అధికార పార్టీ టార్గెట్.. జేసీ కుటుంబం పరిస్థితి ఏంటి..?

ABN , First Publish Date - 2020-10-13T14:18:04+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ కుటుంబానికి రాజకీయంగా, వ్యాపారపరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం రాజకీయాలను శాసించారు. అయితే ఏపీలో అధికార మార్పిడి...

అధికార పార్టీ టార్గెట్.. జేసీ కుటుంబం పరిస్థితి ఏంటి..?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ కుటుంబానికి రాజకీయంగా, వ్యాపారపరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం రాజకీయాలను శాసించారు. అయితే ఏపీలో అధికార మార్పిడి కారణంగా.. ఇప్పుడా కుటుంబం కేసుల ఉచ్చులో బిగుసుకుంది. ఆ ఫ్యామిలీ బ్రదర్స్ ఇంటి నుంచి కాలు బయట పెట్టారంటే ఓ కేసు.. నోరు విప్పి మాట్లాడితే మరో కేసు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అయితే తాము కూడా వెనక్కి తగ్గేది లేదనట్లుగా ఆ సోదరులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ వారెవరు? వారిని వెంటాడుతున్న కేసులు ఏమిటి? రాజకీయంగా తాడోపేడో తేల్చుకోవడానికి ఆ బ్రదర్స్‌ సిద్ధమయ్యారా? ప్రత్యేక కథనం మీకోసం...


ఉక్కిరిబిక్కిరి చేస్తోంది...

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయన మాట్లాడితే అది హాట్ టాపిక్. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పడం జేసీ దివాకర్‌రెడ్డి స్టయిల్. ఇక మరొకరు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఈయన. అన్న జేసీ దివాకర్‌రెడ్డి సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటే.. తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో అంతా తానై నడిపించారు. ఇలా అనంత రాజకీయాల్లో హవా నడిపిన ఈ అన్నదమ్ములిద్దరిని రాష్ట్రంలో అధికార మార్పిడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


ఒకదాని తరువాత మరొకటి...

జేసీ కుటుంబమే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయా? ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే మార్గంగా ఎంచుకున్నారా? అంటే.. వరుస పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలుత జేసీ సోదరులు నిర్వహిస్తున్న ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపారు. మోటారు వాహనాల నిబంధనలకు విరుద్ధంగా, పర్మిట్లు లేకుండా బస్సులు నడుపుతున్నారంటూ ఎక్కడి బస్సులను అక్కడే అడ్డగించి సీజ్‌ చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ట్రావెల్స్ బస్సులను షెడ్లకే పరిమితం చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే బీఎస్‌-3 వాహనాలను బీఎస్-4గా మార్చి వాహనాలను విక్రయించారనే అభియోగంపై జేసీ ప్రభాకర్‌రెడ్డిని, నకిలీ ఇన్స్యూరెన్స్ పత్రాలను తయారు చేశారంటూ ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను జూన్ 13న అరెస్ట్ చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. 54 రోజుల తర్వాత బెయిల్‌పై తండ్రీకొడుకులిద్దరూ విడుదలయ్యారు.


మరోసారి టార్గెట్...

అయితే జైలు నుండి విడుదలైన సమయంలోనూ జేసీ దివాకర్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించారు. భారీ ర్యాలీగా కడప నుంచి తాడిపత్రిలోని ఆయన స్వగృహానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారితో జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారనే కారణంతో మరోసారి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కేసు నమోదు చేశారు. ఆ కేసులో అరెస్టు చేసి తిరిగి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే ఆయనకు కరోనా సోకింది. బెయిల్‌పై వచ్చిన ఆయన నేరుగా హైదరాబాద్‌లో కొవిడ్ చికిత్స తీసుకుని, అక్కడే క్వారంటైన్ పూర్తి చేసుకుని తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు యాక్టులోని సెక్షన్‌ థర్టీని అతిక్రమించారంటూ తాడిపత్రి పట్టణ పోలీసులు మరోకేసు నమోదు చేశారు. ఇలా వరుసగా జేసీ సోదరులు కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే మరోసారి జేసీ కుటుంబం టార్గెట్ అయింది. ఈసారి ఆ కుటుంబీకుల ఆధీనంలో ఉన్న క్వారీల వంతు వచ్చింది.


మైనింగ్ విషయంలో...

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు తాడిపత్రి సమీపంలోని ముచ్చుకోటలో రెండు కోలమైట్ మైనింగ్ క్వారీలను నిర్వహిస్తున్నారు. భ్రమరాంబ మినరల్స్, ఎ. సుమన పేరుతో 6.5 హెక్టార్లలో ఉన్న క్వారీల్లో మూడు రోజుల క్రితం మైనింగ్ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తాడిపత్రిలో భూగర్భ గనులశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై జేసీ దివాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తాడిపత్రి పట్టణ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, బెదిరింపు చర్యలకు పాల్పడ్డారంటూ తాడిపత్రి పట్టణ సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం రూరల్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఎలా ఎదుర్కుంటారో...

మరోవైపు ముచ్చుకోట క్వారీల్లో మైనింగ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదనీ, మైనింగ్ మేనేజర్ పర్యవేక్షణ కూడా లేదనీ భూగర్భ గనులశాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసుకు వచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో దివాకర్‌రెడ్డికి సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనఉప్పులపాడు 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాయి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి గడువుని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతోపాటు 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వితీశారనీ, రవాణా చేశారనీ విచారణ జరుగుతోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే జేసీ కుటుంబ సభ్యులపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. మొత్తం మీద అధికార పార్టీకి జేసీ ఫ్యామిలీ టార్గెట్‌ అయిందనటంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఈ కేసులు, ఇబ్బందులను జేసీ కుటుంబం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

Updated Date - 2020-10-13T14:18:04+05:30 IST