6 నెలలుగా జీతాల్లేవ్‌

ABN , First Publish Date - 2021-04-11T08:56:40+05:30 IST

రాష్ట్రంలోని రైతుబజార్లలో పనిచేస్తున్న సహాయకులకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఎస్టేట్‌ అధికారులకు సహాయంగా ఉంటారని వాచ్‌మన్‌, సెక్యూరిటీ గార్డు, స్వీపర్లను

6 నెలలుగా జీతాల్లేవ్‌

రైతుబజార్ల సహాయకుల ఆకలి కేకలు

జిల్లాల నుంచి పంపుతున్నా విడుదల చేయని ఆప్కోస్‌

వెంటనే విడుదల చేయాలని సిబ్బంది డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని రైతుబజార్లలో పనిచేస్తున్న సహాయకులకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఎస్టేట్‌ అధికారులకు సహాయంగా ఉంటారని వాచ్‌మన్‌, సెక్యూరిటీ గార్డు, స్వీపర్లను రైతుబజార్లలో నియమించారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.10,470 జీతం. ఎస్టేట్‌ అధికారులకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఖాతా నుంచి నేరుగా జీతాలు అందుతున్నాయి. వారంతా కాంట్రాక్టు సిబ్బంది. సహాయకులను మాత్రం ఔట్‌ సోర్సింగ్‌లో చేర్చారు. గతేడాది జూలై వరకు జాయింట్‌ కలెక్టర్‌ ఖాతా నుంచి జిల్లా ఔట్‌ సోర్సింగ్‌ విభాగానికి, అక్కడి నుంచి వీరికి జీతాలు అందేవి. ఆ తరువాత సహాయకులందరినీ ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌(ఆప్కో్‌స)లో చేర్చారు. అప్పటి నుంచి సహాయకుల జీతాలను అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ప్రతి నెలా ఆప్కో్‌సకు పంపితే, అక్కడి నుంచి సహాయకుల ఖాతాల్లో వేస్తున్నారు.


ఈ మార్పు జరిగిన తరువాత కేవలం రెండు నెలలే జీతాలు అందాయి. గతేడాది అక్టోబరు నుంచి జీతాలు అందడం లేదు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి క్రమం తప్పకుండా వీరి జీతాలు ఆప్కోస్‌ ఖాతాకు వెళ్తున్నాయి.  అక్కడి ఉంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం లేదు. కొన్ని జిల్లాల్లో  రైతుబజార్లు నష్టాల్లో ఉన్నందున ఆ జిల్లాల నుంచి జీతాల మొత్తం ఆప్కో్‌సకు వెళ్లడం లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ జీతాలు నిలిపివేసినట్టు సమాచారం. ఈ అంశం మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ వద్ద వుందని సమాచారం.


ఎలా బతకాలి..? 

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో పనిచేస్తున్న వాచ్‌మన్‌, సెక్యూరిటీ గార్డ్‌, స్వీపర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకు మాత్రం నెలనెలా జీతాలు అందుతున్నాయి. వీరు కూడా ఆప్కో్‌సలోనే ఉన్నా స్థానిక మార్కెట్‌ కమిటీ నుంచి జీతాలు ఇస్తున్నారు. రైతుబజార్లలో పనిచేసే వారికి మాత్రం ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 80 పైచిలుకు రైతుబజార్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ సహాయకులు ఉన్నారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, పిల్లల చదువులు ఎలా సాగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి జీతాలు విడుదల చేయాలని వీరంతా కోరుతున్నారు. 

Updated Date - 2021-04-11T08:56:40+05:30 IST