆయనకు నివాళిగా ఏడాది కాలంగా ఇస్తున్నాం. నార్లవారికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాం.

– ఎడిటర్

Updated Date - 2021-01-08T06:32:32+05:30 IST