Abn logo
Oct 24 2021 @ 23:56PM

బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాతగా జానమద్ది కృషి అనితర సాధ్యం

మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి వెంకటరమణ, చిత్రంలో పురస్కార గ్రహీతలు

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరమణ

కడప (మారుతీనగర్‌), అక్టోబరు 24 : బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాణంలో అనేక ఒడిదుడుకులను అధిగమించి, ఉదార హృదయులెందరినో భాగస్వాములను చేసి తద్వారా బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాతగా డాక్టర్‌ జానమద్ది హనుమచ్చాసి్త్ర చేసిన కృషి అనితర సాధ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మఠం వెంకటరమణ తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం దశదిశలా ఖ్యాతి చెందడానికి కారకులైన హనుమచ్చాసి్త్ర జీవితం భావితరాలకు మార్గదర్శమన్నారు. డాక్టర్‌ జానమద్ది హనుమచ్చాసి్త్ర 97వ జయంతిని పురస్కరించుకొని జానమద్ది సాహితిపీఠం మేనేజింగ్‌ ట్రసీ్ట్ర జానమద్ది విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో ఆదివారం సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో 2019, 2020, 2021 సంవత్సరాలకు గాను జానమద్ది స్మారక సాహితీ, గ్రంథ సేవా పురస్కారాల సభ నిర్వహించారు. 2019 సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, 2020 సంవత్సరానికి సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌, గ్రంథసేవ విభాగంలో మనసు ఫౌండేషన్‌ అధ్యక్షులు మన్నం వెంకటరాయుడు, 2021 సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో ప్రసిద్ధ అవధాని నరాల రామారెడ్డి, అలాగే గ్రంథసేవ విభాగంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత గ్రంథపాలకులు వళ్ళువర్‌ షణ్ముగంలకు జానమద్ది పురస్కారాలను అందచేశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ మాట్లాడుతూ సాహిత్యం ద్వారా సంస్కారం అలవడుతుందన్నారు. ఇప్పటివారితో పాటు భావితరాలకు కూడా జానమద్ది లాంటి సాహితీమూర్తుల జీవితాలను అందించాల్సిన అవసరముందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ సాహితీ ఉపాసకుడు జానమద్ది అన్నారు. ఆయన చివరి శ్వాస వరకూ సాహిత్యమే జీవితంగా బతికారన్నారు. సీపీ బ్రౌన్‌ నివసించిన చోటునే గ్రంథాలయంగా తీర్చిదిద్దిన కృషీవలుడన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుతం సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం పరిశోధన కేంద్రంగా ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడడానికి జానమద్ది సాగించిన అవిరళ కృషి కారణమన్నారు. జానమద్దిని, సీపీ బ్రౌన్‌ను వేర్వేరుగా చూడలేమన్నారు. అవధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ చెక్కుచెదరని మనోబల స్వేదంతో సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం రాష్ట్రంలో ఇవాల నాధఽమై ప్రతిధ్వనిస్తోందన్నారు. తండ్రిపై ఉన్న గౌరవంతో జానమద్ది విజయభాస్కర్‌ ప్రతి ఏటా ఇటు సాహిత్యంలో, అటు గ్రంథసేవలో కృషి చేసిన వారికి పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు.  ట్రస్టీ కార్యదర్శి యామిని మాట్లాడుతూ జానమద్ది సాహితీపీఠం 2012లో స్థాపించి నేటి వరకూ సాహిత్యరంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారికి స్మారక సాహితీ పురస్కారాలు అందిస్తున్నామని నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో కళాసాహితీ అభిమానులు మూలే రామమునిరెడ్డి, వెంకటేశ్వరాచారి, మొగలిచెండు సురేష్‌, ఎస్‌.గోవర్థన్‌రెడ్డి, మాచిరాజు రమణయ్య, ఎం.మధుసూదన్‌, మచ్చా నరసింహాచార్యులు, గోపాలకృష్ణశాసి్త్ర, డాక్టర్‌ శివారెడ్డి, కాశీభట్ల సాయినాథ్‌ శర్మ, తవ్వా వెంకటయ్య తదితరులతో పాటు పలువురు సాహితీప్రియులు, జానమద్ది అభిమానులు, పాల్గొన్నారు. 


పురస్కార గ్రహీతల స్పందన వారి మాటల్లో ...

రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి : జానమద్దితో మొట్టమొదటి పరిచయం పుట్టపర్తి నారాయణాచార్యులకు శ్రీకృష్ణదేవరాయ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చిన సందర్భంలో ఏర్పడిందన్నారు.

వేంపల్లి గంగాధర్‌ : కొత్తగా తాను రచనలు చేస్తున్న దశలో కడప జిల్లా రచయితల సంఘంలో సభ్యత్వం కోసం వెళ్ళి జానమద్దిని కలిశానని, అది మొదలు ఆయన రచనా విషయంలో తనను చాలా ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. 

మన్నం వెంకటరాయుడు : ఈ పురస్కారం గ్రంథసేవలో తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. 

వళ్ళువర్‌ షణ్ముగం : జానమద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

నరాల రామారెడ్డి : తేటగీతి పద్యంతో జానమద్ది వ్యక్తిత్వాన్ని కొనియాడారు.