Abn logo
Feb 23 2021 @ 11:29AM

జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు.. జేసీ షాకింగ్ కామెంట్స్!

అనంతపురం : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు అనంతలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో ఆయన గెలుపొందుతున్నారని తెలిపారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా  అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు. అదంతా దొంగ మాట అని.. జేసీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.

అడ్వకేట్ దంపతుల హత్యపై..

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్య గురించి జేసీ మాట్లాడారు. అసలు ఈ దంపతుల హత్యలో అన్ని ఆధారాలు వున్నా విచారణ ఎందుకు..? అని జేసీ ప్రశ్నించారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్‌ తులసిగరి శ్రీనివా‌స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతడు ఇతర నిందితులతో కలిసి కుట్రలో పాల్గొని, వారికి కారు, కత్తులను అందించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 17న రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement