ఆధునికీకరణపై హైరానా

ABN , First Publish Date - 2020-05-22T10:30:01+05:30 IST

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఐదోదశ రెన్నోవేషన్‌ అండ్‌ మోడర్నైజేషన్‌(ఆర్‌అండ్‌ఎం) ఆధునికీకరణపై

ఆధునికీకరణపై హైరానా

కేటీపీఎస్‌ ఐదోదశ ఆర్‌అండ్‌ఎం పనుల్లో తీవ్ర జాప్యం

ఇప్పటికే రూ.100కోట్ల కేటాయింపు

కోవిడ్‌-19తో ప్రణాళికలు తారుమారు

నిపుణులు, వలసకార్మికుల రాకపై సందేహాలు

జూన్‌1నుంచి పనులు ప్రారంభానికి జెన్‌కో సన్నాహాలు


కేటీపీఎస్‌(పాల్వంచ), మే 21 : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఐదోదశ రెన్నోవేషన్‌ అండ్‌ మోడర్నైజేషన్‌(ఆర్‌అండ్‌ఎం) ఆధునికీకరణపై హైరానా కనిపిస్తోంది. 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారంలోని రెండు యూనిట్లను దఫదఫాలుగా ఆధునికీకరించాలని గతేడాది నిర్ణయించిన జెన్‌కో.. ఇందుకోసం రూ.100కోట్లను కేటాయించింది. గత అక్టోబర్‌లోనే ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవగా కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని 800మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడోదశను వార్షిక మరమ్మతులకోసం నిలిపేశారు. యూనిట్‌లో జటిలమైన సాంకేతిక సమస్య తలెత్తడంతో సుమారు 90రోజుల పాటు యూనిట్‌ నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో ఐదోదశ ఆధునికీకరణ పనులు వాయిదా పడ్డాయి.  


ఐదోదశ ప్రస్థానం

సుమారు రూ.4వేల కోట్లు వెచ్చించి కేటీపీఎస్‌ ఐదోదశను 1997- 1998లో జెన్‌కో నిర్మించింది. 250మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారంలోని తొమ్మిదో యూనిట్‌లో 1997అక్టోబరు 1న, 1998సెప్టెంబరు 1న పదో యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించారు. ఈ రెండు యూనిట్లు రెండు దశాబ్దాల జీవిత కాలాన్ని పూర్తిచేసుకున్న నేపఽథ్యంలో చీఫ్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ(సీఈఏ) నిబంధనల మేరకు ఆర్‌అండ్‌ఎం చేయాలనే కార్యాచరణ రూపొందించారు. కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్‌లో 250మెగావాట్లకుగాను 220 మెగావాట్లు, పదో యూనిట్‌లో 240మెగావాట్లు మాత్రమే ఉత్పత్తవుతుండటంతో జెన్‌కో యాజమాన్యం యూనిట్ల మరమ్మతులపై దృష్టి పెట్టింది. 


పనుపై కరోనా ప్రభావం..

ఐదోదశ ఆధునికీకరణ పనులకు చెన్నై, పూనె, బెంగళూర్‌, హరిద్వార్‌ తదితర ప్రాంతాలనుంచి నిపుణులు రావాల్సి ఉంటుంది. కర్మాగారంలోని ఎయిర్‌ హీటర్‌ పనులను చెన్నై, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కంట్రోల్‌ బోర్డు పనులను బెంగళూరుకు చెందిన నిపుణులు, కోల్‌ప్లాంట్‌ పనులను పూనె నిపుణులు చేపట్టాల్సి ఉంటుంది. సుమారు 45రోజుల పాటు నిర్వహించే తొమ్మిదో యూనిట్‌ పనులు చేసేందుకు బీహెచ్‌ఈఎల్‌ ఆధీనంలో బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలనుంచి వలస కార్మికులు రావాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్‌, వైరస్‌ వ్యాప్తి భయంతో వలస కార్మికులు ఇప్పుడంతలో ఇక్కడి రావటం కష్టంగా మారింది. దీంతో పనుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది.    


సామగ్రి సిద్ధం..

ఆధునికీకరణ పనులకు సంబంధించిన సామగ్రిని బీహెచ్‌ఈఎల్‌ కర్మాగారానికి ఇప్పటికే చేరవేసింది. మరికొంత సామగ్రి రావాల్సి ఉండగా.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సరఫరాకు అవరోధం ఏర్పడింది. వీటిలో ప్రధాన భాగాలైన ఎయిర్‌హీటర్‌ను సుమారు రూ.15కోట్లతో, కంట్రోల్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌ను రూ.70కోట్లతో ఆధునికీకరించనున్నారు. సుమారు 100మంది టెక్నీషియన్లు, ,ఇంజనీర్లు ఈ పనుల్లో అవసరం కాగా ఎంతమంది వస్తారో అర్థకాని పరిస్థితి ఏర్పడింది. 


త్వరలోనే ఆర్‌అండ్‌ఎం పనులు ప్రారంభిస్తాం: రవీందర్‌కుమార్‌, కేటీపీఎస్‌ 5,6దశల సీఈ 

కేటీపీఎస్‌ ఐదోదశలో ఆర్‌అండ్‌ఎం పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం. జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సారథ్యంలో నిర్వహించే ఈపనులను జెన్‌కో డైరెక్టర్లు పర్యవేక్షిస్తారు. జూన్‌ 1నుంచే పనులు చేసుకొమ్మని జెన్‌కో నుంచి అనుమతి వచ్చింది. బీహెచ్‌ఈఎల్‌ ఆదేశాలతో ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చాం. కేటీపీఎస్‌లో ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక బీహెచ్‌ఈఎల్‌ చేతుల్లోనే పనుల పురోగతి ఆధారపడిఉంది. 


Updated Date - 2020-05-22T10:30:01+05:30 IST