జేఈఈలో మెరిసిన ‘గురుకుల’ విద్యార్థులు

ABN , First Publish Date - 2021-09-17T09:24:50+05:30 IST

కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు. జేఈఈ మెయిన్స్‌లో 638 మంది విద్యార్థులు ..

జేఈఈలో మెరిసిన ‘గురుకుల’ విద్యార్థులు

మంత్రి కొప్పుల, కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ అభినందన


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు. జేఈఈ మెయిన్స్‌లో 638 మంది విద్యార్థులు మంచి పర్సెంటైల్‌తో అర్హత సాధించారు. ఈ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి మొత్తం 960 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, అందులో 638 మంది అర్హత సాధించారు. సంస్థ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, అధ్యాపక సిబ్బందిని వారు అభినందించారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ప్రైవేటు కోచింగ్‌ సంస్థలకు ధీటుగా తమ విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నామని రొనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ఐఏఎస్‌ సాధిస్తా : గాయత్రి

చిన్న వయసులో తండ్రిని కోల్పోయి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తాను.. చదువే బం గారు భవిష్యత్తుకు బాట వేస్తుందని నమ్మానని జె.గాయత్రి తెలిపారు. గాయత్రి జేఈఈ మెయిన్స్‌లో 96.1 పర్సెంటైల్‌ సాధించింది. ‘‘ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయా. తల్లి కూలి పనిచేసుకుంటూ చదివించింది. భవిష్యత్తులో ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. ఐఏఎస్‌ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా’’ అని గాయత్రి తెలిపారు.


అణగారిన మహిళలకు అండగా ఉంటా: కావ్య

వ్యవసాయం చేసుకునే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తన జీవితాన్ని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ విద్యాలయం పూర్తిగా మార్చివేసిందని ఈ. కావ్య తెలిపారు. కావ్య 97.2 పర్సెంటైల్‌ సాధించారు. ‘‘మాది వనపర్తి జిల్లా. ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా. ఐఏఎస్‌ చదివి అణగారిన మహిళలకు అండగా ఉంటా’’ అని కావ్య తెలిపారు.

Updated Date - 2021-09-17T09:24:50+05:30 IST