జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నేడే

ABN , First Publish Date - 2020-09-27T08:37:28+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆదివారం జరగనుంది. రెండు పేపర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు...

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నేడే

  • పేపర్‌-1 ఉదయం, పేపర్‌-2 మధ్యాహ్నం
  • పరీక్షకు 1,60,864 మంది దరఖాస్తు
  • అభ్యర్థులకు మాస్కులు తప్పనిసరి


అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆదివారం జరగనుంది. రెండు పేపర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఈ రెండు పేపర్లూ తప్పనిసరిగా రాయాలి. ఐఐటీ-ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి నుంచి మెరిట్‌ ఉన్న 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఉన్నా.. 1,60,864 మందే దరఖాస్తుచేసుకున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అక్టోబరు 5న విడుదల కానున్నాయి. 6వ తేదీ నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించే నగరాలు, కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 164 నగరాల్లోని 600 కేంద్రాల్లో నిర్వహించగా, ఈసారి 222 నగరాలు, 1,150 సెంటర్లకు పెంచారు. అభ్యర్థులు మాస్క్‌ ధరించడంతోపాటు కొవిడ్‌-19 నిబంధనలను పాటించాలి.


ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర శనివారం విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు.  


‘వెబ్‌’లో సచివాలయ పరీక్షల కీ

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 13 శాఖల్లో ఖాళీ పోస్టులకు ఈ నెల 20న ప్రారంభమైన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆయా పరీక్షల  ప్రిలిమినరీ ‘కీ’ని గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో శనివారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ తెలిపారు.


నేడు పాలిసెట్‌-2020 

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2020) ఆదివారం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 88,484 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్ష కోసం 50 నగరాల్లో 388 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T08:37:28+05:30 IST