‘దయ’ చూపింది!

ABN , First Publish Date - 2021-12-05T04:25:21+05:30 IST

‘దయ’ చూపింది!

‘దయ’ చూపింది!
సోంపేట : పలాసపురంలో నీట మునిగిన వరి చేను

- ఒడిశా వైపు జవాద్‌ తుఫాన్‌

- ఊపిరి పీల్చుకున్న జిల్లావాసులు

- వర్షాలతో నీట మునిగిన పంటలు

- ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు ‘జవాద్‌’ అనే పేరును సౌదీ అరేబియా దేశం సూచించింది. జవాద్‌ అంటే అరబిక్‌ భాషలో ‘ఉదారమైన’ లేదా ‘దయగల’ అనే అర్థాలు ఉన్నాయి. ఇంతకుముందు తుఫాన్ల తరహాలో జిల్లాలో విధ్వంసం సృష్టించకుండా... ఒ డిశా వెళ్లిపోవడం ద్వారా జవాద్‌ పేరుకు తగ్గట్టే ‘దయ’ చూపినట్లయింది.

సిక్కోలుకు జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పినట్టే. ఈ తుఫాన్‌ ఉత్తరాంధ్రపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులంతా సన్నద్ధమయ్యారు. తీరప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్‌తో ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని జిల్లావాసులంతా ఆందోళన చెందారు.  శనివారం సాయంత్రానికి తుఫాన్‌ దిశ మారింది. ఒడిశా రాష్ట్రం పూరీ వైపు మరలిపోయింది.  జిల్లాకు ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తుఫాన్‌ ప్రభావంతో శనివారం కూడా జిల్లావ్యాప్తంగా మోస్తరుగా వర్షం కురిసింది. పలాసలో అత్యధికంగా 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, భామిని, మెళియాపుట్టి మండలాల్లో అత్యల్పంగా 0.25 మి.మీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురవగా.. సాయంత్రానికి తెరిపినిచ్చింది. తుఫాన్‌ దిశ మారడంతో  పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు తరలిపోయారు. 


పంటల పరిశీలన

శ్రీకాకుళం రూరల్‌, గార, పలాస, పాలకొండ, పోలాకి, సోంపేట తదితర ప్రాంతాల్లో వరి పంట నీటిలోనే ఉంది. పలుచోట్ల పొలాల్లో వరిపంట కోతకోసి కుప్పలుగా ఉంచేయడంతో అవి తడిసి ముద్దయ్యాయి. మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. సంతబొమ్మాళి, శ్రీకాకుళం, కోటబొమ్మాళి, టెక్కలి మండలాల్లో వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జేడీ శ్రీధర్‌లు పర్యటించారు. పంటల పరిస్థితిని పరిశీలించారు. సంతబొమ్మాళి మండలంలో 1061 రకం వరి పంట సాగుచేయడంతో వర్షాలకు ఇబ్బంది లేకపోయిందని జేడీ తెలిపారు. ప్రస్తుత తుఫాన్‌ వల్ల ఎక్కడా పంట నష్టం సంభవించలేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రైతులకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీటిని సకాలంలో స్ర్పే చేయాలని రైతులకు ఆయన సూంచారు.  


రెండు రోజుల్లో 1172.1 మిల్లీమీటర్ల వర్షపాతం 

జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో శుక్ర, శనివారాల్లో 1172.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 30.8 మి.మీ. కాగా.. తుఫాన్‌ వల్ల 1141.3మి.మీ వర్షం  అదనంగా కురిసింది. సంతకవిటిలో అత్యధికంగా 40.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుఫాన్‌ దిశ మారడంతో భారీ నష్టం కూడా తప్పింది. 

Updated Date - 2021-12-05T04:25:21+05:30 IST