దడపుట్టిస్తున్న జవాద్‌

ABN , First Publish Date - 2021-12-04T05:54:17+05:30 IST

విశాఖ జిల్లాపై జవాద్‌ తుఫాన్‌ ప్రభావం అధికంగా వుంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

దడపుట్టిస్తున్న జవాద్‌

తీవ్ర ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం

నేవీ, మెరైన్‌, కోస్టుగార్డు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు హెలికాప్టర్లు సిద్ధం

సముద్ర తీర మండలాలపై ప్రత్యేక దృష్టి

డీఈ స్థాయి అధికారికి రిజర్వాయర్ల పర్యవేక్షణ బాధ్యత

నేడు విద్యా సంస్థలకు సెలవు

తుఫాన్‌తో వరి రైతుల్లో ఆందోళన


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

విశాఖ జిల్లాపై జవాద్‌ తుఫాన్‌ ప్రభావం అధికంగా వుంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా వుండాల్సిందిగా అన్ని శాఖల సిబ్బందినీ ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా వుండే సముద్ర తీర మండలాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నేవీ, మెరైన్‌, కోస్టుగార్డు బృందాలతోపాటు హెలికాప్టర్లను, 50 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంచేశారు.  రిజర్వాయర్లలో నీటి నిల్వల క్రమబద్ధీకరణ, వరద ప్రవాహం, అదనపు నీరు దిగువకు విడుదల, నదుల తీరగ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం వంటి చర్యలు చేపట్టారు. అన్ని విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. 


బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి నగరంతోపాటు జిల్లాలో వాతావరణం మారింది. మేఘాలు ఆవరించడంతోపాటు చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. భీమునిపట్నం నుంచి పాయకరావుపేట వరకు తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ వల్ల ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సిబ్బందిని, అధికారులకు గురువారం నుంచే అప్రమత్తంచేశారు. 


జిల్లాలో ఏడు రిజర్వాయర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే బాధ్యతను డీఈ స్థాయి అధికారికి అప్పగించారు. క్యాచ్‌మెంట్‌ నుంచి ఇన్‌ఫ్లో పెరిగిన నేపథ్యంలో రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. గరిష్ఠ స్థాయికి చేరువలో వున్న తాండవ, పెద్దేరు జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా తుఫాన్‌ కారణంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అనేకచోట్ల వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. మరికొన్నిచోట్ల కోసిన పంట పొలంలో ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు వరి పనలను సురక్షిత ప్రదేశాలకు చేర్చి కుప్పలు వేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శనివారం కూడా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. తుఫాన్‌ దృష్ట్యా మూడు రోజులపాటు అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.  


సీఎం సమీక్ష...ఏర్పాట్లను వివరించిన కలెక్టర్‌

కాగా జవాద్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ, జీవీఎంసీలో 47, గ్రామీణ ప్రాంతంలో 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేవీ, మెరైన్‌, కోస్టుగార్డు బృందాలతోపాటు రెండు హెలికాప్టర్లు, ఇంకా నేవీ  హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశామన్నారు. విద్యుత్‌కు సంబంధించి 148 క్రేన్లు, 24 ఎక్స్‌కవేటర్లు, 50 పవర్‌ సాసర్లు, 1,048 మంది సిబ్బందిని సిద్ధంచేశామన్నారు. జీవీఎంసీ పరిధిలో 144 ప్రాంతాల్లో డ్రైన్లు శుభ్రపరిచామన్నారు. జిల్లాలో 140 బోట్లు సముద్రంలోకి వెళ్లాయని, వీటిలో 40 గంజాంలో, 100 బోట్లు పారాదీప్‌లో యాంకరైజ్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడామన్నారు. 


నేటి ఉదయం కీలకం...

విశాఖకు చేరువగా తీవ్ర తుఫాన్‌

తెల్లవారుజాము నుంచి పెరగనున్న గాలులు, వర్షం

విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంపై శనివారం ఉదయం జవాద్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపనున్నది. ఉదయం 11.30 గంటల సమయానికి తీవ్ర తుఫాన్‌గా మారి విశాఖకు 100 నుంచి 150 కి.మీ. సమీపానికి రానున్నది. తీరానికి సమీపంగా వచ్చే క్రమంలో నగరం, చుట్టుపక్కల ప్రాంతాలపై  ప్రభావం ఎక్కువగా వుంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి అంచనా ప్రకారం శనివారం తెల్లవారుజాము నుంచి నగరంతోపాటు గ్రామీణ ప్రాంతంలోనూ వర్షాలు, గాలులు పెరుగుతాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా కుంభవృష్టిగా కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 80 నుంచి 90, అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. తీరానికి ఆనుకుని వున్న ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చెట్లు, హోర్డింగ్‌లు కూలే అవకాశం వున్నందున పనుల కోసం బయటకు వచ్చేవారంతా అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 11.30 గంటల తరువాత తీవ్ర తుఫాన్‌ దిశ మార్చుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైపు పయనించనున్నది. 



Updated Date - 2021-12-04T05:54:17+05:30 IST