జమ్మూకశ్మీర్‌లో కొత్త చట్టాల చిచ్చు

ABN , First Publish Date - 2020-12-04T05:48:37+05:30 IST

జమ్మూకశ్మీర్ పచ్చని అడవుల్ని, సారవంతమైన భూముల్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త రిసార్టులకు, పరిశ్రమలకు అనుమతులు క్షణాల మీద దొరుకుతున్నాయి. వేలాది హెక్టార్ల...

జమ్మూకశ్మీర్‌లో కొత్త చట్టాల చిచ్చు

జమ్మూకశ్మీర్ పచ్చని అడవుల్ని, సారవంతమైన భూముల్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త రిసార్టులకు, పరిశ్రమలకు అనుమతులు క్షణాల మీద దొరుకుతున్నాయి. వేలాది హెక్టార్ల అటవీభూమిని అప్పనంగా వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. లక్షలాది చెట్లను కూల్చివేస్తున్నారు. ఈ ‘ఆధునిక చట్టాలు’ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి రైతులను కూడా ఆత్మహత్యలకు ప్రేరేపించవచ్చు. ఇప్పటివరకూ జమ్మూకశ్మీర్‌లో రైతుల ఆత్మహత్యలు లేవు.


జమ్మూకశ్మీర్ భూములు ఆ ప్రాంతయేతరులకు చెందకుండా రెండు చట్టాలు రక్షణ కల్పించేవి. ఒకటి-, 1950లో చేసిన భారీ భూ ఎస్టేటుల రద్దు చట్టం. ఈ చట్టం నయా కశ్మీర్ పత్రానికి అనుబంధంగా షేక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ ప్రధానమంత్రి కాగానే ప్రవేశపెట్టినది. రెండోది, షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వానికి పూర్తి లొంగుబాటు ప్రకటించిన తరువాత 1976లో వచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టం. ఈ రెండిటికీ మధ్య వైరుధ్యం ఏమీ లేదు. ఈ రెండు చట్టాలు భూపరిమితిని నిర్దేశిస్తాయి కాబట్టి కలిపే అమలు చేసేవారు. వీటి వల్ల స్థానిక ప్రజలు మళ్లీ భూమి లేని కౌలుదారులుగా మారకుండా రక్షణ ఉండేది. దీర్ఘకాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాలకు చారిత్రక సందర్భం ఉంది. గుజరాత్‌తో పోల్చుకుంటే అభివృద్ధి సూచికలు జమ్మూకశ్మీర్‌లో హెచ్చుస్థాయిలో ఉండటానికి ఈ చట్టాలే కారణం. కర్ఫ్యూలు, క్రాక్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు ఎన్ని జరిగినా కశ్మీర్‌లో పేదరికం లేకుండా ఉండటానికి ఈ చట్టాలే కారణం. ఇప్పుడు ఈ భూపరిమితిని ఎత్తివేయటానికి రంగం సిద్ధమయింది. 


షేక్ అబ్దుల్లా 22 ఎకరాలకు భూ పరిమితిని విధించటం వల్ల జమ్మూలో ఉన్న జమిందార్లు ఆనాడు నేషనల్ కాన్ఫరెన్స్‌కు శత్రువులు అయ్యారు. ఈ భారీ భూ ఎస్టేటుల రద్దు చట్టం వల్లనే 1951లో ఆయన జమ్మూలోని డోగ్రా కశ్మీరీ జమిందారులకు కంటిలో నలకగా మారి, నెహ్రూ ద్వారా పదవీచ్యుతుడై జైలుకు వెళ్లారు. ఆయన నిర్బంధం జమ్మూ హిందువులకు, కశ్మీర్‌లోయ ముస్లింలకు మధ్య పెద్ద అఘాతం ఏర్పడేందుకు కారణమయింది.


