రాంగ్‌ క్లిక్‌ చేసి ఐఐటీ సీటు కోల్పోయా

ABN , First Publish Date - 2020-12-01T07:50:45+05:30 IST

ఆన్‌లైన్‌లో అనుకోకుండా రాంగ్‌ క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయిన ఓ విద్యార్థి, న్యాయం చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 270 ర్యాంకు సాధించిన ఆగ్రాకు చెందిన సిద్ధాంత్‌ భత్రాకు ఐఐటీ బాంబేలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు లభించింది...

రాంగ్‌ క్లిక్‌ చేసి ఐఐటీ సీటు కోల్పోయా

  • తిరిగి కేటాయించేలా ఆదేశించండి
  • సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థి

ముంబై, నవంబరు 30: ఆన్‌లైన్‌లో అనుకోకుండా రాంగ్‌ క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయిన ఓ విద్యార్థి, న్యాయం చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 270 ర్యాంకు సాధించిన ఆగ్రాకు చెందిన సిద్ధాంత్‌ భత్రాకు ఐఐటీ బాంబేలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు లభించింది. అయితే అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా లాగిన్‌ అయిన సిద్ధాంత్‌కు వెబ్‌ పేజీపై  ‘ఫ్రీజ్‌’ అనే ఆప్షన్‌ కనిపించింది. ఈ ఆప్షన్‌ సీటు ఖరారు కోసమేనని పొరపాటుగా భావించిన సిద్ధాంత్‌ ఆ లింక్‌పై క్లిక్‌ చేశాడు. ఈ ఏడాది అక్టోబరు 31న అడ్మిషన్‌ వివరాలను ఐఐటీ పోర్టల్‌లో చెక్‌ చేసుకుంటుండగా ‘జోసా(జాయింట్‌ సీట్‌ అలోకేషన్‌ అథారిటీ) ప్రవేశాల ప్రక్రియ నుంచి ఉపహసంరించు కోవాలనుకుంటున్నాను’ అనే లింక్‌ కనిపించింది.


సిద్ధాంత్‌ అనుకోకుండా ఆ లింక్‌పై క్లిక్‌ చేశాడు. దీంతో ఐఐటీ ఆ సీటును రద్దుచేసి మరొకరికి కేటాయించింది. కాగా, నవంబరులో జోసా విడుదల చేసిన సీట్ల కేటాయింపు తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో జరిగిన పొరపాటును గ్రహించిన సిద్ధాంత్‌ ఐఐటీని సంప్రదించాడు. ఇప్పటికే సీట్లన్నీ భర్తీ అయినందున, అదనపు సీటు కేటాయించడం కుదరదని తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దీంతో బాంబే హైకోర్టును సంప్రదించగా ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.  ఐఐటీ సీటు కోసం ఎంతో కష్టపడి చదివానని, తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ వద్ద ఉంటున్నానని,  మానవతాదృక్పథంతో అదనంగా ఒక సీటు కేటాయించేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించాడు.  మరోవైపు... ఐఐటీ బాంబే ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. సీటు ఉపసంహరణ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, పొరపాటు జరిగే అవకాశం లేదని పేర్కొంది. చివరి విడత కంటే ముందుగా సీటును రద్దు చేసుకున్నవారికి మాత్రమే సీటును అంగీకరిస్తూ చెల్లించిన ఫీజు తిరిగి చెల్లిస్తామని తేల్చి చెప్పింది.


Updated Date - 2020-12-01T07:50:45+05:30 IST