మురుగు నీటితో సహజీవనం

ABN , First Publish Date - 2021-07-30T04:44:49+05:30 IST

గద్వాల మునిసిపాలిటీలో విలీనమైన జమ్మిచేడు నాలుగో వార్డు సమస్యలతో సతమతమవుతోంది.

మురుగు నీటితో సహజీవనం
4వ వార్డులో ఇళ్ల ముందు నిల్వ ఉన్న మురుగు నీరు

- దుర్వాసనతో స్థానికులు సతమతం

- వానొస్తే ఇళ్లలోకి చేరుతున్న నీరు

- 4వ వార్డులోని జమ్మిచేడు దుస్థితి

గద్వాల రూరల్‌, జూలై 29 : గద్వాల మునిసిపాలిటీలో విలీనమైన జమ్మిచేడు నాలుగో వార్డు సమస్యలతో సతమతమవుతోంది. గతంలో మురుగు, వర్షం నీరు గ్రామ కంఠంలో ఉన్న పెద్ద గుంతలోకి వెళ్లిపోయేది. గ్రామ అవసరాల కోసం ఇటీవల ఆ స్థలాన్ని చదును చేశారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేక, మురుగునీరు బయటకు వెళ్లే దారి లేక ఇళ్ల చుట్టూ నిల్వ ఉంటోంది. వర్షం వస్తే ఏకంగా ఇళ్లలోకే నీరు చేరుతోంది. మురుగునీరు రోజుల తరబడి నీలిచిపోతుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. కొందరి ఇళ్లలోకి వెళ్లాలంటే ఆ మురుగునీటిలోనుంచే కాళ్లు పెట్టి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు దోమల బెడదతో వార్డు ప్రజలు రోగాలబారిన పడ్తున్నారు. తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ ద్వారా మిషన్‌ భగీరథ నీటిని కూడా సరఫరా చేస్తున్నారు. కానీ పైప్‌లైన్‌ సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరాకు తరుచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్‌ నర్సింహులు గత మార్చిలో మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు కౌన్సిల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వార్డులో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. దీంతో కౌన్సిలర్‌ ఎక్స్‌కవేటర్‌ సాయంతో వార్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలం వరకు కాలువ తీయడంతో కొన్ని నీళ్లు వెళ్లిపోయాయి. కానీ కొందరు కాలువను పూడ్చివేశారు. ఈ విషయాన్ని కూడా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కౌన్సిలర్‌ వాపోయారు. గత సోమవారం అదనపు కలెక్టర్‌ దృష్టికి కూడా సమస్యను తీసుకపోయానని చెప్పారు. 


స్థానిక రాజకీయాలే కారణం

విలీన గ్రామమైన జమ్మిచేడు గ్రామాన్ని నాలుగు, ఐదు వార్డులుగా విభజించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ఈ రెండు వార్డులను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అప్పటి నుంచి తమ వార్డుపై కౌన్సిల్‌ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తోందని కౌన్సిలర్‌ నర్సింహులు ఆరోపిస్తున్నారు.


ఇంటినే వదిలేశాను

ఈరమ్మ, స్థానికురాలు : నా ఇంటి చుట్టే మురుగు నీళ్లు చేరాయి. ఇంట్లోకి పోవాలంటే మురుగులో కాలు వేయాల్సిందే.. దుర్వాసన ఎక్కువైంది. దోమల బెడద కూడా తీవ్రమై ఇంటిని వదిలేసి అద్దె ఇంటిలో ఉంటున్నా. ఇప్పుడు నాకు అద్దె ఎవరిస్తారు. అడుగుదామంటే ఇక్కడికి ఎవరూ రావడం లేదు. 


కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయాను 

కావలి నర్సింహులు, 4వ వార్డు కౌన్సిలర్‌ : వార్డులోని పరిస్థితిని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా, ఆయన పట్టించుకోలేదు. నీళ్లను మళ్లిద్దామంటే అడ్డుకుంటున్నారు. దీంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని పరిశీలించి సమస్య పరిష్కరించాలని కోరాను.

Updated Date - 2021-07-30T04:44:49+05:30 IST