70 సంవత్సరాలు గడిచి, 370 ఆర్టికల్ రద్దు అయిన తరువాత భారత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త భూయాజమాన్య చట్టాల వల్ల, ఆ పాత వైరి పక్షాలు ఒకటి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటిదాకా కశ్మీర్ లోయలో ఉన్న ముస్లింలను భారత జాతీయతకు శత్రువులు లాగా, జమ్మూ హిందువులను దేశభక్తులు లాగా చూపించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడే పరిస్థితులు వచ్చాయి. ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోయలో ఎంత అసంతృప్తి ఉందో, జమ్మూలో కూడా అంతే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త భూచట్టాలే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


ఈ కొత్త చట్టాల ప్రకారం -భూమి యాజమాన్య హక్కు, అమ్మే హక్కు, కొనే హక్కు కేవలం జమ్మూకశ్మీర్ నివాసులకూ, రాష్ట్ర పౌరులకు మాత్రమే ఉండే షరతులు తొలగిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ బయట ఉండేవారికి అక్కడ భూమిని కొనుక్కునే అవకాశం లభిస్తుంది. అభివృద్ధి చట్టాల్లో కూడా అనేక మార్పులు చేశారు. భూమిని సేకరించటానికి వీలుగా కొత్త పరిశ్రమల అభివృద్ధి సంస్థలకు అపరిమిత అధికారాలు కల్పించారు. బాధితులు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేదు. వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములుగా మార్చటానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఉంటే చాలు.


‘జమ్మూకశ్మీర్ భూభాగంలో వ్యవసాయం చేసే ఎవరైనా...’ అంటూ ఈ చట్టాలు వ్యవసాయదారుడికి కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. అంటే ఈ వ్యవసాయదారుడు జమ్మూకశ్మీర్లో కనీసం నివాసుడు (డొమిసైల్) కూడా కానవసరం లేదు. వ్యవసాయ పనులకు కూడా ఈ చట్టాలు కొత్త అర్థాలు చెప్పాయి. వాటి ప్రకారం వ్యవసాయ సంభందమైన పనులు చేసేవారందరూ వ్యవసాయదారులే. ఆహార, ఆహారేతర పంటలు; పశువుల గడ్డి, పండ్లు, కూరగాయలు, పూలు, ఇంకా రకరకాల మొక్కల పంటలు పండించడం; పశు పెంపకం, పాడి తీయటం; కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, వ్యవసాయ అడవుల పెంపకం, వ్యవసాయ శుద్ధి... ఇత్యాది పనులు చేసేవారందరూ ఈ చట్టాల ప్రకారం వ్వవసాయదారులే. ఇవన్నీ రకరకాల పరిశ్రమలను రంగం మీదకు తీసుకువస్తాయి. 


జమ్మూకశ్మీర్ జనాభాలో గుజ్జార్లు, బక్వర్వాలాలు 11.9 శాతం, అంటే 15లక్షల మంది ఉన్నారు. కశ్మీరీలు, డోగ్రాల తరువాత వీళ్ల జనాభా ఎక్కువ. వీళ్లు పశువుల కాపరులు. సంచారజాతుల వాళ్లు. వేసవికాలంలో కశ్మీర్‌లోయలో, చలికాలంలో జమ్మూ ప్రాంతంలో జీవిస్తారు. గుజ్జార్లు పశువులను మేపుకుంటే, బకార్వాలాలు గొర్రెలనూ, మేకలను మేపుకుంటారు. బకార్వాలాలు ఎక్కువగా ముస్లింలు. వారి జీవన విధానం, భాష, ఆహార్యం–-మైదాన ప్రాంతాల్లో నివసించే ముస్లింల కంటే భిన్నంగా ఉంటుంది.


పదిలక్షల మంది దాకా గుజ్జార్లు పర్వతాల్లో ఎక్కువకాలం నివసిస్తారు. అడవుల్లో తాత్కాలికంగా ధోక్‌లు అనే మట్టిఇళ్లను నిర్మించుకుని ఉంటారు. కొద్దిరోజులుగా గుజ్జార్లనూ, బకర్వాలాలను వారి నివాసస్థలాల నుంచి తరిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివాసీ కార్యకర్త జాహిద్ చౌదరి సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేసిన వీడియోలలో దుంగలతో, మట్టితో నిర్మించుకున్న వారి తాత్కాలిక ధోక్‌లను అటవీ అధికారులు ధ్వంసం చేసిన దృశ్యాలు కనిపించాయి. గిరిజనులు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనపరుచుకుంటున్నామనీ, ఇప్పటి దాకా పహల్గాంలో 700 కనాళ్ల భూమి స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు. 


