Abn logo
Jan 19 2021 @ 04:11AM

జహీరాబాద్‌లో జనవంచన

సంగారెడ్డి జిల్లా ఝూరసంగం, న్యాల్కల్‌ మండలాలలో 12,635 ఎకరాలలో తెలంగాణ పరిశ్రమల అవస్థాపన సంస్థ (టిఎస్‌ఐఐసి) ప్రతిపాదిస్తున్న జాతీయ ఉత్పత్తి, పెట్టుబడి క్షేత్రం (ఎన్‌ఐఎంజెడ్‌)కు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయసేకరణ ఈ నెల 20న జరగనుంది. ఇంతకుముందు 2020 జూలై 10న తలపెట్టిన ప్రజాభిప్రాయసేకరణను హైకోర్టు రద్దు చేసింది. 


ప్రతిపాదిత ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఆధారంగా ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుంది. దాని ఆధారంగానే పర్యావరణ అనుమతి ఇస్తారు. ఈ నివేదికలు రూపొందించడానికి పుట్టగొడుగుల్లా సలహాదారు సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రావీణ్యం లేకుండా ఇతర నివేదికల నుంచి కాపీలు కొట్టి, డబ్బులు ఇస్తున్న కంపెనీలకు అనుకూలంగా వీటిని రూపొందిస్తారు. ఈ తప్పుడు నివేదిక ఆధారంగానే నిపుణుల కమిటీలు అనుమతులు ఇస్తాయి. కొన్ని సందర్భాలలో ప్రజలు కోర్టులకు వెళ్లి అనుమతులు రద్దు చేయించారు. అలాంటి ఒక తీర్పు వల్ల పర్యావరణ మంత్రిత్వ శాఖ 2011 అక్టోబర్ 5న కాపీ కొట్టిన నివేదిక ఆధారంగా ఇచ్చిన అనుమతులను, నిజం బయటపడినపుడు ఏ దశలోనైనా రద్దు చేస్తామని అధికారికంగా ఉత్తరువు జారీ చేసింది. కానీ అమలుపరచడం లేదు. 


జహీరాబాద్‌ ‘నిమ్జ్‌’ పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను ఎల్‌ అండ్‌ టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ రూపొందించింది. ఆ నివేదికను పరిశీలించిన ‘ప్రజల కోసం శాస్త్రవేత్తల’ బృందం దానిలో పదం, పదం చొప్పున కాపీ కొట్టిన పేజీలకు పేజీలను గుర్తించి, ఏ భాగం ఎక్కడ నుంచి కాపీ కొట్టారో వివరాలతో ఒక నివేదికను రూపొందించింది. ఇది టిఎస్‌ఐఐసి, దాని సలహాదారూ; సమష్టిగా రియో ఒప్పందం, ఆర్హస్‌ సదస్సూ ప్రజలకు కల్పించిన హక్కులపై చేస్తున్న దాడిగా భావిస్తున్నాం. నివేదిక ప్రారంభంలో, అందులోని సమాచారం తమ స్వంతమని టిఎస్‌ఐఐసి చేసిన ప్రకటన అవాస్తవమని మా విశ్లేషణ చూపుతోంది. 


పేజీలకు పేజీలు ఒకేరకంగా ఉండడం కాకతాళీయంగా జరగదు. లక్షల ప్రజల సొమ్ము వెచ్చించి నకలు నివేదికను ప్రజలపై రుద్దడం అనైతికం. సభ్య సమాజం ఛీత్కరించవలసిన విషయం. 


పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తరువు ప్రకారం ఈ దశలోనే పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను రద్దు చేసి, నిజాయితీతో కొత్త నివేదికను రూపొందించిన తరువాతనే తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ జరపడం సహజ న్యాయం. 


