Advertisement
Advertisement
Abn logo
Advertisement

డబ్బు మీద మమకారం లేదంటూనే వేల కోట్లు సంపాదించిన జయ్

న్యూఢిల్లీ : సామాన్య కుటుంబంలో జన్మించి, డబ్బు మీద మమకారం పెంచుకోకుండా, ఇంటర్నెట్‌ను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కృషి చేసిన వ్యక్తి నేడు  13 బిలియన్ డాలర్ల ఆస్తులకు అధిపతిగా ఎదిగారు. వ్యాపారంతోపాటు కుటుంబ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ, తన జన్మభూమికి కూడా సేవలందిస్తున్నారు. 


హిమాచల్ ప్రదేశ్‌లోని ఉణ జిల్లా, పనోహ్ గ్రామంలో జయ్ చౌదరి 1958లో జన్మించారు. ఇంట్లో విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో చెట్టు క్రింద కూర్చుని చదువుకునేవారు. ధుసరలోని హైస్కూల్‌కు వెళ్ళడానికి రోజూ దాదాపు 4 కిలోమీటర్లు నడిచేవారు. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీలో బీటెక్ చేశారు. సిన్సినాటి విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 


పొదుపు చేసిన సొమ్ముతో స్టార్టప్ కంపెనీ

ఐబీఎం, యునిసిసీ, ఐక్యూ సాఫ్ట్‌వేర్ వంటి సంస్థల్లో దాదాపు 25 ఏళ్ళపాటు సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలు చేశారు. 1996లో చౌదరి, ఆయన సతీమణి జ్యోతి తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు. వారు పొదుపు చేసుకున్న సొమ్ముతో సెక్యూర్ఐటీ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత మరో నాలుగు సంస్థలను స్థాపించారు. 2008లో జీస్కేలర్‌ను స్థాపించడంతో ఆయన దశ తిరిగింది. ఈ కంపెనీ 2018 మార్చిలో పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లింది.  


కుటుంబ సంబంధాలకు పెద్ద పీట

ప్రస్తుతం జయ్ చౌదరి కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నివసిస్తున్నారు. తన కుటుంబంతో చాలా ఆత్మీయంగా వ్యవహరిస్తారు. తన సతీమణి జ్యోతి, కుమార్తె సిమి (22), కుమారులు యశ్ (19), సమీర్ (15)లతో కలిసి భోజనం చేసి, ఆ తర్వాత తన నివాస ప్రాంతంలో కొంచెం దూరం అందరూ కలిసి నడుస్తారు. 


ఫోర్బ్స్ 400 జాబితాలో...

నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ జీస్కేలర్ తాజా విలువ 28 బిలియన్ డాలర్లు. దీనిలో జయ్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులకు 45 శాతం వాటాలు ఉన్నాయి. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్, 2021 ప్రకారం, జయ్ చౌదరి ఎస్టిమేటెడ్ నెట్ వర్త్ గత ఏడాది 271 శాతం పెరిగి, 13 బిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి 2 నాటికి ఆయన ఆస్తుల నెట్ వర్త్ 11.5 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ 400 ప్రకారం ఆయన 85వ స్థానంలో నిలిచారు.


టెక్నాలజీని ఉపయోగించడంతో...

కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి డిజిటల్ టెక్నాలజీలను అత్యంత వేగంగా ఉపయోగించుకోవడం వల్ల జయ్ చౌదరి ఆస్తుల విలువ భారీగా పెరిగింది. జూమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లు కూడా ఇదేవిధంగా లబ్ధి పొందిన సంగతి తెలిసిందే. 


జన్మభూమికి సేవ

జయ్ చౌదరి మాట్లాడుతూ, తన విజయానికి ప్రధాన కారణం  తనకు డబ్బు మీద మమకారం లేకపోవడమేనని చెప్పారు. వ్యాపారం చేయడానికి అత్యంత సురక్షిత ప్రదేశంగా ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తాను తన స్వగ్రామం పనోహ్‌కు ప్రతి సంవత్సరం వెళ్తానని, గ్రామస్థుల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. తాను శాకాహారినని, స్థానిక పార్క్‌లలో నడుస్తూ ఆనందిస్తానని చెప్పారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement