కోడిపందేలు, జూదశాలలకు పోలీసుల అండ

ABN , First Publish Date - 2022-01-19T06:01:22+05:30 IST

సంక్రాంతి సంప్రదాయ ముసుగులో నిర్వహించిన జూదశాలలు, కోడిపందేలకు ఆటంకాలు కలగకుండా పోలీసులే అండగా నిలిచారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు.

కోడిపందేలు, జూదశాలలకు పోలీసుల అండ
సమావేశంలో మాట్లాడుతున్న గాదె వెంకటేశ్వరరావు

గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్న జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంప్రదాయ ముసుగులో నిర్వహించిన జూదశాలలు, కోడిపందేలకు ఆటంకాలు కలగకుండా పోలీసులే అండగా నిలిచారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం స్థానిక లాడ్జి సెంటర్‌లోని జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, కొండలు, గుట్టలు విచ్చలవిడిగా దోచుకున్నది చాలక జూదం, కోడిపందేలతో వైసీపీ నాయకులు ప్రజల జేబులు కొల్లగొడుతున్నారన్నారు. సామాన్యులు కాలక్షేపం కోసం  ఆడితే అరెస్టు చేసే పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో జరిగిన కోత ముక్క, గుండాటలను చూసి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తన కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని తీసుకొచ్చిన బూతుల మంత్రి కొడాలి నానిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు. కొనే నాథుడే లేక చేబ్రోలు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో ధాన్యం కుళ్లిపోతున్నా, పల్నాడులో మిర్చి పంట దెబ్బతిన్నా పట్టించుకునే వారే లేరన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారం అవుతుందన్నారు. ఏ అంశం వచ్చినా దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఏదో ఒకటి తెస్తోన్నారని, ఆ కోవలోకే ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సు పెంపు, తాజాగా చింతామణి నాటకం రద్దు అని చెప్పారు. సమావేశంలో నాయకులు శిఖా బాలు, కిరణ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T06:01:22+05:30 IST