Abn logo
Sep 23 2021 @ 11:27AM

కమలానికి కటిఫ్..? అదే జరిగితే.. ఆ క్రెడిట్ అంతా పవన్‎కే..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మరింత ఊపు రానుందా? ఇప్పటికే ఈ ఉద్యమం కోసం చిత్తశుద్దితో పోరాడుతున్న పార్టీల సరసన నిలవనున్న ఆ పార్టీ ఏది? ఇంత కాలం తర్వాత విశాఖ ఉక్కు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడంలో ఉద్దేశమేంటి? ఆ పార్టీ ఉద్యమంలో చేరితే, ఉక్కు ప్రైవేటీకరణ అగుతుందా..? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


వచ్చే నెలలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా మొదట నుంచి టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఈ పార్టీలు చిత్తశుద్దితో చేసిన పోరాటానికి ఉక్కు కార్మిక సంఘాలు, నిర్వాసితులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ఈ పార్టీల సరసన జనసేన చేరనుంది. వచ్చే నెలలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించి.. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలకనున్నారు. దీంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు రానుంది. గత ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజక వర్గం పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉంది. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినప్పటి నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ.. రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. వివిధ స్థాయిలో పోరాటం చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్యమంలోకి వస్తే తమకు కొండంత అండ దొరుకుతుందని కార్మికులు, నిర్వాసితులు అంటున్నారు. 


బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు పోరాటానికి స్థానిక జనసేన నేతలు మద్దతు ఇచ్చారు. ప్రవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ పలు అఖిలపక్ష సమావేశాలలో కూడా జనసేన నేతలు పాల్గొన్నారు. అయితే బిజేపికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇదే ఆంశంపై ఢీల్లీ వెళ్లి అమిత్ షా తో సహా పలువురు నేతలను కలిశారు. కానీ వారు ఏం చెప్పారనే విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు. పైగా కిందిస్థాయి నేతలే ఎప్పుడు తమ మద్దతు ప్రకటిస్తున్నారు తప్ప, పవన్ నేరుగా వచ్చిన సందర్బాలు లేవు. 

వైసీపీ వైఖరిపై మండిపడుతున్న ప్రతిక్షాలు

స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జీవీఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలా.. ఎన్నికలు మగిసిన తర్వాత ఇంకొలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసిపి లోపాయికారిగా సహాయసహకారాలు అందిస్తుందని.. కొంతమంది కార్మికనేతలు, నిర్వాసుతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల్లో అనుమానం రాకుండా ఉండేందుకు వైసిపి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అవుతుందంటే అందుకు కారణం బిజేపియే అని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, విభజన హామీలు అమలు చేయకుండా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఏపి బీజేపీ నేతలపై గుర్రుగా ఉన్నారు. అంతే కాదు, తరచు రాష్ట్ర బీజేపీ నేతలు.. ప్రవేటీకరణ చేయడం మంచిదేనని బహిరంగా చెప్పడాన్ని కార్మికులు, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీజేపీతో జనసేన పొత్తు కారణంగా ఆ పార్టీ ఉక్కు పోరాటంలోకి పూర్తిస్థాయిలో రాలేదని కొంత అపవాదు జనసేనపై కూడా ఉంది. 

కేంద్ర పెద్దలతో పవన్ మాట్లాడారు : నాదెండ్ల

జనసేన నేతలు మాత్రం, తమ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నారు. అంతే కాదు ప్రవేటీకరణ చేయవద్దని.. అమిత్ షాతో సహా ఢిల్లీ పెద్దలకు పవన్ కళ్యాణ్ చెప్పారని.. ఇటీవల విశాఖ వచ్చిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంతేకాదు మిగిలిన నాయకుల్లా కేసుల భయపడో, రాజీలు కోసమో బీజేపీతో కలవలేదని అన్నారు. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి.. ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ఇస్తారని చెప్పారు. కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారిని ఒప్పిస్తారని నాదెండ్ల చెప్పడంతో.. ఉక్కు కార్మికులకు, నిర్వాసితులకు ఎక్కడా లేని బలం వచ్చింది. నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ఇటు ఆ పార్టీ క్యాడర్ లోనూ కొత్త జోష్ ని నింపాయి. 

బీజేపీ, జనసేన మధ్య కటిఫ్ అంటూ ప్రచారం..

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరానికి వచ్చి కార్మికుల పోరాటానికి మద్దతు పలికారు. సీఎం జగన్ కూడా స్టీల్ కార్మికులతో ఎయిర్ పోర్టులో సమావేశమయ్యారు. కానీ పవన్ నేరుగా వచ్చిన సందర్బాలు లేవు. ఇప్పుడు పవన్ రాక వెనుక అంతర్యం ఏమిటనేది తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. బీజేీపీ, జనసేన మధ్య కటిఫ్ అంటూ ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలు ఎన్నికలకు కలిసివెళ్లినా.. జనసేనే, బీజేపీకి  బలం తప్ప.. బీజేపీ వల్ల రాష్ట్రంలో తమకు ప్రయోజనం లేదనే విషయాన్ని జనసేన గ్రహించిందట. అందుకే గత కొద్దికాలంగా, రెండు పార్టీలు కలిసి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించ లేదట. ఒకవేళ బీజేపీ మొండిగా ప్రైవేటీకరణ అంశంపై వెళ్లితే.. దీనినే ఒక సాకుగా చూపించి, బీజేపీ పొత్తు నుంచి బయటకు రావాలనే ఆలోచనలో జనసేన ఉందట. 

అదే జరిగితే..క్రెడిట్ అంతా పవన్‎కే

ఇప్పటికే పవన్, అమిత్ షాతో పాటు పలువురు డిల్లీ పెద్దల వద్దకు వెళ్లి ప్రైవేటీకరణ వద్దని చెప్పారు. అక్కడ నుంచి సానుకూల ప్రకటన వస్తుందని జనసేన నేతలు అంటున్నారు. ఒకవేళ నిజంగా ప్రవేటీకరణ అగితే మాత్రం, ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు దక్కుతుంది.  జనసేనకు మైలేజ్ వస్తుంది. ఈ అంశాన్ని జనసేన, బీజేపీ కలిసి క్యాష్ చేసుకుని.. పవన్ ని ప్రమోట్ చేయాలన్న ఆలోచన బీజేపీకి ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయంగా ఏ పార్టీ వ్యూహాలు అ పార్టీలకు ఉన్నాయి. పవన్ విశాఖ పర్యటన తర్వాత, స్టీల్ ప్లాంట్ ఉద్యమ స్వరూపం, ప్రవేటీకరణ అంశంపై ఒక స్పష్టత వచ్చేఅవకాశం ఉంది.