జమ్మూకశ్మీర్‌లో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే?

ABN , First Publish Date - 2020-08-05T07:38:32+05:30 IST

ఆర్టికల్‌ 375 నిర్వీర్యం జరిగి బుధవారానికి సరిగ్గా ఏడాది. అయినా.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది

జమ్మూకశ్మీర్‌లో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే?

  • 370 నిర్వీర్యమై ఏడాది.. ప్రజల్లో నైరాశ్యం
  • ఇప్పటికీ గృహ నిర్బంధంలో 21 మంది నేతలు
  • వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు
  • 8 నెలల తర్వాత సోషల్‌ మీడియా యాక్సెస్‌
  • చాలా కాలం ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలకు దూరం
  • పరిపాలనలో భారీగా స్థానికేతర అధికారులు
  • కుంటు పడిన ఆర్థికం.. నిరుద్యోగంలో యువత

(సెంట్రల్‌ డెస్క్‌): ఆర్టికల్‌ 375 నిర్వీర్యం జరిగి బుధవారానికి సరిగ్గా ఏడాది. అయినా.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవ్వలేదు..! పర్యాటకం పోటెత్తలేదు..! యువతకు ఉపాధి అవకాశాలూ రాలేదు..! రెండుగా విడిపోయిన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ది జరగలేదు..! ఇప్పుడక్కడ ఉన్నదంతా.. ప్రజల్లో నైరాశ్యం, స్థానికేతర అధికారుల ఆధిపత్యం, గృహ నిర్బంధాల్లోనే రాజకీయ నాయకులు, ఇంకా చాలాచోట్ల తెరుచుకోని దుకాణాలు, రేషన్‌ కోసం ఇక్కట్లపాలవుతున్న కశ్మీరీలు, చాలాచోట్ల పునరుద్ధరణ కాని ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలు, సోషల్‌ మీడియా.. ఇలా  అక్కడ ప్రతికూలాంశాల జాబితా కొండవీటి చాంతాడును మించిపోయింది.


కరోనాకు ముందే.. అతిపెద్ద లాక్‌డౌన్‌

దేశప్రజలకు కరోనాతో లాక్‌డౌన్‌ అంటే ఏమిటో తెలిసివచ్చింది. కానీ, కశ్మీర్‌ ప్రజలు గత ఏడాది ఆగస్టు 5 నుంచే లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఇంటికే పరిమితమై.. టీవీ చానళ్లు చూస్తూ.. అపరిమిత ఫోన్‌కాల్స్‌ ఆఫర్లు, డేటా ప్యాకేజీలు, ఇంటర్నెట్‌, స్ర్టీమింగ్‌ వీడియోలు, దూరంగా ఉన్నా.. వీడియోకాల్స్‌తో తమవారితో రోజూ మాట్లాడుకునేవారు. కానీ, ఏడాది కాలంగా ప్రకటిత, అప్రకటిత లాక్‌డౌన్లలో ఉంటున్న కశ్మీరీలకు మాత్రం.. నెలల తరబడి ఆ సదుపాయాలేమీ లేవు. ఇంటర్నెట్‌ సేవలు లేక.. మూడు దశాబ్దాలకు ముందు పరిస్థితులను నెమరువేసుకున్నారు. కశ్మీరీ విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయం. కరోనా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల విద్యార్థులు కనీసం ఆన్‌లైన్‌ పాఠాలు చదువుకుంటున్నా.. ఏడాది కాలంగా కశ్మీరీ విద్యార్థులకు ఆ వెసులుబాటే లేదు. 2జీ సేవలను పునరుద్ధరించాక పలు పాఠశాలలు ఆ ప్రయత్నాన్ని చేసినా.. డేటా వేగం సరిపోలేదు. దీంతో పిల్లలు ఒంటరితనంతో ఆత్మన్యూనతకు లోనయ్యారని, ఆందోళన, మానసిక ఒత్తిడి కారణంగా డ్రగ్స్‌కు బానిసయ్యారని ఫోరం ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇన్‌ కశ్మీర్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సోషల్‌ మీడియాపైనా 8 నెలల తర్వాత.. అంటే, ఈ ఏడాది మార్చిలో నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పటికీ చాలా చోట్ల ‘దేశ భద్రత’ పేరుతో మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. ప్రజలు నిత్యావసరాలకోసం ఇబ్బందులకు గురవుతున్నారు. 


