అగనంపూడి బాలిక మృతిపై వాస్తవాలు వెలికి తీయాలి: నాదెండ్ల

ABN , First Publish Date - 2021-10-08T17:15:12+05:30 IST

అగనంపూడి బాలిక మృతిపై వాస్తవాలు వెలికి తీయాలని...తల్లిదండ్రుల సందేహాలను నివృతి చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

అగనంపూడి బాలిక మృతిపై వాస్తవాలు వెలికి తీయాలి: నాదెండ్ల

అమరావతి: అగనంపూడి బాలిక మృతిపై వాస్తవాలు వెలికి తీయాలని...తల్లిదండ్రుల సందేహాలను నివృతి చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా అగనంపూడిలో మైనర్ బాలికపై అత్యాచారం, మృతి ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ దుర్ఘటనపై పోలీసు శాఖ చేసిన ప్రకటన మృతి చెందిన బాలిక కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేస్తోందని తెలిపారు. ఆ ప్రకటనలో పోలీసుల బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని మండిపడ్డారు.  బాలికపై నింద మోపే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. వాస్తవాలను వెలికి తీయడంతో పాటు సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని...  కేసు నమోదు చేశామని సరిపెట్టవద్దని... ఆ బాలిక శరీరంపై ఉన్న గాయాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది ఒడ్డున జరిగిన అత్యాచార సంఘటనకు కారకులైన నిందితుల్లో మరొకరిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారన్నారు. అలాగే మేడికొండూరు దగ్గర చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ కేసులో దోషుల ఆచూకీ కనిపెట్టలేదని తెలిపారు. ఇలాగైతే మహిళలకు, బాలికలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. దిశ చట్టాలు, యాప్ లు తెచ్చి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఆగనంపూడి దురదృష్టకర ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందని చెప్పారు. వారి న్యాయపోరాటంలో పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-08T17:15:12+05:30 IST