ఇక నివేదికలోని సమాచారం పూర్తిగా కల్పించినదే. ఏడు భిన్న ఉత్పత్తి రంగాలను ప్రతిపాదిస్తున్నారు. వాటిలో ఏ పరిశ్రమలునెలకొల్పుతారో తెలియదు. కానీ చిత్తమొచ్చిన వాయు, జల కాలుష్యాలను నిర్ధారించారు. ఘనవ్యర్థాలను కూడా ప్రాతిపదిక లేకుండా అంచనా వేశారు. ఇదంతా కాలుష్యమేమీ ఉండదని చూపి అనుమతి పొందే ప్రయత్నమే కాని ప్రజలకూ, పర్యావరణానికీ జరిగే హానిని నిజాయితీగా గుర్తించే యత్నం కాదు. అన్ని రకాల పరిశ్రమల కంటే ఆహార శుద్ధి పరిశ్రమల, వాయు కాలుష్యాన్ని అత్యధికంగా చూపుతున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రస్థాయిలో పర్యావరణ అనుమతులు అవసరం లేదు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక కూడా అవసరం లేదు. అలాంటి పరిశ్రమలు అత్యధికంగా వాయు కాలుష్యం కలిగిస్తాయని చూపి, ఇతర రంగాల పరిశ్రమలలో కాలుష్యం తక్కువగా చూపడంలో ప్రాతిపదిక ఏమిటి? 


లోహ పరిశ్రమలలో ఉత్పత్తిస్థాయి ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం గణనీయంగా ఉంటుంది కాని దాన్ని తక్కువ చేసి చూపుతున్నారు. విద్యుత్‌ సరఫరాకు 65 డీసెల్‌ జనరేటర్లు పెడతారట. భూతాపం అదుపు తప్పుతున్న ఈ కాలంలో, శిలాజ ఇంధన వాడుకను విసర్జించవలసిన తరుణంలో ఈ ప్రతిపాదన పర్యావరణ హితం కాదు. మొత్తం పారిశ్రామికవాడలో ఒక్క బాయిలర్‌ని కూడా వాడుతున్నట్లు చూపలేదు. స్టీం లేకుండా ఆహారశుద్ధి పరిశ్రమలెలా నడుస్తాయి? స్టీం ఉత్పత్తికి వాడే ఇంధనమేది? 


ద్రవ ఇంధనాలను, ద్రావకాలను నిలువ ఉంచరా? వాటి వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదాలపై అంచనాలు లేవు. కాలుష్యం మోతాదు ప్రాతిపదికే తప్పుగా తీసుకున్న నివేదిక ఆధారంగా అనుమతులివ్వడం సమంజసమా? 


మేము ఈ నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నాము. దీనికి యోగ్యత లేదు. టిఎస్‌ఐఐసి ఈ తప్పుడు నివేదికను వెనక్కి తీసుకుని సరైన ప్రమాణాలు పాటించి మరో నివేదికను రూపొందించిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణను కోరాలి. ఇచ్చిన ధ్రువపత్రం మేరకు కాపీ కొట్టలేదని నిరూపించడానికి టిఎస్‌ఐఐసి ముందుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నాము. 

డా. కె. బాబూరావు, డా. కె. వెంకటరెడ్డి, డా.ఎ.వి. రావు, డా. ఎ. శ్రీనివాసరావు, డా. ఎం. బాపూజీ, డా. సి.వి.ఎస్‌. మూర్తి, డా. బి.వి. రెడ్డి, డా. ఎం. మోహనరావు, డా.డి. రాంబాబు, డా.అహ్మద్‌ ఖాన్‌, డా. ఎస్‌.ఆర్‌. శర్మ, ప్రొ. ఎం. ఆదినారాయణ, ప్రొ.బి.ఎన్‌. రెడ్డి, ప్రొ. కె. సత్యప్రసాద్‌, ప్రొ.కె. వెంకటేశ్వర రావు, ప్రొ. బి.కె. నాయుడు, ప్రొ. ఎం. చన్నబసవయ్య, ప్రొ. కె. కృష్ణకుమారి, కె.బి.ఎస్‌. సాయిబాబు, సి.ఎస్‌. రాజు

Advertisement
Advertisement
Advertisement