నిర్బంధంలోనే నేతలు

ఆర్టికల్‌ 370 నిర్వీర్యం ప్రకటనకు ముందు రోజు నుంచే.. వంద మందికిపైగా రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్బంధించింది. వారిలో చాలా మందిని విడతల వారీగా విడుదల చేయగా.. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహ, ప్రభుత్వ నిర్బంధంలోనే ఉన్నారు. వీరితో కలిపి ఇంకా 21 మందిపై నిర్బంధం కొనసాగుతోంది. ఇది అధికారిక లెక్కలే..! కాంగ్రెస్‌ నేత సైఫుద్దీన్‌ సోజ్‌ వంటి వారెందరో ఇంకా అనధికారిక నిర్బంధంలో ఉంటున్నారు. గురువారం సైఫుద్దీన్‌ సోజ్‌ గోడచాటు నుంచి మీడియాతో మాట్లాడాల్సి రావడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. వీరి నిర్బంధానికి సర్కారీ కారణం ఒక్కటే..! శాంతిభద్రతల సమస్య.


అస్తవ్యస్తంగా పరిపాలన?

జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయాక.. అంటే 2018 నుంచే పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. గవర్నర్‌ పాలనలో కొనసాగిన రాష్ట్రం.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత.. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌గా విడిపోయి, అక్టోబరులో కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక, పరిపాలన లెఫ్టెనెంట్‌ గవర్నర్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడంతో.. ప్రజల కష్టాలను పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. లెఫ్టెనెంట్‌ గవర్నర్‌కు కేబినెట్‌ హోదాతో సలహాదారులుగా నియమితులైన నలుగురు విశ్రాంత బ్యూరోక్రాట్ల చేతుల్లోకి ప్రభుత్వ శాఖలు వెళ్లిపోయాయి.


ప్రజల్లో తెలియని భయం

అధికార మార్పిడి కారణంగా జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో తెలియని భయం నెలకొంది. ప్రధానంగా పరిపాలనలో స్థానిక అధికారుల పాత్ర తగ్గిపోయింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం తమ ఆర్థిక, రాజకీయ హక్కులను హరించేస్తోందనే భావన వారిలో నెలకొంది. ఇందుకు ఓ ఉదాహరణ ఈ ఏడాది ఏప్రిల్‌ 2న జమ్మూకశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వాధికారులతో జరిపిన ఓ సమీక్షకు సంబంధించిన వీడియోనే. ఆ సమావేశంలో 19 మంది బ్యూరోక్రాట్లు పాల్గొనగా.. వారిలో జమ్మూకు చెందిన ఫారూఖీ అహ్మద్‌ లోన్‌ మినహా.. మిగతా వారంతా స్థానికేతరులు కావడమే. కశ్మీర్‌ డివిజన్‌కు చెందిన అధికారులే లేకపోవడం. 97ు ముస్లిం జనాభా ఉండగా.. ఆ సమీక్షలో పాల్గొన్న ఫారూఖీ ఒక్కడే ముస్లిం కావడం కూడా కేంద్రం తమను ఏదో చేస్తోందనే అపోహలను కశ్మీరీల్లో మరింత పెంచుతోంది. గతంలో యూపీఎస్సీ ద్వారా ఎంపికైన 50ు మంది బ్యూరోక్రాట్లు ఉండేవారు. మిగతా 50ు.. రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు ప్రమోట్‌ అయిన వారితో భర్తీ చేసేవారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత దీన్ని.. 67ు స్థానికేతరులు, 33ు స్థానికులుగా మార్చారు. పోలీసుశాఖ కూడా స్థానికేతరులతో నిండిపోయింది.


దిగజారిన ఆర్థిక పరిస్థితి..

2019 ఆగస్టు-డిసెంబరు మధ్యకాలంలోనే జమ్మూకశ్మీర్‌ రూ. 18వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. పూలు, యాపిల్‌ వంటి పంటలతోపాటు.. చేనేత, హస్తకళలకు కశ్మీర్‌ ప్రసిద్ధి. 2018-19లో చేనేత రంగంలో రూ. 215 కోట్లు, హస్తకళల్లో రూ. 985 కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఫలితంగా 5లక్షల మంది ఉపాధి కోల్పోయారు.