ఈ గిరిజన ప్రజలు ఏ రకంగానూ అడవులకు, వాటి పర్యావరణానికి హానికారులు కాదు. నిజానికి వారి సంప్రదాయ జీవన విధానం, సంస్కృతులు పర్యావరణంతో సహవాసం చేస్తాయి. కశ్మీరీలకు అధికార మార్పిడి ముందు కూడా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు ఏవీ వారికి వర్తించలేదు. అయితే గుజ్జార్, బకర్వాల్ ప్రజలకు డోగ్రా పాలనలో 1882 నాటి అటవీచట్టం ప్రకారం అడవుల్లో పశువులను మేపుకొనే హక్కులు ఉండేవి. జమ్మూ కశ్మీర్ చట్టసభలు వీళ్ల కోసం ఎలాంటి చట్టాలు చేయకపోయినా, అడవులలో వీళ్ల హక్కులు అలాగే కొనసాగుతూ వచ్చాయి. షేక్ అబ్దుల్లా కాలంలో అమలు పరచిన భూసంస్కరణల వల్ల వీరికి కొంత భూమి కూడా లభించింది. 370 అధికరణను, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసిన తరువాత కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం వీరికి ఇంకాస్త రక్షణ లభించడానికి బదులు, అభివృద్ధి అంటూ గుజ్జార్లు, బకార్వాలాల కాళ్ల కింద భూములను లాగేసుకుంటున్నారు.


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దయి ఇప్పటికీ 15 నెలలు గడుస్తున్నా భారతదేశ చట్టాలు ఇంకా జమ్మూ, కశ్మీర్ లోయ, లద్దాఖ్‌లలో అడుగు పెట్టలేదు. అయితే కచ్చితంగా ఈ చట్టాలు అమలు కావాలి. అందుకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోకుండా నోరులేని సంచార జీవులను వెళ్లగొడుతున్నారు. ఇలా తరిమేస్తే, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే భారతీయ చట్టం కింద రక్షణ లభించాలి కానీ, అది కూడా ఇంకా జమ్మూకశ్మీర్ గుమ్మంలోకి అడుగుపెట్టలేదు. 


ఇంత హడావుడిగా ఇదంతా చేయటానికి కారణం, జమ్మూకశ్మీర్ పచ్చని అడవుల్ని, సారవంతమైన భూముల్ని గుజరాత్ బాబులకు ధారాదత్తం చేయడానికే. కొత్త కొత్త రిసార్టులకు, పరిశ్రమలకు అనుమతులు క్షణాల మీద దొరుకుతున్నాయి. వేలాది హెక్టార్ల అడవి భూమిని అప్పనంగా వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. లక్షలాది చెట్లను కూల్చివేస్తున్నారు. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తున్నాయి. ఎంతో విద్యుత్‌ను ఇక్కడి నదుల నుంచి తయారుచేస్తున్నా ఆ విద్యుత్ పక్కరాష్ట్రాలకు పోతోంది. స్థానికులకు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండడం లేదు.


ఈ ‘ఆధునిక చట్టాలు’ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి రైతులను కూడా ఆత్మహత్యలకు ప్రేరేపించవచ్చు. ఇప్పటివరకూ జమ్మూకశ్మీర్‌లో రైతుల ఆత్మహత్యలు లేవు. 2006లో సింగూరులో జరిగిన కథ ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు అన్నీ కోరలు పోయి, మొద్దుబారి ఉన్నాయి. గుప్తకార్ ఐక్యతకు కశ్మీరీలలో విశ్వసనీయత లేదు. తమకు ముంచుకునివస్తున్న ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం అన్వేషించుకుంటున్న రాజకీయ పరిష్కారానికి, దేశం మొత్తం నుంచి కశ్మీరీలు మద్దతు కోరుకుంటున్నారు.


-రమాసుందరి

Updated Date - 2020-12-04T05:48:37+05:30 IST