మరో దేశంతో ఎయిర్ బబూల్ ఒప్పందం కుదుర్చుకున్న భారత్

ABN , First Publish Date - 2020-10-21T06:50:17+05:30 IST

కరోనా నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి అన్ని రకాల విమాన సేవలను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం

మరో దేశంతో ఎయిర్ బబూల్ ఒప్పందం కుదుర్చుకున్న భారత్

టోక్యో: కరోనా నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి అన్ని రకాల విమాన సేవలను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం డొమెస్టిక్ సేవలకు పచ్చ జెండా ఊపినప్పటికి అంతర్జాతీయ ప్రయాణాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే జూలై నుంచి కేంద్రం ఒక్కో దేశంతో ‘ఎయిర్ బబూల్’ ఒప్పందం కుదుర్చుకుంటూ వస్తోంది. ఎయిర్ బబూల్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య విమానాలు నడుస్తాయి. ఇప్పటికే అమెరికా, యూకే తదితర దేశాలతో కేంద్రం ఎయిర్ బబూల్ ఒప్పందం కుదుర్చుకుంది. 


రెండు రోజుల కిందట బంగ్లాదేశ్‌తో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకోగా.. తాజాగా జపాన్‌తో సైతం ఈ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని టోక్యోలోని ఇండియన్ ఎంబసీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇకపై ప్యాసెంజర్లకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని, నేరుగా ఎయిర్‌లైన్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి టోక్యోకు విమానాలు నడపనుంది. అదే విధంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 30 వరకు టోక్యో నుంచి ఢిల్లీకి విమానాలను తిప్పనుంది.

Updated Date - 2020-10-21T06:50:17+05:30 IST