‘‘జమ్మూకశ్మీర్‌కు మంచిరోజులు వచ్చాయి. కశ్మీరు లోయలో పర్యాటకం అభివృద్ధి కానుంది. పరిశ్రమలు వస్తాయి. వేర్పాటు వాదం.. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతకు ఉపాధి లభిస్తుంది. ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌.. ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా అభివృద్ధి చెందుతుంది’’ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని గత ఏడాది ఆగస్టు 5న నిర్వీర్యం చేశాక పలు సందర్భాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలివి..! అమెరికాలో ‘హౌడీ మోదీ’ సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.


కేంద్రం చేసిన అభివృద్ధి ఎంత?

జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాక.. కేంద్రం రూ.58,627 కోట్లతో 54 ప్యాకేజీలను ప్రకటించింది. లద్దాఖ్‌ అభివృద్ధికి 9 ప్రాజెక్టులకు గాను రూ. 21,441 కోట్లతో ప్యాకేజీని అందజేసింది. చాలా పనులు ఇంకా మొదలవ్వాల్సి ఉంది. అయితే.. ఉమ్మడి జమ్మూకశ్మీర్‌కు మోదీ సర్కారు 2015 నవంబరులో ప్రకటించిన రూ.80,068 కోట్ల నిధులతో పోలిస్తే.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిపిన కేటాయింపులు తక్కువే.


పారామిలటరీ దళాలకు స్థిర నివాసాలు

గత ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేయడంతోపాటు.. ఆర్టికల్‌ 35ఏను రద్దు చేసింది. కశ్మీరీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే ఈ అధికరణ.. భూముల కొనుగోళ్లలో ఇతర ప్రాంతాల వారిని అనర్హులను చేస్తుంది. తాజాగా.. స్థానికేతరులకు డొమెసిల్‌ చట్టం ద్వారా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుండటం కూడా జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా.. సుదీర్ఘకాలం జమ్మూకశ్మీర్‌లో పనిచేసిన సైనికులు, పారామిలటరీ దళాల జవాన్లకు కేంద్ర ప్రభుత్వం డొమెసిల్‌ సర్టిఫికెట్లను అందజేస్తోంది. దీనిపై కశ్మీరీ నాయకులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఆరుగురి చేతిలోనే పరిపాలన

జీసీ ముర్మూ: ఈయన జమ్మూకశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ). 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

కేవల్‌ కుమార్‌ శర్మ: ఈయన కూడా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. జమ్మూలోని కఠువాకు చెందినవారు. ఢిల్లీ, గోవాల్లో చీఫ్‌ సెక్రటరీగా, చండీగఢ్‌లో ప్రభుత్వ సలహాదారుగా, కేంద్ర మానవ వనరుల కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ ఎల్జీకి సలహాదారుగా ఉంటూ.. కేబినెట్‌ హోదాలో రెవెన్యూ, ప్రణాళిక, పరిశ్రమలు, విద్య, ఉద్యాన శాఖలను చూస్తున్నారు.

ఫారూఖ్‌ ఖాన్‌: ఈయన మాజీ ఐపీఎస్‌ అధికారి. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఎల్జీ సలహాదారుగా పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌: ఈయన ఎల్జీకి మూడో సలహాదారు. యూపీకి చెందిన మాజీ ఐపీఎస్‌. సీఆర్పీఎఫ్‌ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ వైద్య ఆరోగ్యం, వైద్య విద్య, ప్రజా పనులు, నీటిపారుదల, రవాణా, పశుసంవర్థక శాఖలను చూస్తున్నారు.

బషీర్‌ అహ్మద్‌ ఖాన్‌: ఈయన కూడా విశ్రాంత ఐఏఎస్‌. ఈ ఏడాది మార్చిలో ఎల్జీకి నాలుగో సలహాదారుగా నియమితులయ్యారు. విద్యుత్తు, పట్టణాభివృద్ధి, పంచాయతి రాజ్‌, విపత్తుల నిర్వహణ, సాంస్కృతిక, పర్యాటక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

బీవీఆర్‌ సుబ్రమణ్యం: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈయన జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-08-05T07:38:32+05:30 IST