Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 12:40PM

జయకు అన్నాడీఎంకే నేతల నివాళి

శశికళ కన్నీటి అంజలి

ఈపీఎస్‌ కారు ముట్టడి, కార్యకర్తల ఘర్షణ

చెన్నై: అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఐదో వర్థంతి సందర్భంగా పార్టీ నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు మెరీనాబీచ్‌లోని ఆమె సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. జయ వర్థంతి సందర్భంగా ఆమె సమాధిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆదివారం ఉదయం అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళని స్వామి, పార్టీ ప్రముఖులు వేలాదిమంది కార్యకర్తలతో జయ సమాధివరకూ మౌనయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత సమాధి వద్ద నాయకులందరూ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం పార్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌, డిప్యూటీ సమన్వయకర్తలు కేపీ మునుసామి, వైద్యలింగం, మాజీ మంత్రులు పొన్నయ్యన్‌, డి. జయకుమార్‌, వలర్మతి, గోకుల ఇందిర, నత్తం విశ్వనాధన్‌, కేపీ అన్బళగన్‌, మాజీ మేయర్‌ సైదై దురైసామి, జిల్లా కార్యదర్శులు ఆదిరాజారాం. బాలగంగా, వేళచ్చేరి అశోక్‌, విరుగై వీఎన్‌ రవి, రాజేష్‌, వెంకటేష్‌బాబు, బెంజమిన్‌, డాక్టర్‌ సునీల్‌, విద్యార్థి విభాగం కార్యదర్శి విజయకుమార్‌, రాష్ట్ర విద్యార్థి సంఘం డిప్యూటీ కార్యదర్శి, న్యాయవాది ఎ. పళిని, మాజీ కౌన్సిలర్‌ చిన్నయ్యన్‌, సాహిత్య విభాగం డిప్యూటీ కార్యదర్శి డి. శివరాజ్‌, సహాయ కార్యదర్శి ఇ.సీ శేఖర్‌, ఎస్‌ కడుంబాడి, ఎంఎన్‌ ఇలంగో, వైద్యనాఽథన్‌ తదితరులు పాల్గొన్నారు. నివాళి కార్యక్రమంలో ఎడప్పాడి పళనిస్వామి సహా పలువురు నేతలు, పార్టీ ప్రముఖులు నల్ల చొక్కాలు ధరించి పాల్గొన్నారు. పన్నీర్‌సెల్వం కొంతమంది మాజీ మంత్రులు మాత్రం ఎప్పటివలెనే తెల్లచొక్కా లు, పార్టీ రంగుల అంచు కలిగిన ధోవతులు ధరించి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి తదితర నేతల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేకంగా ఇక జరుగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులు విజయ సాధించకుండా అడ్డుకుంటామని కార్యకర్తల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు.


శశికళ, దినకరన్‌ నివాళి

మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఐదో వర్థంతి సందర్భంగా ఆదివారం ఉదయం మెరీనాబీచ్‌లోని ఆమె సమాధివద్ద అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ వేలాది కార్యకర్తలతో కలిసి వేర్వేరుగా నివాళులర్పించారు. జయలలిత సమాధిపై పుష్పగుచ్చాన్ని ఉంచుతూ శశికళ కంటతడిపెట్టుకున్నారు. సమాధివైపు చేతులెత్తి నమస్కరించారు. కాసేపు మౌనంగా అక్కడే నిలిచారు. ఆమెతోపాటు మాజీ మంత్రి సైదై జి. సెంతమిళణ్‌, సీఆర్‌ సరస్వతి, తిరుచ్చి మనోహరన్‌, అంబత్తూరు మాజీ శాసనసభ్యుడు వేదాచలం ఇతర నేతలు కార్యకర్తలు జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. శశికళ నివాళులుర్పించిన అరగంట తర్వాత అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలను వెంటబెట్టుకుని మౌనయాత్ర నిర్వహించి జయ సమాధి వద్దకు చేరుకున్నారు. సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు, దుష్టశక్తుల నుంచి అన్నాడీఎంకేని కాపాడేందుకు పాటుపడదామంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు.


ఈపీఎస్‌ కారు ముట్టడి

ఇదిలా ఉండగా జయలలిత సమాధివద్ద నివాళులర్పించిన అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కారులో బయల్దేరుతుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. కారును కదలనీయ కుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎడప్పాడి వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడికి చేరుకుని రెండు పార్టీల కార్యకర్తలను శాంతిపజేశారు. అప్పటికే ఎడప్పాడి కారు వద్ద రక్షణ కల్పిస్తున్న పోలీసులు ఆయనను కారులో ఎక్కించారు. ఆ తర్వాత ఎడప్పాడి కారులో బయలుదేరి వెళ్ళారు. ఈ సంఘటనలో అన్నాడీఎంకేకి చెందిన రాయపేట నివాసి సుధాకర్‌ అనే కార్యకర్త గాయపడ్డాడు. ఈ సంఘటన వల్ల అరగంటసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement