దేశంలో ఎక్కువసార్లు క్యాన్సర్ సోకిన కుర్రోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-10-04T13:19:43+05:30 IST

దేశంలో ఎక్కువసార్లు క్యాన్సర్ సోకిన కుర్రోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!

దేశంలో ఎక్కువసార్లు క్యాన్సర్ సోకిన కుర్రోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!

క్యాన్సర్ అనేది ఎటువంటి వ్యాధి అంటే... ఈ పేరు వినగానే ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. అయితే క్యాన్సర్‌ను ఓడించిన వారిలో కొందరు ఆత్మస్థయిర్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు. ఇదే కోవలోకి వస్తారు జయంత్ కందోయి. ఇతను ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఆరుసార్లు క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. 23 ఏళ్ల జయంత్.., రాజస్థాన్ లోని అజ్మేర్ జిల్లాకు చెందినవ్యక్తి. దేశంలో ఆరుసార్లు క్యాన్సర్‌ను జయించిన వ్యక్తిగా జయంత్ నిలిచాడు. జయంత్ కు చిన్నప్పటి నుంచి చదువుపై అమితమైన ఆసక్తి ఉండేది. స్కూల్ డేస్‌లో టాపర్‌గా నిలిచాడు. పైగా ఫుల్ అటెండెన్స్ కూడా ఉండేది. అలాగే జిల్లా స్థాయిలో ఖోఖో చాంపియన్‌గా కూడా నిలిచాడు.


డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్‌లో కూడా ప్రతిభ చూపాడు. అయితే జయంత్‌ను క్యాన్సర్ కబళించడంతో అతని ఉత్సాహానికి బ్రేక్ పడింది. జయంత్‌కు 2013లో తొలిసారి క్యాన్సర్ సోకింది. ఆ సమయంలో జయంత్ టెన్త్ చదువుతున్నాడు. అతని గొంతు కుడి వైపున హాడ్కిన్ లింఫోమా ఏర్పడింది. ఈ నేపధ్యంలో భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రిలో అతనికి చికిత్స జరిగింది. ఈ సమయంలో జయంత్‌కు 12 సార్లు కీమోథెరపీ చేయాల్సివచ్చింది. క్యాన్సర్‌కు చికిత్సపొందుతూనే జయంత్ బోర్డ్ పరీక్షలు రాశాడు.  పాఠశాలలో మొదటి స్థానాన్ని సాధించడంతో పాటు క్యాన్సర్‌ను కూడా ఓడించాడు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. అయితే ఊహించని విధంగా క్యాన్సర్ మరోసారి జయంత్‌పై దాడి చేసింది.


2015 ఫిబ్రవరిలో జయంత్ మరోమారు గొంతు క్యాన్సర్‌కు గురయ్యాడు. ఫలితంగా జయంత్ రేడియోథెరపీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సమయంలో జయంత్ 60 రేడియోథెరపీ సెషన్లను తీసుకున్నాడు. ఇది తగ్గిందనేంతలో 2017లో జయంత్ ఉదర సంబంధిత క్యాన్సర్ బారినపడ్డాడు. ఫలితంగా అతని చదువుతో పాటు అతని స్టార్టప్ కూడా ఆగిపోయింది. ఆ తరువాత కూడా 2019 ప్రారంభంలోనూ, అదే ఏడాది చివరిలోనూ క్యాన్సర్ బారిన పడ్డాడు. 2020 నవంబరులో జయంత్‌కు ఆరవసారి క్యాన్సర్ సోకింది. ఈ సమయంలో అతనికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సివచ్చింది. జయంత్ క్యాన్సర్‌ను ఎదుర్కొన్న సమయంలో అతని తల్లిదండ్రులు అతనికి అండగా ఉంటూ కొండంత ధైర్యాన్ని నింపారు. ఆరుసార్లు క్యాన్సర్ ఓడించిన జయంత్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా మారారు.




మీడియాతో జయంత్ మాట్లాడుతూ నేటికీ చాలామంది క్యాన్సర్‌ను చాలా పెద్ద వ్యాధిగా భావిస్తున్నారు. ఇది చాలా తప్పు. క్యాన్సర్ సోకినవారిని ఆందోళనకు గురిచేయవద్దు. చికిత్స అందుకుంటే కొంత సమయం తర్వాత వ్యాధి నయమవుతుంది. మనమందరం కలిసి క్యాన్సర్‌తో పోరాడితే క్యాన్సర్‌ను తరిమికొట్టవచ్చన్నారు. జయంత్ 2018లో జ్ఞాన్ కీ బాత్ అనే యాప్ ప్రారంభించారు. దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. త్వరలో జయంత్ స్థానిక దుకాణదారుల కోసం ఒక యాప్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం జయంత్ మోటివేషనల్ స్పీకర్‌గా ఉంటూనే ఎంబీఏ చదువుతున్నారు. భవిష్యత్‌లో జయంత్... క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి, దానిలో క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని భావిస్తున్నాడు.

Updated Date - 2021-10-04T13:19:43+05:30 IST