Abn logo
Jul 31 2021 @ 17:04PM

జగన్ దళితులకు అన్యాయం చేస్తున్నారు: జవహర్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దళితులకు అన్యాయం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత జవహర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వంపై మాట్లాడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తూ దళిత జాతికి ఆన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చి ఓనర్లను చేస్తే జగన్‌రెడ్డి వాటన్నింటిని రద్దు చేసి దళితులను రోడ్డు పాలు చేయడం మీకు కనపడటం లేదా? అని జవహర్ ప్రశ్నించారు.


రెండేళ్ల నుంచి దళితుల మీద దాడులు అవమానాలకు, శిరోముండనాలు చేస్తుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదన్నారు. దళితుల పేరుతో అందలమెక్కుదామన్న యావ తప్పా దళితులకు న్యాయం చేయాలన్న ధ్యాస వైసీపీ నాయకుల్లో లేకపోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ భవిష్యత్ కోసం జగన్‌రెడ్డి దళిత జాతిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.దళిత విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేశారని చెప్పారు. దళిత రాజధాని అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. దళితులను ఓటు బ్యాంకుగా తప్పా దళిత సంక్షేమం జగన్‌రెడ్డికి పట్టదన్నారు. వైసీపీ పాలనలో దళితులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెప్పడం ఆత్మవంచనే అవుతుందని జవహర్ అన్నారు.