Advertisement
Advertisement
Abn logo
Advertisement

-ప్రజా వాగ్గేయకారుడు- అక్షరాలు నేర్చుకోమని రాస్తే ఆర్నెల్లు సస్పెండ్‌ చేశారు

రెణ్నెళ్ల కంటే ఎక్కువ బతకనన్నారు వైద్యులు

సానుకూల దృక్పథానికి జీసస్‌ ప్రతీక

అందుకే ఆయన మీద పాటలు రాశాను

ప్రకృతే పరమాత్మ అనుకుంటాను

30-04-2012న ఓపెన్‌ హార్ట్‌లో ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్‌


వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం జయరాజ్‌గారూ..

నమస్తే.


ఈమధ్యే ‘పాతికేళ్ల పాటల ప్రస్థానం’ అని వసంతోత్సవం జరుపుకొన్నారు కదా? ఎందుకలా అనిపించింది?

నేను చావుబతుకుల నుంచి బయటికొచ్చాను. ఒక దశలో నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ‘ఇంకో రెణ్నెల్ల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతకవు జయరాజ్‌’ అని డాక్టర్లు చెప్పారు. అందుకే నా జీవితాన్ని, నా సాహిత్యాన్నంతా వెళ్లిపోయే ముందు ఒక్కసారి కలబోసుకుందామనే ఈ వేడుక చేసుకున్నాను. కానీ.. మీ అందరి అభిమానం వల్ల ఆరు సంవత్సరాలుగా బతికే ఉన్నా.


మీ పాటల్లో మీకు బాగా నచ్చిందేది?

నేను ప్రకృతి ప్రేమికుణ్ని. ‘‘పచ్చని చెట్టును నేనురా..’’ అనే చెట్టు పాట నాకు చాలా ఇష్టం. ప్రకృతి వల్ల ఏ సాహిత్యమైనా రంజిల్లుతుంది. విప్లవానికి ప్రకృతి శోభను అద్దితే వచ్చే సౌరభమే వేరు. ఇందువల్లే నా సాహిత్యం వెలుగు చూసిందని భావిస్తున్నాను.


ప్రారంభంలో విప్లవ రాజకీయాల వైపు బాగా ఆకర్షితులయ్యారు కదా?

ప్రారంభమేమిటి.. జీవితం మొత్తం.. దాదాపు చావు దగ్గరికి వెళ్లేదాకా.. అందులోనే గడిపాను.


ఆస్పత్రి నుంచి వచ్చాక నమ్మకం పోయిందా?

నమ్మకం పోలేదు. విప్లవ జీవితంలో వాళ్లు చేసే త్యాగాలు, కృషి.. వాళ్లమీద ఎన్నో పాటలు రాశాను. అందుకే నేను.. ‘‘కన్నకొడుకు ఒక్కడున్న.. వాన్ని అన్నలల్లో కలవమందును.. రేపు కడుపునొక్క బిడ్డ పుట్టిన.. వాన్ని జెండ పట్టి నడవమందును’’ అని రాశాను.


అంత భావావేశంతో పాట రాసిన మీరే ఆ బాటనొదిలేశారు కదా?

దానికొకటే కారణం. త్యాగాలు చేస్తున్నవారికి ఇప్పటికీ నేను సెల్యూట్‌ చేస్తాను. కానీ విప్లవోద్యమంలో కూడా చిట్‌ఫండ్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వస్తే వాళ్లకి నేనెట్ల సెల్యూట్‌ చేస్తా? నేనున్నంత కాలం అలాగే బతికాను. దొరన్న ప్రభావంతో నేను ఎనిమిదో తరగతిలో విప్లవోద్యమంలో చేరాను. అడవులకెళ్లాను, జైలుకెళ్లాను. బొగ్గు గనుల్లో కార్మికుల కు పాట అనే ఆయుధాన్నిచ్చాను. కానీ, ఎప్పుడైతే ట్రెండ్‌ మారిందో అప్పుడే మనసు మార్చుకున్నాను.


మనసు విరగడంతోటే.. నక్సలైట్ల మీద సెటైర్లు రాశారా?

విరిగి ఏం కాదు, వాళ్లు మంచిగా ఉండాలని.. ‘మీలో కూడా మార్పు రావాలి’ అని చెప్పడానికి రాశాను.


మీకు జరిగిన అవమానాలెట్లాంటివి?

అసలు మమ్మల్ని మనుషులుగా చూడని రోజులవి. మేమెంత జ్ఞానవంతులైౖనాగానీ.. వాళ్లిళ్లల్లోకి వెళ్లి మాట్లాడింది లేదు. మా ప్రాంతంలో దొరతనం మరీ ఎక్కువ. అందుకే.. ‘మిణుగురు మెరిసిన నేరమేనా తెలంగాణ పల్లెలో.. మీసం మొలిసిన నేరమేనా తెలంగాణ పల్లెలో..’ అని రాశాను. ఆ దొరతనం, కులం పోవాలనుకున్నాం.


చివరికి మీరు కూడా మతాన్ని ఆశ్రయిస్తున్నారు?

మతం కాదు.. అదొక విధానం. బుద్ధుడు ఎక్క డా తాను దేవుణ్నని చెప్పలేదు. ఆయన జ్ఞానానికి ప్రతీక. ‘దేవుడే చెప్పినా నేను చెప్పినా.. రుజువు కాని మాట నిజం కాదు’ అన్నాడు బుద్ధుడు.


జీసస్‌, రాముడు.. ఇలా దేవుళ్ల మీద పాటలు ఎందుకు రాశారు?

జీసస్‌ తనకు శిలువ వేసిన వారిని కూడా.. ‘ఓ ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్లకి తెలియదు. వీళ్లని క్షమించు’ అంటాడు. పాజిటివ్‌ థింకింగ్‌కు జీసస్‌కు మించినవాళ్లెవరూ కనపడలేదు. అందుకే రాశాను తప్ప.. నాకు స్వర్గమూ వద్దు, పరలోక రాజ్యమూ వద్దు. నేను ప్రకృతే పరమాత్మ అనుకుంటాను.


మీకు పిల్లలెంతమంది?

ఇద్దరు.. ఒకబ్బాయి ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. రెండో అబ్బాయి ఇంటర్‌ పాసయ్యాడు. నా విషయానికొస్తే.. పాట అనే ఒక పెద్ద సాధనాన్ని ప్రకృతి నాకిచ్చింది. దాంతో ఈ సమాజగమనంలో ఒక మార్పు తేవాలని కోరుకుంటున్నాను.


మీకెంతో పేరు తెచ్చిన సినిమా పాటే మీ సస్పెన్షన్‌కు కారణమైంది కదా?

‘దండోరా’ సినిమాకోసం ‘కొండల్లో కోయిలపాటలు పాడాలి.. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి..’ అనే పాట రాశాను. అక్షరాలు నేర్చుకోమని పాట రాస్తే ఆర్నెల్లు సస్పెండ్‌ చేయడమంటే ఏం జెప్పాలి? చాలా బాధపడ్డాను. కానీ, అదే మంచిదైంది. ఇలాంటి అవమానాలే నన్ను బయటపడేశాయి. అలా ఎండిపోతున్న చెరువులోంచి సముద్రంలో పడేసిన మహానుభావులకు రుణపడి ఉన్నా. అయితే ఒక టి.. నా చావు వల్ల ఏదైనా ఆశయం నెరవేరుతుందంటే ఇచ్చేస్తా.. ఏముంది! మనమెవరం శాశ్వతంగా బతకడానికి రాలేదు కదా!

Advertisement
Advertisement