రాలిన ‘మల్లె’... వాడిన రైతు!

ABN , First Publish Date - 2020-04-09T10:21:26+05:30 IST

కరోనా మహమ్మారి పూలతోటల రైతులను కాటేసింది. సరిగ్గా కాసులు కురిపించే వేసవి సీజనులో కరోనా కమ్మేయడంతో మల్లె రైతుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.

రాలిన ‘మల్లె’... వాడిన రైతు!

మంగళగిరి, ఏప్రిల్‌ 8: కరోనా మహమ్మారి పూలతోటల రైతులను కాటేసింది. సరిగ్గా కాసులు కురిపించే వేసవి సీజనులో కరోనా కమ్మేయడంతో మల్లె రైతుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి, నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో  సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో మల్లెతోటలు, మరో 60 ఎకరాల్లో కనకాంబరాలు సాగవుతున్నాయి.


ఈ మూడు గ్రామాల నుంచి ఏటా ఏప్రిల్‌లో రోజుకు సగటున 12 నుంచి 14 క్వింటాళ్ల మల్లెలు,  క్వింటాకు పైగా కనకాంబరాలు కోతకొస్తుంటాయి. వీటిని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మార్కెట్లకు 40నుంచి 50శాతం, మిగతా యాభై శాతం పూలను హైదరాబాద్‌కు తరలించి సొమ్ముచేసుకుంటారు. ఇందుకోసం పెదవడ్లపూడిలో 14 హోల్‌సేల్‌ పూలకొట్లు కూడ వున్నాయి. వడ్లపూడి పూలన్నీ ఈ హోల్‌సేల్‌ కొట్లద్వారా వెళుతుంటే నిడమర్రు, బేతపూడినుంచి వచ్చే పూలను అక్కడి రైతులే బైకులపై నేరుగా విజయవాడ మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకుంటారు. కరోనా తాలూకు లాక్‌డౌన్‌ ప్రత్యేక పరిస్థితుల కారణంగా రైతులు పూలకోతలకే సాహసించడం లేదు. దీంతో పూలన్నీ తోటల్లోనే రాలుతున్నాయి.


వేసవి సీజనంటే ముందు మామిడి పండ్లు...ఆ తరువాత మల్లెపూలు గుర్తొస్తాయి. మామిడి సంగతేమో కాని... మల్లెతోటల రైతులకు మాత్రం ఈ సీజన్‌ వేదననే మిగిల్చింది. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితం. తోటల్లో కోతలకు కూలీలు రాని పరిస్థితి. ఒకవేళ వచ్చినా వాటిని హోల్‌సేల్‌ మార్కెట్‌కు తరలించే వీలులేదు. రవాణా మొత్తం స్తంభించిపోయింది.  


 సాధారణంగా ఎకరా మల్లెతోటపై రైతుకు ఏడాది మొత్తంమీద రూ.లక్షన్నర వరకు నికరాదాయం వుంటుంది. ప్రత్యేకించి వేసవి సీజనులో దాదాపు సగం ఆదాయం అంటే రూ.75వేల వరకు రైతు కళ్లజూస్తాడు. లాక్‌డౌన్‌ కారణంగా మల్లెరైతులు ఈ వేసవి ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారు. విరగకాస్తున్న తోటల నుంచి పూలను కోయిస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకునే అవకాశాలు లేకపోవడంతో కోతకూలీ దండగనే భావనతో పూలను తోటలమీదే వదిలివేస్తున్నారు. పెదవడ్లపూడిలో పూల కమీషన్ల కొట్లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలవారు సైతం...తాము మార్చి 22 నుంచి కొట్లను మూసేసి వ్యాపారాన్ని కోల్పోయామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-09T10:21:26+05:30 IST