జానారెడ్డి నిశ్శబ్ద యుద్ధం!

ABN , First Publish Date - 2021-04-11T07:46:00+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి నిశ్శబ్ద యుద్ధానికి తెర తీశారు.

జానారెడ్డి నిశ్శబ్ద యుద్ధం!

  • ఉప ఎన్నికలో గతానికి భిన్నంగా పోరు
  • పగలు గ్రామాల్లో ప్రచారం.. రాత్రి ఫోన్లలో
  • గ్రామ స్థాయి నేతలతో నేరుగా మంతనాలు
  • ప్రధాన పార్టీల్లో మొదలైన కోవర్టు ఆపరేషన్లు
  • అన్ని ప్రధాన పార్టీలదీ ‘సామాజికవర్గ’ అస్త్రమే
  • నాగార్జునసాగర్‌లో వేడెక్కిన రాజకీయం

నల్లగొండ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి నిశ్శబ్ద యుద్ధానికి తెర తీశారు. గతానికి భిన్నంగా పోరు సాగిస్తున్నారు. అధికారం లేకపోవడం, బలమైన కేడర్‌ చేజారిపోవడంతో.. వయసు పైబడినా పగలంతా గ్రామాల్లో తిరుగుతూ, రాత్రివేళలో ఆయా గ్రామాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ప్రతి గ్రామానికి 30 మందికి తక్కువ కాకుండా కీలక నాయకులతో ఫోన్‌లో మంత్రాంగం నడిపిస్తున్నారు. తనను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను చెబుతూ.. ఆ గ్రామాలు, పెద్దలతో తనకున్న అనుబంధం, ఆయా గ్రామాల్లో అభివృద్ధి, సామాజిక వర్గాల వారీగా నేతలకు చేసి పెట్టిన వ్యక్తిగత అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. అధికార పార్టీలో ముఠా పోరు ఎక్కువై, అక్కడ ఏమాత్రం గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్న వారికి గాలం వేస్తున్నారు. తమ సామాజికవర్గానికి సహకరించాలని కొందరు కోరుతుండడంతో వారిని భారీ ప్యాకేజీలతో తనవైపు తిప్పుకొంటున్నారు. ఈ క్రమంలో కొంద రు కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటుండగా.. మరికొందరితో ‘ఎక్కడ ఉన్నా.. ఎన్నికల వేళ తనకు ఉపయోగపడతానన్న’ హామీలు జానారెడ్డి తీసుకుంటున్నారు. ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి గ్రామాల వారీగా తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటూ నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఇతర జిల్లాల నుంచి పార్టీ దిగ్గజాలు వచ్చినా.. వారు స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొని వెళ్లిపోవడమే తప్ప ఎన్నికల వ్యూహంలో వారిని భాగస్వాములను చేయడంలేదు. 


సామాజిక కోణంలో కోవర్టు ఆపరేషన్లు..

ప్రచారం చివరి అంకానికి చేరుకోవడం, ప్రధానంగా రెండు పార్టీల మధ్య భీకర యుద్ధం సాగుతుండటంతో ఇరు పార్టీలు కోవర్టు ఆపరేషన్లకు తెరతీశాయి. ‘సామాజికవర్గం’ సెంటిమెంట్‌ను బలంగా వాడుతున్నారు. మరో సామాజికవర్గం పనితీరుపై ఆది నుంచి అనుమానంతో ఉన్న ఓ పార్టీ అధిష్ఠానం వారి కదలికలపై నిఘా వేసింది. మరోవైపు ‘ఎదుటి పార్టీలోనే ఉండు.. మేం చెప్పిన పని చేసి పెడితే చాలు. మన సామాజికవర్గం పిల్లవాణ్ని గెలిపించుకోవాలి’ అంటూ మరో సామాజికవర్గంతో ఆపరేషన్‌ మొదలుపెట్టింది. తాము బస చేసిన ప్రాంతాల్లోకి ఎదుటి పార్టీ వారిని రప్పించి భారీ ప్యాకేజీలు ముట్టజెప్పినట్టు సమాచారం. అయితే ‘మీరు తరచూ ఫోన్‌లు చేసి విసిగించకండి, మమ్ములను ఇబ్బంది పెట్టకండి, మీరు అనుకున్నట్టు పని చేసి పెడతాం’ అంటూ వారు భరోసా ఇచ్చి వెళుతున్నారు. ఇదిలా ఉంటే గిరిజన తండాల్లో భారీగా ప్యాకేజీలు ప్రకటించి తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ వారి ఆరాధ్య దైవం సేవాలాల్‌పై ప్రమాణాలు చేయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా వీడియో రూపంలో బయటకు రావడం, ఎదుట పార్టీ నేతల ధర్నాలతో పోలీసు కేసులు నమోదవడం జరుగుతున్నాయి. ‘అధికార పార్టీ పెద్దలను ఏమీ అనలేం, ప్రతిపక్షాలను అంటే అధికార పక్షాలను చూపి ఆందోళనకు దిగుతున్నారు అందుకే చూసీ చూడనట్టు వ్యహరిస్తున్నాం’ అని కింది స్థాయి పోలీసు అఽధికారులు అంటున్నారు. ఇక ఉప ఎన్నిక ప్రచారం మరో నాలుగు రోజులే మిగిలి ఉండటం, 14న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో ఎండలతోపాటే ప్రచారం పతాక స్థాయికి చేరింది. 

Updated Date - 2021-04-11T07:46:00+05:30 IST