నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

ABN , First Publish Date - 2022-01-27T05:35:27+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు
విద్యుత్‌ దీపాల వెలుగులో దర్గా

మూడు రోజుల పాటు నిర్వహణ 

 విద్యుత్‌ దీపాలతో ముస్తాబైన ఆలయ పరిసరాలు

పాలకవీడు, జనవరి 26 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే దర్గాను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్గా వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాల్లో బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపారు. నేరేడుచర్ల వైపు, దామరచర్ల వైపు రెండు చోట్ల వాహనాల పార్కింగ్‌కు స్థలాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 350మంది పోలీసు సిబ్బందితో పాటు రెండు స్పెషల్‌ ఫోర్స్‌  బృం దాలు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా దర్గా పరిసరాల్లో రంగులరాట్నం, ఆట వస్తువులు సిద్ధం చేస్తున్నారు. 

శాఖల వారీగా సేవలు

ప్రభుత్వ శాఖల వారీగా ప్రత్యేకస్టాల్స్‌, కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీ సులను ఆర్టీసీ నడుపనుంది. స్థానిక దక్కన్‌ సిమెంటు ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పి స్తున్నట్లు జీఎం నాగమల్లేశ్వరావు తెలిపారు.  

కాసరబాదలోనూ

సూర్యాపేటరూరల్‌: జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సూ తరహాలోనే సూర్యాపేట మండలం కాసరబాద గ్రామశివారులోని హజరత్‌ సయ్యద్‌ జాన్‌పాక్‌ షాహిద్‌ షా, మోహిన్‌షా(దంతాల దర్గా)కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ కూడా నేటి నుంచి రెండు రోజుల పాటు ఉర్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని దంతాల కుటుంబం నుంచి దర్గాకు గంధం తీసుకరావడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దర్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Updated Date - 2022-01-27T05:35:27+05:30 IST